అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో…..


💐🇮🇳💐 ఆటవెలదులు 💐🇮🇳💐

1) వనిత చేతగాని పనిలేదు వసుధలో
నేర్పు , ఓర్పు గలిగి నెలత జేయు
అలసటెరుగకుండు, ఆలనా పాలనా
కన్నసంతు సమము కరుణ జూపు
2)
అంతరిక్ష మంత అవలీలగా తిరిగి
క్షిపణులను విడిచిన చిన్న “లేమ”
నింగి నీకు హద్దు,నీ గుండె నీబలం
“వారి “గావు ” వింటి నారి ” వమ్ము !
3)
సానియా,కరణము,సాక్షి, మేరీకోము
హంపి,సింధు,ఉష,అంజు,జార్జి
ఎందరో మహిళలు ఎదుగుట కూతము
ఇచ్చి ప్రోత్సహించు,హితము గూర్చు !
4)
కష్టకార్యములను “కోమలి”చేయదు
“స్త్రీలు” “సున్నితు”లని చీత్కరింప
అట్టి పనులజేసి “అబలలం కామ”ని
నిలిచి గెలిచి తెలిపె ” నేటి మహిళ” !
5)
కదనరంగమందు,కడలి యంచులయందు
పారిశుధ్య మందు, పాడి యందు
సైన్యమందు,వైద్య సేవలందే గాక
ఇంటిపనులు ,పెక్కు వంట ” వనితె” !
6)
కాళ్ళతో గురినిడి, కరములు లేకున్న
” విల్లు” ఎక్కుపెట్టి విజయమందె
స్వర్ణ ,రజతములను సాధించె ” శీతల”
జమ్ము కాశ్మిరమ్ము నిజమ్ము గాను!
7)
అంతరిక్ష మంత ” అవలీల ” గా తిరిగి
రణము గెలిచి ” రమణి” రాజ్యమేలె
రాజకీయమందు రాణించె ” లేమలు “
రాష్ట్రపతిగ ” ముర్ము ” రాణకెక్కె !
8)
నేటి మహిళలంత మేటిగా పోటీకి
పురుషుల సమమంటు ” పోరు” సలిపి
విజయమందిరి తమ విజ్ఞాన మును జూపి
అన్ని రంగములను ఆవరించి !
9)
మహిళ లేనిచోటు మహిలోన కనరాదు
అన్ని రంగములకు ఆదిశక్తి
పురుషునకును ఊత పుట్టినప్పటి నుండి
మహిళ తోడు లేక మనుగడేది?
10)
మహిళ మనసు దృఢము,మరలదు వెనుకకు
తలచినట్టి పనిని తప్పకుండు
“శక్యమా!యిది” యన సాధించి తీరును
వనిత లోకమునకు ” వందనములు” !

                                                                             -------కోట పెంటయ్య 

విశ్రాంత భాషోపాధ్యాయులు ,కారేపల్లి
ఖమ్మ జిల్లా. 9014977041 .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *