అంధకారం చేస్తుంది
యవ్వనం అనేది జీవితంలో అత్యంత విలువైన దశ. ఈ వయస్సులో కలలు, ఆశలు, లక్ష్యాలు, సాధించాలనే తపన ఎక్కువగా ఉంటాయి. వ్యక్తిత్వ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు యవతే బలమైన పునాది. అయితే నేటి సమాజంలో అనేక కారణాల వల్ల ఈ అమూల్యమైన యవ్వనం కాలిపోతూ, దారి తప్పుతోంది. ఇది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు, సామాజిక సమస్యగా కూడా మారింది.
సాంకేతిక పరిజ్ఞానం మనిషి జీవితాన్ని సులభతరం చేసినా, దాని దుర్వినియోగం యువతను ఒంటరితనంలోకి నెడుతోంది. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్ ఆటలకు బానిసలై విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. నిజ జీవితానికి దూరమై, వర్చువల్ ప్రపంచంలో మునిగిపోతున్నారు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గి, మానసిక ఒత్తిడి పెరుగుతోంది.
మాదకద్రవ్యాలు, మద్యం, చెడు స్నేహాలు కూడా యువతను పతనానికి గురిచేస్తున్నాయి. క్షణిక ఆనందం కోసం వ్యసనాలకు బానిసలై ఆరోగ్యాన్ని, కుటుంబ గౌరవాన్ని, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి వ్యసనాల బారిన పడితే బయటపడటం ఎంతో కష్టమవుతుంది.
నిరుద్యోగం కూడా యువతలో నిరాశను పెంచుతోంది. చదువుకున్నా సరైన ఉద్యోగం దొరకక చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. కొందరు తప్పుదారులు ఎంచుకుంటే… మరికొందరు తమ ప్రతిభపై నమ్మకం కోల్పోతున్నారు. ఇదే పరిస్థితి సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం యువతకు సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలతో… స్నేహపూర్వకంగా మెలిగి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ, మంచి విలువలను పెంపొందించాలి. యువత కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మంచి పుస్తకాలు చదవడం, క్రీడలు, కళలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వ్యక్తిత్వాన్ని వికసింపజేయాలి.
యవ్వనం కాలిపోవాల్సినది కాదు , వెలుగునిచ్చే దీపంలా ప్రకాశించాల్సినది. ప్రతి యువకుడు తన జీవితాన్ని లక్ష్యంతో నింపుకుని, కష్టపడే తత్వాన్ని అలవర్చుకుంటే కుటుంబానికే కాదు, దేశానికీ గర్వకారణం అవుతాడు. యువశక్తి సరైన దిశలో ప్రయాణిస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది. అందుకే కాలిపోతున్న యవ్వనాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి.
యువత ఒక అద్భుతమైన వనరు. వారు కాలిపోకుండా, ప్రకాశించేలా చేయాల్సిన బాధ్యత సమాజం, ప్రభుత్వం, తల్లిదండ్రులు అందరిపై ఉంది. సరైన దారిచూపితే, ఇదే యువత సమాజాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే ఒక గొప్ప శక్తిగా మారుతుంది. లేకపోతే, ఈ కాలిపోతున్న యవ్వనం రేపటి భవిష్యత్తును అంధకారం చేస్తుంది.
ఈనాటి యువత యవ్వనంలో ఇంద్రియాల నిగ్రహం లేకుండా చాలా మంది వారిని ఆగ్నిలో కాలిపోతున్న యవ్వనం అవుతుందని ముందు వెనక ఆలోచించకుండా వారి యవ్వనంలో పుట్టే కోరికలను తీర్చుకుంటున్నారు. తర్వాత భవిష్యత్తులో ఒంటరిగా మిగిలిపోతున్నారు.
అయిన అందరి కోరికలు ఉంటాయి. కానీ వాటిని నియంత్రించుకునే నిగ్రహం కూడా ఉండాలి.
మాధవి కాళ్ల