ఆ రోజు ఆ బెంచీ మీద కూర్చున్న అరుణ్ కి లోకం అంతా కేవలం నీలి వర్ణంలో, తడిసిన మసకగా కనిపించింది.
ఆకాశం ఏడుస్తున్నట్టుగా చినుకులు దట్టంగా కురుస్తున్నాయి. అరుణ్ తలమీద టోపీ, శరీరంపై వర్షం పడకుండా జాకెట్ ఉన్నప్పటికీ, అతని గుండె మాత్రం పూర్తిగా తడిసిపోయింది.
వర్షం అతని ఒంటరితనాన్ని మరింత పెంచింది.
అరుణ్‌కు ఆ పార్క్ లో ఆ బెంచీపై కూర్చోగానే…
అన్నీ ప్రియమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి. సరిగ్గా ఇదే బెంచీ మీద, ఐదేళ్ల క్రితం, అతని ప్రేయసి మేఘన అతనికి వీడ్కోలు చెప్పింది. ప్రేమగా కాదు, మౌనంగా.
మేఘన ఎప్పుడూ వర్షాన్ని ప్రేమిస్తుంది.
“వర్షం పడినప్పుడు ప్రపంచం తన బాధనంతా కడిగేసుకుంటుంది. అంతా కొత్తగా, శుభ్రంగా ఉంటుంది” అని చెప్పేది.
కానీ , ఆ రోజు, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను కూడా కడిగేసుకుంటూ వర్షం కురిసింది.
అరుణ్ ఒక కళాకారుడు. ప్రతిభ ఉన్నా, ప్రపంచానికి తనను తాను నిరూపించుకోవడానికి సమయం పట్టింది. మేఘన అతన్ని అద్భుతంగా ప్రేమించింది.
కానీ , వారి పేదరికం, అనిశ్చితి ఆమె కుటుంబానికి నచ్చలేదు. ఆ రోజు, ఆర్థిక భద్రత లేని జీవితం కంటే, తన తల్లిదండ్రుల ఆనందం ముఖ్యం అనుకుంది.
“నేను నీకు బరువుగా ఉండలేను అరుణ్. నువ్వు విజయం సాధిస్తావని నాకు తెలుసు. కానీ , నేను వేచి చూడలేను” అని చెప్పిన మేఘన మాటలు, ఈ వర్షపు చప్పుడులో మళ్లీ అతన్ని వెంటాడుతున్నాయి.
నిజమే! మేఘన ఊహించినట్టే అరుణ్ జీవితంలో పెద్ద మలుపు వచ్చింది.
అతను గీసిన చిత్రాలు ప్రదర్శనలకు ఎంపికయ్యాయి. విదేశాల నుండి కూడా ఆహ్వానాలు వచ్చాయి. ఇప్పుడు అరుణ్ విజయవంతమైన, ధనవంతుడైన కళాకారుడు. అతని చుట్టూ ఇప్పుడు కీర్తి, డబ్బు తిరుగుతున్నాయి.
కానీ , ఈ విజయం కేవలం బయటి కవచం మాత్రమే. లోపల అతను ఇంకా అదే పాత బెంచీ మీద, మేఘన కోసం ఎదురుచూసే పేద కళాకారుడే.
అతని కళ్ళ ముందు ఇప్పుడు డబ్బు ఉంది, పేరు ఉంది. కానీ , మేఘన లేదు.
అతనికి వర్షంలో నడవడానికి ఒక ఖరీదైన గొడుగును కొనే శక్తి ఉంది. కానీ , ఆ వర్షంలో తనతో పాటు నడిచే మనిషి లేదు.
వర్షం పెరిగింది. అరుణ్ జాకెట్ జేబులోంచి తన మొదటి నల్ల-తెలుపు పెయింటింగ్ ఫోటోను బయటకు తీశాడు. అది వర్షంలో తడిసిన ఈ పాత బెంచీ చిత్రమే. ఈ బొమ్మను చూసి నవ్విన మేఘన మొహం గుర్తుకొచ్చింది.
ఆ ఫోటోను తన చినుకులుతో తడిపేస్తోంది. కానీ , ఆ తడిలో అరుణ్ కళ్లల్లో నీరు కలిసింది.
“విజయం అంటే ఏమిటి మేఘన? ప్రపంచం మెచ్చే డబ్బు, పేరునా? లేక నా మనసు తలచుకునే ఈ ఒంటరితనమా?” అని మనసులో ప్రశ్నించుకున్నాడు.
తన గతాన్ని, వైఫల్యాలను, విజయాలను, ఒంటరితనాన్ని ఈ వర్షం మొత్తం కడిగేస్తుందనే ఆశతో, అరుణ్ ఆ వర్షంలో కదలకుండా కూర్చున్నాడు.
అతని జీవితం ఇంకా ముగిసిపోలేదు. ఈ ఒంటరితనం అనేది ఒక కళాఖండం లాంటిది. దానికి రంగులు లేకపోయినా, దాన్ని అనుభవించిన వారికే దాని లోతు తెలుస్తుంది.
ఆ వర్షపు చప్పుడులో, అరుణ్ ఒక కొత్త పెయింటింగ్‌కు సరికొత్త స్ఫూర్తిని, కొత్త రంగును వెతుకుతున్నాడు ఆనందంతో తడిసిన కొత్త జ్ఞాపకాలతో…
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..