(అ)ధర్మచక్రం -కథానిక

(అ)ధర్మచక్రం -కథానిక

(అ)ధర్మచక్రం -కథానిక

​ప్రభుత్వ కార్యాలయం అంటేనే అవినీతికి నిలయం అని ముద్రపడిన ఆ ఆఫీసులో వెంకట్రావు ఒక విచిత్రమైన పాత్ర. అందరూ ‘పై’ సంపాదనతో విలాసాలకు అలవాటు పడితే, వెంకట్రావు మాత్రం తనకున్న జీతంతోనే తృప్తిగా జీవించే ఒక సామాన్య మధ్యతరగతి జీవి. అతని అమాయకత్వాన్ని చూసి ఆనందరావు అండ్ కో ఎప్పుడూ ఎగతాళి చేస్తుండేవారు.

​ఒకరోజు ఆనందరావు తన సహచరులతో కలిసి వెంకట్రావుని హేళన చేస్తూ, “ఏంటో వెంకట్రావు గారు! ఈ కాలంలో కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎలా? లోన్ కట్టి, ఈఎంఐల కోసం జీవితాన్నే పణంగా పెడుతుంటే.. మేమేమో ఫామ్ హౌస్‌లు, విలాసవంతమైన కార్లతో కాలక్షేపం చేస్తున్నాం. బతకడం చేతకాని వాడికి సమాజంలో గౌరవం ఉండదు తెలుసా?” అన్నాడు.

​వెంకట్రావు చిరునవ్వుతో, “ఆనందరావు గారూ.. ఆ ఈఎంఐ కట్టేటప్పుడు కలిగే ప్రశాంతత, రాత్రి పడుకున్నప్పుడు వచ్చే గాఢ నిద్ర దేవుడిచ్చిన వరం. మీరు సంపాదించే అక్రమ ధనం మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తే, నా నిజాయితీ నాకు ధైర్యాన్ని ఇస్తుంది” అని బదులిచ్చాడు.

​నిప్పు లేనిదే పొగ రాదు కదా! ఆనందరావు చేస్తున్న అక్రమాలపై హెడ్ క్వార్టర్స్‌కు ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి, కఠినమైన అధికారిగా పేరున్న ‘వేలాయుధన్’ని ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించింది.ఏపనైనా ధనాధన్ అంటూ ఫాస్ట్ గా చేస్తాడన్న పేరుండటంతో అతనికి ధనాధన్ వేలాయుధన్ అన్న పేరొచ్చింది..

​’ధనాధన్’ వేలాయుధన్ రాకతో ఆఫీసులో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఆనందరావు బృందం అతన్ని ‘మేనేజ్’ చేయడానికి రకరకాల ఎరలు వేశారు. ఒకరోజు వేలాయుధన్ గదిలోకి వెళ్ళిన ఆనందరావు, ఒక భారీ కవరును టేబుల్ మీద పెట్టి, “సార్, చిన్నపాటి పొరపాట్లు సహజం. ఇది మీ చిన్న ఖర్చుల కోసం.. మిగతాది పని పూర్తయ్యాక చూసుకుందాం” అని గుసగుసలాడాడు.

​వేలాయుధన్ నవ్వుతూ ఆ ప్యాకెట్లు తీసుకుని, “అవునా.. ఇంత ప్రేమ చూపిస్తున్నారే! నేనెందుక కాదనాలి..సరే, అలాగే చూద్దాం!” అన్నాడు.

ఇది చూసిన ఆనందరావు బయటకు వచ్చి, “చూశావా వెంకట్రావు? ప్రపంచంలో నిజాయితీ అనేది పేపర్ల మీద మాత్రమే ఉంటుంది. వేలాయుధన్ కూడా మా భాష అర్థం చేసుకున్నాడు” అని ఎద్దేవా చేశాడు.

​కానీ, రెండు నెలల తర్వాత ఏసీబీ దాడులు జరిగినప్పుడు ఆనందరావు బృందం షాక్ కి గురైంది. దర్యాప్తు పూర్తయ్యాక వేలాయుధన్, వెంకట్రావుని పిలిచాడు.

​”వెంకట్రావు, గుర్తున్నానా? క్లాస్‌మేట్స్ మనం! ఇన్నేళ్లయినా నువ్వు మారలేదు, నీ విలువలు మారలేదు,” అన్నాడు వేలాయుధన్ ఆత్మీయంగా.

​ఆశ్చర్యపోయిన వెంకట్రావు, “నువ్వేనా ఆ వేలాయుధన్? గుర్తుపట్టలేకపోయాను..అప్పుడు వాళ్ళు నిన్నుకూడా మేనేజ్ చేశాం అన్నారు..మరి నీకు ఇచ్చిన లంచం..?” అని అడిగాడు.

​వేలాయుధన్ గంభీరంగా, “అవన్నీ ‘ఎవిడెన్స్’ కింద రికార్డు చేశాను. ఆ రోజే ఆనందరావు అవినీతి పర్వం బయటపడింది. కానీ, దాన్ని కోర్టులో నిరూపించడానికి మీలాంటి వారి సాక్ష్యం, ఆ రోజు తీసుకున్న ఆ లంచమే వారి మెడకు చుట్టుకున్న ఉరితాడులుగా మారాయి!” అని చెప్పాడు.

​ఆనందరావు ఆస్తులన్నీ సీజ్ అవుతుంటే, వెంకట్రావు మౌనంగా తన పనిలో నిమగ్నమయ్యాడు. జైలు గడప తొక్కుతున్న అవినీతిపరులను చూస్తూ, ఏసీబీ ఆఫీసులో వేలాయుధన్ ఒక సంతృప్తికరమైన నిట్టూర్పు విడిచాడు.

​వెంకట్రావు లాంటి మనుషులు, వేలాయుధన్ లాంటి అధికారులు ఉన్నంత కాలం వ్యవస్థలో మార్పు ఆశించవచ్చు. కానీ, వేళ్ల మీద లెక్కపెట్టగలిగే వేలాయుధన్లు లెక్కలేనంతగా పెరిగిపోయిన ఆనందరావుల మధ్య
ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందా అని ‘ధర్మం’ ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.

​సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *