కలిపిన పెదవుల పిలుపు అమ్మా
జన్మతో పుట్టిన అరుపు అమ్మా..!!
నుదుటన బ్రహ్మరాసిన రాతలెన్నున్నా
అవనిపై అమ్మపాడిన జోలపాటలే మిన్నా
ఆకలి కడుపులు నింపే అమృతమైనావు
బాధ్యతలు మరువని బాసటవైనావు…
కష్టమైనా తడారని ఆత్మకథలతో నడిచావు
మదిలో అనంత భావాలకు పాదువైనావు…
విధి రాయలేని పుస్తకం
బతుకును నడిపించిన సంతకం..!!
నిండైన నీ హృదయంతో పూజితమైన
ఆ త్యాగాలు మొలిచిన రూపాలెన్నో…
ఆ పరిచయంతో నెగడిన స్నేహాలెన్నో…
తలచిన మాకు అమ్మంటే అర్థమదేనేమో…
వెన్నెల్లో చంద్రుణ్ణి పిలిచావు
ఆనందాన్ని పాలబువ్వలుగా కలిపావు
బంధాలతో కలిసి బాధలను చూపవు..!!
కాలంతో నడకలు అదెంత దూరమైనా…
ఆగవు ఆగని సమయానికి వేదనవుకావు
తూరుపు పడమరల మధ్యన జీవితంతో…
ప్రతి రోజులో క్షేమాన్ని మాకై తొలిచావని
తలచిన మాకు అమ్మంటే అర్థమదేనేమో…
గుబులైనా గుణానికి గుచ్చుకోవు
దిగులైనా దినాలను బతిమిలాడవు..!!
బండబారిన మనస్సులతో సహవాసమే…
చీకటిని కట్టిన దివిటీలతో వెలుగు రేఖవై
దోసిటి పై దారిని మాకై మొలుచుకొంటావు
ఏదేమైనా అంతులేని కథలతో ప్రయాణమని
తలచిన మాకు అమ్మంటే అర్థమదేనేమో…
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688296