అమ్మాయి కోసం పార్ట్ – 3

శ్రావణ్ ఒక ఫోటో స్టూడియోలో పని చెస్తూ ఉంటాడు. అతను భార్గవి ని చూడగానే ప్రేమలో పడతాడు. కానీ ఇద్దరూ ఎవరూ ఎవరికి చెప్పుకోలేదు. కానీ కలవకుండా ఉండలేని పరిస్థితి. అలా కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు, భార్గవి అన్న వారిని చూస్తాడు.అతని స్నేహితులు కామెంట్ చేయడం తో,వారిని ఏమి అనలేక , కోపంగా వెళ్లిపోతాడు. ఇవేవీ తెలియని భార్గవి,శ్రావణ్ లు చీకటి పడడం తో , ఇంటికి వెళ్లి పోతారు.ఇది ఇప్పటి వరకు జరిగిన కథ..ఇక చదవండి…

మాణిక్యం ఇంటికి వచ్చే సరికి భార్గవి తల్లితో నవ్వుతూ మాట్లాడుతుంది.ఇంట్లో తల్లి,భార్గవి మాత్రమే ఉన్నారు,చిన్న చెల్లి అమృత తొమ్మిదో తరగతి చదువుతుంది.ఎండాకాలం సెలవులు కాబట్టి పక్కుర్లో ఉంటున్న మామయ్య ల దగ్గరికి వెళ్ళింది.భార్గవి తల్లి తో నవ్వుతూ మాట్లాడ్డం  చూడగానే మాణిక్యం కు శ్రావణ్ తో నవ్వుతూ మాట్లాడిన దృశ్యమే కనిపించింది. అతని స్నేహితులు ఎద్దేవా గా అన్న మాటలు గుర్తొచ్చి,గబగబా వెళ్లి భార్గవి చేయి పట్టుకుని తన వైపుకి తిప్పుకుని, చెంపల మీద ఎలా పడితే అలా కొట్టసాగాడు.చెల్లిని ఎప్పుడూ ఏమి అనని వాడు,అలా కొట్టడం చూసిన తల్లి  ముందు బిత్తరపోయింది . ఆ తర్వాత కర్తవ్యం గుర్తొచ్చి,ఏంటి రా ఇది దాన్నెoదుకు కొడుతున్నావ్, అని అంటూ అడ్డు రాబోయింది, దాంతో ఇంకా రెచ్చిపోయిన మాణిక్యం తల్లిని గట్టిగా తోసేశాడు..

అనుకోకుండా తల్లి అతను కొట్టిన దెబ్బకి వెళ్లి ,అక్కడే ఉన్న రోలు మీద పడింది. పడగానే అమ్మా అని అంటూ అరిచింది తల్లి అరుపు విన్న మాణిక్యం, చెల్లిని కొట్టడం ఆపి, అమ్మా అంటూ దగ్గరికి వచ్చాడు. కాని ఆమె అప్పటికే చనిపోయింది. ఒళ్లు తెలియని కోపం లో , ఎవరో ఎదో అన్నారని, చెల్లిని కొట్టబోయి, తల్లిని చంపేశాడు మాణిక్యం.,ఒళ్ళు తెలియని ఆవేశం లో,తానెం చేస్తున్నాడో కూడా తనకే తెలియని స్థితి లో,ఎదో అనుకుని చెల్లిని కొట్టాలని అనుకోని వస్తే,తన తల్లి అడ్డుగా రావడం,తన చేతిలో ఇలా అవడం తో అతనికి ఏమి చేయాలో అర్ధం కాక, అలా మ్రాన్పుండి పోయాడు. తల్లి అచేతనంగా,కదలక, మెదలక పోవడం తో  భార్గవి భయం తో గట్టిగా ఏడుస్తూ,తల్లిని అమ్మా లే అమ్మా అంటూ  తల్లిని కుదపసాగింది.అప్పుడే బైక్ మీద వచ్చిన తండ్రిని పట్టుకుని ఏడుస్తూ జరిగిన సంగతి చెప్పింది.అది విన్న తండ్రి లోపలికి వెళ్ళాడు అదుర్దగా, అతను వెళ్లి చూసే సరికి ఏముంది? సావిత్రమ్మ నెత్తుటి మడుగులో పడి ఉంది, అది చూసిన నారాయణ కి ఏం చేయాలో అర్థం కాలేక , అక్కడే ఏడుస్తూ, ఇంకా ప్రాణం ఉందేమో నని, సావి,సావి అంటూ కదుపుతూ ఉన్నాడు. కానీ అప్పటికే ప్రాణాలు పోయిన సావిత్రమ్మ ఇంకేం మాట్లాడుతుంది…

అయ్యో నా భార్య ని పొట్టన పెట్టుకున్నావు కదా రా ఇంకా  ఏ మొఖం పెట్టుకుని పది మందిలోకి పోవాలి రా,ఉన్న బలగం ల అందరూ తల్లిని సంపునవు అని అంటారు రా,ఉత్తగా అంటే కాదు,పాపం నా  పెళ్ళాం ఏ పాపం తెల్వని దాన్ని,అలా ఎలా చంపినవు రా,ఏమైంది బిడ్డా అని అడిగాడు ఏడుస్తూనే నాయిన గది కాదు అంటూ ఉన్న విషయం అంతా వివరించి చెప్పాడు మాణిక్యం.అంతా విన్న నారాయణ బిడ్డా నువ్వు కోపం లో తోసినవు,దాని పానం పోయింది,కానీ ఈ సంగతి బంధువుల కు తెలిస్తే పొరపాటు అనుకోరు బిడ్డా,తల్లి ఏ తప్పు చేసిందో,అందుకే కొడుకు సంపిండు అని అంటారు.అది కాకుండా మీ అమ్మకు అయిదుగురు అన్నదమ్ములు వాళ్ళకి ఏమో ఒక్కతే  చెల్లె  చెల్లె అంటే వాళ్ళకి  ప్రాణం, నన్ను,నన్ను బతకనియ్యారు బిడ్ద ఇది తెలిస్తే  అనవసరంగా నిప్పు లాంటి మీ అమ్మ మీద నింద పడుతది బిడ్డా,ఇప్పుడు ఏం జెయ్యలే,నువ్వు తల్లిని చంపి ,జైలు కు పోతే  చెల్లెను ఎవరు చేసుకుంటారు బిడ్డా అంటూ ఎడవసాగాడు నారాయణ.

మాణిక్యం అన్ని వింటూ అలాగే బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. తాను కోపం లో చేసిన పని కి కుటుంబం మొత్తం బాధ పడతారని గ్రహించి, ఒక నిర్ణయానికి వచ్చినట్టు గా తండ్రి వద్దకు వెళ్లి “”నాయిన పోని అవన్నీ ఎం తెల్వకుండా అమ్మ అంత్యక్రియలు చేద్దాం అన్నాడు. ” దానికి నారాయణ అతన్ని చూస్తూ ” బిడ్డా మర్షినవ,ఈ ఊర్ల సగం మంది మీ అమ్మ చుట్టలే ఉన్నారు.వాళ్ళుకు ఏమన్నా అనుమానం వచ్చింది అంటే మాత్రం మనం ప్రాణాలతో ఉండము.నాకన్నా ఎక్కువ సుట్టాలు మీ అమ్మ కే ఉన్నారు”. అన్నాడు. అవును నిజమే తండ్రి ఈ ఊరికి  ఇల్లరికం అల్లునిగా వచ్చిన సంగతి.మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు మాణిక్యం మళ్ళీ మొదటికి వచ్చి. అన్నయ్య, తండ్రి మాటలు వింటున్న భార్గవి తనకి ఏమి చేయాలో తెలియక శ్రావణ్ కి ఫోన్ చేసి,విషయం అంతా చెప్పి,ఏమన్నా సహాయం చేయమని అంది. నేను వస్తున్నా అని అంటూ ఫోన్ పెట్టేసాడు శ్రావణ్.

భార్గవి లోపలికి వెళ్లి,నాన్నా ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది మీరేమి ఆలోచించకండి అని తల్లి పక్కనే కూర్చుంది.కానీ నారాయణ కుభార్య  ఆంటే చాలా ప్రేమ,ఇరవై అయిదేళ్ల కాపురం లో ఎప్పుడూ భార్యని భార్యల కాకుండా ఒక స్నేహితురాలు గా చూసాడు.వారిద్దరూ అన్ని విషయాల గురించి మాట్లాడుకునే వారు.ఎవరికి తెలియని విషయాలు ఎన్నో వారి మధ్య వచ్చేవి, రహస్యాలు అనేవి లేవు వారికి.నారాయణకు ఎవరూ లేరు .సావిత్రి ఆయన్ని ఇష్టపడి అన్నలకు చెప్పి మరి పెళ్లి చేసుకుంది.అప్పటి నుండి ఇప్పటి వరకు వారెంతో బాగున్నారు.అలాంటిది సడెన్ గా భార్య చనిపోవడం,అది కొడుకే పొరపాటున చంపడం చూసి ఆయన పిచ్చిపిచ్చిగా చూస్తూ,తనలో తానే ఎదో గొణునుతున్నాడు.

ఇంతలో శ్రావణ్ వచ్చాడు.శ్రావణ్ ని చూడగానే మాణిక్యం కోపం కట్టలు తెంచుకుంది.” ఒరేయి నువ్వు ఎందుకు వచ్చావు రా ఇక్కడికి,వెధవ,ఇదిగో చూడు నీ వల్లే మా అమ్మని చంపుకున్నాం,నీ వల్లే నా తండ్రి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నువ్వు నా చెల్లి తో ఎందుకు నవ్వుతూ మాట్లాడావు,అని అంటూ తనకి తెలియకుండానే ఏడుస్తూ చెప్తున్నాడు మాణిక్యం” కొడుకు మాటలు  విని తలెత్తి చూశాడు నారాయణ, అక్కడ శ్రావణ్ కనిపించాడు అతనికి, ” శ్రావణ్ మాణిక్యం తో బావా మీరు నాకు కొంచం సమయం ఇస్తే నేను ఒక మాట చెప్తా, అది విన్నాక మీకు మంచిగా అనిపిస్తే నా మాట వినండి,లేదా నన్ను వెళ్ళిపోమ్మoటే  వెళ్లి పోతాను అన్నాడు శ్రావణ్,” ఏవడ్రా నీకు బావా,పో ఇక్కడి నుండి ఏంది రా నువ్వు నాకు చెప్పేది,నేను వినేది,” పో పో ఇక్కడ నుండి ఇక్కడ ఎవరూ నీ మాట వినరు అన్నాడు విసురుగా మాణిక్యం.””వారి సంభాషణ అంతా వింటున్న నారాయణ ” ఆ పిల్ల గాడు ఏమో చెప్తా అంటుండు కదా, చెప్పని అన్నాడు కొడుకుతో, అతనికి శ్రావణ్ చూడగానే నచ్చాడు.ఇంతలో బయట భోరున వర్షం పడడం మొదలైంది. శ్రావణ్ నారాయణ వద్దకు వెళ్లి, ఆయన్ని కింద నుండి పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత భార్గవి వైపు చూస్తూ ” భార్గవి కొంచం టీ పెట్టి అందరికి తీసుకుని రా “అని చెప్పాడు…

తన ముందే తన చెల్లికి  ఆర్డర్ లు వేస్తున్న శ్రావణ్ ని చూస్తుంటే చాలా కోపం వచ్చింది మాణిక్యం కు.కానీ తండ్రి మాట ప్రకారం ఏమి అనలేక పోతున్నాడు.భార్గవి టీ తీసుకుని వచ్చింది.నారాయణ వద్దు అని అంటున్నా,బలవంతంగా తాగించాడు శ్రావణ్. అయ్యాక శ్రావణ్ ఏమి చెప్తాడా అని ఆత్రంగా ఎదురు చూడసాగారు అందరూ.ఇంతకీ శ్రావణ్ ఏమి చెప్పబోతున్నాడు ?  ఏం చేయాలి అని అనుకుంటున్నాడు ? అతను చెప్పిన  విషయం వారికి నచ్చుతుందా..? లేదా ? అనేది తరువాయి భాగం లో చదవండి…

                                                            ——భవ్య చారు

Related Posts

2 Comments

    1. ఇక్కడే ఉందండి .. దయచేసి సెర్చ్ చెయ్యండి… మీ సమీక్షకు ధన్యవాదాలు 🙏

Comments are closed.