అమ్మ హక్కు!.ఆమె బాధ్యత

అమ్మక్షమ..!

అది… అమ్మ హక్కు!
➖➖➖

క్షమ అమ్మ, బాధ్యత కాదు.
అది ఆమె హక్కు! ఎవరైనా అమాయక పుత్రుడు క్షమ ఆమె బాధ్యత అనుకుంటే, విధి అనుకుంటే, ఆమె బలహీనత అనుకుంటే… అది అతడి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఆమె ప్రేమను, ఉదాత్తమైన ఆమె హక్కును అంతలా తీసిపడేస్తే, తీసికట్టుగా భావిస్తే… అతడు నిజంగా దురదృష్టవంతుడనే చెప్పాలి.

ఎందుకంటే అమ్మ క్షమలో ఏముందో ఆ అమాయక చక్రవర్తికి అర్ధం కాదు. అందులోని ప్రయోజనాలు అతడి అవగాహనలోకి రావు.

అమ్మ క్షమను చిన్నచూపు చూస్తే ఆమె ఆత్మ గౌరవాన్ని కించపరచినట్లే, ఆమె సహనాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసినట్లే, తనకు చెందవలసిన ప్రయోజనాలను తానే భంగపరచుకున్నట్లే. గర్భంలో ఎడాపెడా పల్టీలు కొడుతూ సుకుమారమైన కడుపంతా తన్నేసే దున్నేసే గర్భస్థ శిశువును, ఆ నొప్పిని భరిస్తూ బిడ్డ కదలికలకు అనుగుణంగా కష్టపడి తన శరీరాన్ని అమర్చుకునే ‘అమ్మ క్షమ’ ఎంతటిదో ఆ బిడ్డకెన్నటికీ అర్ధం కాదు.

‘ఎందుకంటే బిడ్డ అమ్మ కాదు. కాబట్టి, పిల్లల్లో కొందరు… అందరూ కాదు… వృద్ధాశ్రమాలను అన్వేషిస్తూ అందులో చేర్చే పథకాలను రచిస్తున్నారు! గర్భంతో నరకాన్ని భరిస్తూ కూడా బిడ్డ అన్ని విధాలా అందంగా, ఆరోగ్యంగా ఈ లోకంలోకి రావాలని పూజలు చేసిన తల్లికి, పారాయణాలు చేసిన తల్లికి కడుపులో ఇబ్బంది పెడుతున్న బిడ్డను నెలలప్పుడే తీసి అవతల పారేసే అవకాశాలు లేకనా? వసతులు దొరకకనా? ఈ లోకంలో తల్లికి అన్నింటికంటే, తన ప్రాణాలకంటే కూడా బిడ్డ ఎక్కువ బిడ్డే ఎక్కువ!

తల్లికి బిడ్డ ఒక అమృతపు మొలక వెన్నెల తునక! కోకిల తన గూట్లో గుడ్లు పెట్టిపోతే కాళ్లతో, ముక్కుతో కిందికి దొర్లించక పొదిగి పిల్లలయ్యేదాకా, రెక్కలొచ్చి ఎగిరిపోయ్యేదాకా రక్షించే కాకి తల్లిని ఏమనాలి? ఆమెలోని తల్లి మనసుకు ఎన్ని చేతులెత్తి మొక్కాల?. అదే అమ్మ మనసు! ప్రతి అమ్మ మనసు.!

అన్నింటికంటే మనం గ్రహించవలసింది అమ్మ ఉదార హృదయం; క్షమాగుణం. అది పిల్లల దృష్టిలో ఆమె బలహీనత! తమ ప్రేమను, భద్రతను కోల్పోవలసివస్తుందనే భయంతో ఆమె తీసుకునే ముందుజాగ్రత్త.

కానీ అది తప్పు.. నిజానికి అది పిల్లల ప్రేమకు దూరమై బతకలేని మధురమైన బలహీనత. దానికంటే ముఖ్యంగా వారిని ప్రేమించకుండా, వారికి ప్రేమను అందించకుండా ఉండలేని అత్యంత సున్నితమైన నాజూకు బలహీనత.

ఇంత సూక్ష్మ భానం ఎవరికి అర్ధమవుతుంది? అది అత్యంత కఠినమైన శిల మధ్యలో ఉన్న శీతల సలిలంలాంటిది. ఆది ఆమెకు తప్ప మరొకరికి అర్ధం కానిది. పైకి కనిపిస్తున్న క్షమ ఆమె బలహీత కాదు… హక్కు, గంభీరమైన, హుందా అయిన హక్కు.

నిజానికి పిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తికంటే వారి క్షమే నిజమైన ఆస్తి హక్కు. దురదృష్టం ఏమిటంటే ఆ హక్కు అప్రయత్నంగానే, ఆనాయాసంగానే, ఉదారంగానే పిల్లలకు అందుతోంది. చెందుతోంది. ఈ లోకంలో ఆయాచితంగా… వచ్చే దానంత చవకబారు వస్తువు మరొకటి ఉండదు.

తేనెటీగలకు బహుశా నోట్లో రుచి మొగ్గలుండవేమో. ఉంటే అంత మధురమైన తేనెను కనీసం రుచి కూడా చూడకుండా పట్టులోనే నిక్షిప్తం చేస్తూ నెలల తరబడి అలా ఉండిపోయేవి కావేమో.

*అయితే అమ్మకు రుచి మొగ్గలున్నాయి. తేనె రుచీ తెలుసు… అమ్మకూ ఓ అమ్మ ఉంటుంది కాబట్టి, అయినా అమ్మ ప్రేమ అనే స్వయంసిద్ధ మాధుర్యాన్ని గుండె పట్టులో పెట్టుకుని, బిడ్డకై పెంచుకుని, పెంచుకుని, పెంచుకుని… ఈ అమ్మ అనే తేనెటీగ బిడ్డ కోసమే దాస్తుంది. బిడ్డకే పంచుతుంది……
సీయ రచన
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *