నా కవితల అక్షరాలు నా ఆత్మ రూపసులు
విస్ఫోటనం చెంది నింగిలో కమ్ముకున్న కారుమేఘాలై
అక్షరాల రంగుపూవులు
అవని నిండా వర్షిస్తున్న పరిమళాలు
నా భావనల నిండా సన్నని సంగీతాలు
దుఃఖిత మది చిత్రించిన రేఖాచిత్రాలు
ఏ ప్రేమ నోచుకోని
మనస్సు పాడే విషాద గీతాలు
అలవిగాని దారిలో నైరాశ్యం చీకట్లు
గదిలో అక్షరాలను వెలిగించి
నన్ను నేను వెలిపోయి ఎన్నాళ్ళయిందో
నా అక్షరాలు నేడు ఎవ్వరికీ అవసరం లేదు
బ్రతుకు పోరాటం గడబిడలో
తీరికలేని ఎవరి రందీ వారిది
కవితల్లో మహోజ్వల కెరటాలతో
జీవన సంగీతం పాడినా
చదివే ఓపికలు ఎవ్వరికీ లేదు
నా అక్షరాలు రంగు రంగుల పరిమళాలు గుప్పుమన్నా
పాఠకులు కరువైన రోజులు
కమ్మని కవిత్వం నేడు కంఠశోష కర్ణకఠోరం
అవును నేను వెలిపోక తప్పట్లేదు
కొందరు సాహితీ ప్రియులున్నారు
వాళ్లకోసం నేను నాకై
క్యాండిల్ కింద అక్షరాలకు జీవంపోస్తూ
సజీవంగా మిగిలాను,,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట