అవ్వ జీవితం
ఒక ఊరిలో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వకు అయిదుగురు
కొడుకులుండేవారు.
అందరూ వ్యవసాయం పనులే చేసేవారు. వాల్లకు గేదెలు
కూడ ఉండేవి గేదెల పాలు పితికి పట్నంలో విక్రయించే
వారు. ఇలా వారి జీవనం గడుస్తుండేది.
ఉదయం లేవగానె కాళ్లకృత్యాలు తీర్చుకుని అవ్వ పెట్టే
బువ్వ తిని ముగ్గురు కొడుకులు పొలం పనులకు వెళితే
నాలుగో వాడు పట్నం పోయి పాలమ్మే వాడు. ఇక చిన్నోడు ఆటపాటలతోనె సరిపెట్టే వాడు.
ఇంట్లో అవ్వకు చేదోడు వాదోడుగా ఉండేవాడు.
అవ్వకు అందరికి వండి వడ్డించడానికే సరిపోయేది. ఒక్కో రోజు చాలా కష్టంగా తోచేది. అందుకే కొడుకులకు పెళ్లి
చేయాలనె ఆలోచన వచ్చింది.
పెళ్లి చేద్దామని పెళ్లిల్ల పేరయ్యకు కబురు పెట్టింది. పేరయ్య ఒక మంచి సంబంధమని పక్క ఊరి సంబంధం
తెచ్చాడు.
అమ్మాయిని చూడడానికి కొడుకులతో కలిసి వెళ్లింది
అవ్వ. అమ్మాయిని చూడగానె అందరికి నచ్చింది. కను
ముక్కు తీరు అదంగా బాగుంది అన్ని పనులు వచ్చని
వాల్ల పెద్దవాల్లు చెప్పడంతో ఇంక కావలసిందేముందని
ఒప్పేసుకున్నారు.
ఘణంగా పెళ్లి జరిగిపోయింది.
పెళ్లయిన మెుదటి రాత్రె ఆమెకో లోపముందని కొడుకుకు
తెలిసింది.
అక్కడ ఒక స్టూలుపై పళ్లు,పాలగ్లాసు, స్వీట్స్ పెట్టారు.
పాలగ్లాసు తీసుకురా! అన్నాడు పెళ్లి కొడుకు.
ఆమె కాస్త పండ్లు పట్టుకువచ్చింది.
ఏదో తేడా ఉందేమెా అనిపించింది.
లైట్ స్విచ్ గోడకు చూపించి లైట్ ఆఫ్ చేయమంటె గోడకున్న క్యాలెండర్ తెచ్చి ఇచ్చింది.
ఇదేంటని అప్పుడే అర్థమయిందతనికి.
తెల్లవారి అత్తగారు వంకాయలు తరగమంటె బెండకాయలు తరిగింది.
అవ్వకు తనకు పనిలో సహాయంగ ఉంటుంది కదాని చాలా సంతోషంగా పని చెప్తె ఒకటి చెప్తే ఒకటి చేస్తుంది
బియ్యం కడిగిన నీళ్లు కుడితి కుండలో పోసి రమ్మంటే
ఇంకో కుండలో ఉన్న బియ్యమే కుడితిలో పోసేసింది.
ఇదేంటి ఇలా చేస్తుంది అని కొంచం గట్టిగా కోప్పడితే
గొంతు పెంచి అరుస్తుంది.
చూడడానికి సౌమ్యంగా కనిపించినా ఆమె చెవిటిది.
చెవుడు ఇచ్చిన దేవుడు ఆమెకు గొంతు మాత్రం పెద్దగా
ఇచ్చాడు.
ఒక్క మాటలో చెప్పాలంటె గయ్యాళి కోడలన్న మాట.
ఇక అవ్వ ఒకటి చెప్తె తనొకటి చేసేది.తను చేసిందే
కరెక్ట్ అనేది . కొంచం మూర్ఖత్వం ఉండేది.
వాల్లు చెవిటిదనే విషయం దాచిపెట్టి పెళ్లి చేసారు.ఇక ఈ
కోడలుతో కష్టంగా ఉందని రెండో కోడలునైనా మంచిదాన్ని తేవాలని మళ్లీ పెళ్లిల్ల పేరయ్యను సంప్రదించింది.
మంచి సుగుణాల రాశి కాని మూగమ్మాయి ఉంది చూస్తారా? అని సణుగుతూ అడిగాడు పేరయ్య.
పెద్ద కోడలు గొంతుతో భయపడిన అవ్వ మూగదే బెటరు
అనుకుందేమెా!! చూస్తామంది.
పేరయ్య చెప్పినట్టుగానె అమ్మాయి చాలా బాగుంది
ఇంట్లో దీపం లేకపోయినా ఈ అమ్మాయి ఉంటే చాలు
అంత వెలుగు వస్తుందన్నట్టుగా ఉంది.
ఇక ఆలస్యం చేయకుండా రెండో కొడుకు పెళ్లి కూడ
చేసేసింది.
మూగకు చెవిటికి సరిపోయింది ఇద్దరు కోడళ్లయితే
బాగానె ఉంటున్నారు కాని అత్త దగ్గరకొచ్చే సరికే ఏవో
గొడవలు.
ఇలా కాలం గడుస్తుండగా మూడో వాడికి మంచి సంబంధం వచ్చింది.
వీళ్లు అడగకుండానె వాల్లే వెతుక్కుంటూ వచ్చారు ఈ
సారి అమ్మాయికి చెవుడు లేదు మూగ లేదు లక్షణంగా
ఉంది.
దాంతో మూడోవాడి పెళ్లి కూడ అయిపోయింది.
కాని మూడో వాడి పెళ్లానికి ఒళ్లంతా పొగరే!!!
వచ్చిన దగ్గరనుండి వేరే ఉందాం!! నేనా మూగ చెవిటితో
వేగలేను అని మెుగుడితో రోజూ పోరె!!
దాంతో వాడు అవ్వ దగ్గర వేరుపడే ప్రాస్థావన తెచ్చాడు
అవ్వ కూడ బాగా ఆలోచించింది.
వెయ్యేళ్లున్నా వేరు తప్పదు నూరేళ్లకు చావు తప్పదు
అనుకుని తనుండగానె అందరికి పంచి ఇవ్వడం ధర్మంగా
భావించి ఊర్లోని పెద్ద మనుషుల సమక్షంలో తన లంకంత
ఇంటిని పంచేసింది.
నాలుగో వాడికి కూడ పెళ్లి చేసింది ఎవరి వాటాలో వాళ్లు
ఉంటున్నారు.
చిన్నోడు అవ్వ ఒక వాటాలో ఉంటున్నారు.
వీళ్ల పెళ్లిల్లు చూసి చిన్నోడికి పెళ్లి మీద విరక్తి వచ్చింది.
పెళ్లి చేసుకుంటె అవ్వ ఒంటరిదవుతుందని బాధగా
కూడ అనిపించింది.
వాడు అల్లరి చిల్లరగా తిరుగుతుండడంతో ఎవరూ పిల్లను కూడ ఇవ్వడానికి రావడం లేదు.
దాంతో అవ్వకొక రంది తయారయింది. వీడి పెళ్లి ఎలా
చేయడం???
పెళ్లిల్లు చేసుకున్న అన్నలు పట్టించుకోవడం లేదు వీడిని
చూస్తె ఏ పని చేయడం లేదు. ఎలా??ఎలా???
అని అవ్వకు బెంగతో మంచం పట్టేలా అయింది.
అవ్వ భర్త ఎన్నో ఆస్తులు సంపాదించాడు ఇంతమంది
కొడుకులను కన్నాడు.
అన్నీ బాగానె చేసాడు కాని అన్ని బాధ్యతలు అవ్వకొదిలేసి తను మాత్రం హాయిగా దేవుడి దగ్గరకు
వెళ్లిపోయాడు.
ఈ వయసులో అవ్వకు ఎక్కడలేని బాధ కలిగింది.
ఊర్లోని వాల్లను వీల్లను బ్రతిమి లాడుకుని ఏదో గంతకు
తగ్గ బొంతను వెతికి చిన్నోడి పెళ్లి కూడ చేసింది.
చిన్నోడు పాపం పెళ్లి చేసుకోనమ్మా నువ్వు ఒక్కదానివవుతావు నిన్నెవరు చూసుకుంటారు???వద్దు
అని ఎంత చెప్పినా అవ్వ వినకుండ పెళ్లి చేసింది.
వీడికి వెర్రి బాగుల తనముందని వాడి అత్తగారు వాల్ల
కూతురు అలాంటిదేనని వాడిని ఇల్లుటము తీసికెళ్లారు
ఏదైనా పనిలో పెడతామంటె అవ్వ కూడ సరేనని పంపించింది.
ఇప్పుడవ్వది నిజంగానె ఒంటరి బ్రతుకయింది.
అవ్వ ఎంతో ఉన్న సంసారంలో ఉండి ఎంతో బలగంలో
ఉండి ఇప్పుడు ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది.
కలకలలాడాల్సిన కుటుంబం కళ తప్పినట్టు అయింది.
ఎవరికి వాల్లు కొడుకులంతా బాగానె ఉన్నా అవ్వ మాత్రం
బెంగతో మంచం పట్టింది.
మంచంలో ఉన్న అవ్వను చూసుకోవడానికి ఏ కోడలు
రావడం లేదు.పెద్ద కోడలును చూసుకోమని చిన్న కోడలు
చిన్నామెనే చూసుకోమని పెద్దామె ఇలా కోడల్లంతా
ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ఎవరూ చూడడం లేదు.
దాంతో పెద్దకొడుకు బాగా ఆలోచించి ఒక పనామెను
పెట్టాడు.
ఇంతమందిని కని పెంచి చివరికి పనామె చేతిలో పడి
ఆమె పెట్టింది తింటూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళతాడా
అని ఎదురు చూస్తుంది అవ్వ…..
ఇలా గడిచింది అవ్వ జీవితం…..
వృద్దాప్యం ఎంత శాపమెా అర్థమైంది అవ్వకు..
ఉమాదేవి ఎర్రం