ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంను నవంబరు 1వ తేదీగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయి 1953, అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా 1956 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్రం విలీనం కావడంతో ఆంధ్ర రాష్ట్రం కాస్తా ఆంధ్ర ప్రదేశ్గా మారింది. దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది. ఆ రోజునే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకుంటూ వచ్చారు ఇప్పుడు తెలంగాణ లేదు కాబట్టి పూర్వపు ఆంధ్రరాష్ట్ర అవతరణ అయిన అక్టోబరు 1న జరుపుకోవాలనే ఒక వాదన ఉన్నప్పటికినీ మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1న మాత్రమే అవతరణ దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించి పాత సంప్రదాయాన్నే పాటిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎలా మారుతుందని ఎక్కువ మంది అభిప్రాయం.
మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది – 1953 అక్టోబరు 1
ఆంధ్రరాష్ట్రం తెలంగాణాతో కలిసి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్గా అవతరించింది – 1956 నవంబరు 1
2014 జూన్ 2 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన, కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు.
2014లో ఈ రాష్ట్రం రెండుగా విడిపోయి తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంతో ఉన్నట్లుండి ఈ తేదీ ప్రాముఖ్యం కోల్పోయింది. ఈ తేదీ చుట్టూ ఉన్న భావోద్వేగం ఒక్కసారిగా చల్లబడి పోయింది. ఎన్ని పాటలు, ఎంత సాహిత్యం, ఎన్ని గాథలు, ఎంత చరిత్ర…అంతా చరిత్ర పాఠ్యపుస్తకంలో ఒక ప్రాముఖ్యంలేని అధ్యాయంగా మిగిలిపోయింది.
దాదాపు ఆరేడేళ్లుగా ఈ తేదీని ఏం చేసుకోవాలో తెలియని గందరగోళంలో ఆంధ్రప్రదేశ్ ఉండింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబర్ ఒకటిని మర్చిపోయి, నవ్యాంధ్రప్రదేశ్ అవతరణ జూన్ 2న కాబట్టి ఆ రోజును నవనిర్మాణ దినంగా జరుపుకోవాలన్నారు.
2019లో ముఖ్యమంత్రి అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి….కాదు, నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ అన్నారు. నవంబర్ 1, 1956లో ఏర్పడిన విశాల ఆంధ్రప్రదేశ్ ఇపుడు ఉనికిలో లేదు. నిజానికి 1953 నాటి ఆంధ్ర స్థాయికీ కుంచించుకు పోయింది. కాబట్టి నవంబర్ 1న అవతరణోత్సవం జరుపుకోవడం సరికాదు అని కొందరు అంటున్నారు.
మాధవి కాళ్ల
సేకరణ