ఆనందానికి అర్థం మారింది

అక్షర కొరకు
అంశం :⁠- మాయ జీవితం(చిత్ర కవిత)
తేది:⁠- 10/08/2026
శీర్షిక:⁠- ఆనందానికి అర్థం మారింది

            హైదరాబాద్‌ నగరంలోని ఓ సందడిగా ఉండే ప్రాంతంలో రవి,కిరణ్‌,మాధవి,సౌమ్య అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. 
                  చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగిన వాళ్లు. 

చదువు పూర్తయ్యాక ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. డబ్బు సంపాదించడమే జీవితానికి పరమార్థమని భావించేవారు.
“జీవితం ఒక్కసారే వస్తుంది. ఉన్నంతలో ఎంజాయ్ చేయాలి!” అనేది రవి నిత్యమూ చెప్పే మాట.
వారాంతం వచ్చిందంటే చాలు. ఖరీదైన హోటళ్లు, రుచికరమైన వంటకాలు, అర్ధరాత్రి వరకు మేల్కొని నవ్వులు, సరదాలు. ఆరోగ్యం గురించి ఎవరు మాట్లాడినా వాళ్లకు అది బోధలా అనిపించేది.
ఒకరోజు రవి తన స్నేహితులను ఇంటికి పిలిచాడు. టేబుల్‌పై రకరకాల ఆహార పదార్థాలు, పానీయాలు సిద్ధంగా ఉన్నాయి. అందరూ నవ్వుతూ, మాట్లాడుతూ ఆనందిస్తున్నారు.
“ఇదే అసలైన జీవితం!” అంటూ రవి గ్లాసును పైకెత్తాడు.
అంతలో మాధవి నవ్వుతూ ,
“ఇది జీవితం కాదు రా…! జీవితాన్ని మనం మరిచిపోయి గడుపుతున్న క్షణాలు!” అని అంది.
అందరూ ఆమె మాటలను సరదాగా తీసుకున్నారు.
“అయ్యో! నువ్వూ మొదలుపెట్టావా నీ నీతులు?” అంటూ కిరణ్ నవ్వాడు.
కొన్ని నెలలు గడిచాయి.
రవి ఎప్పుడూ అలసటగా ఉండటం ప్రారంభించాడు? కిరణ్‌కు కూడా రోజువారీ పనుల్లో ఉత్సాహం తగ్గింది. సౌమ్యకు నిద్ర సరిగా పట్టేది కాదు. ఒకరోజు వాళ్లంతా మళ్లీ కలుసుకున్నప్పుడు, గతంలో ఉన్న నవ్వులు కనిపించలేదు.
అప్పుడు మాధవి వాళ్లను ఒక చిన్న పార్కుకు తీసుకెళ్లింది.
అక్కడ వృద్ధుడొకరు తన మనవరాలితో… కలిసి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. చిన్నారి నవ్వుతూ తాత చేతిని పట్టుకుని పరుగులు తీస్తోంది.
“తాతయ్యా! మనం రేపు కూడా ఇక్కడికే వస్తామా?” అని అడిగితే…
“నేను ఉన్నంతకాలం ప్రతిరోజూ వస్తాను బంగారం” అన్నాడు వృద్ధుడు చిరునవ్వుతో…
ఆ దృశ్యాన్ని చూస్తూ మాధవి నెమ్మదిగా ,
“మనమంతా డబ్బు కోసం పరుగులు తీశాం. ఖరీదైన వస్తువులు కొన్నాం. రుచుల కోసం ఆరోగ్యాన్ని, సరదాల కోసం సమయాన్ని, సంపాదన కోసం కుటుంబాన్ని దూరం చేసుకున్నాం. కానీ , ఈ చిన్నారి నవ్వు కొనడానికి ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నా సరిపోదు?” అని చెప్పింది.
రవి మౌనంగా తలవంచాడు. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి?
“నేను సంపాదించింది నిజంగా జీవనా? లేక జీవితం పేరుతో నేను వెంటపడింది ఒక మాయనా?” అని ఆలోచనలో పడ్డాడు.
ఆ రోజు నుంచి నలుగురి ఆలోచనలు మారిపోయాయి. వారాంతాల్లో హోటళ్లకు వెళ్లడం తగ్గించారు. కలిసి నడకకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో సమయం గడపడం మొదలుపెట్టారు. అవసరమైనంత… సంపాదిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం నేర్చుకున్నారు.
కొంతకాలానికి రవి తన పాత స్నేహితులను చూసి ,
“మనకు కనిపించేది అంతా నిజం కాదు. డబ్బు, హోదా, ఆడంబరం ఇవన్నీ మనల్ని కొంతకాలం సంతోషపెట్టే మాయలు. కానీ ఆరోగ్యం, ప్రేమ, ఆప్యాయత, ప్రశాంతత. ఇవే నిజమైన జీవితం” అని అన్నాడు.
మాధవి చిరునవ్వుతో….
“మాయలో జీవించడం సులభం. మాయను గుర్తించి నిజమైన జీవితాన్ని ఎంచుకోవడమే అసలైన విజయం” అని చెప్పింది.
ఆ రోజు నుంచి వాళ్ల జీవితంలో ఆనందం తగ్గలేదు. ఆనందానికి అర్థం మారింది.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *