ఆవేదన

ఇంకా ఎంత సేపు పడుతుంది సార్ అంటూ అడిగాను కండక్టర్ గారిని ఏంటమ్మా అలా అడుగుతున్నావు? ఇది నువ్వు పదో సారీ అడగడం నువ్వు ఎన్నిసార్లు అడిగినా దూరం తగ్గదు కదా ఏంటి తొందర సిటీలో ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా లేదులే ఓ రెండు గంటలు పడుతుందేమో అంటూ టికెట్లు ఇచ్చేసి తన సీట్లో కి వెళ్లి కూర్చున్నాడు కండక్టర్. నేను గట్టిగా నిట్టూరుస్తూ పోయి తిరిగి ఎందుకులే అని ఊరుకున్నా కిటికీలోంచి చూస్తూ నేను హన్మకొండలోని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ హైదరాబాద్ కి వెళ్లడం అయితే బాగానే వెళ్ళాను. కానీ, రావడమే ఇదిగో ఇలా అయింది ఇప్పుడు కూడా వచ్చే దాన్ని కాదు కానీ ఆఫీసులో అర్జెంట్ మీటింగ్ ఉండడంవల్ల ఇలా అనుకోకుండా రావాల్సి వచ్చింది. హనుమకొండ నుండి బయలుదేరి కాకపోతే చిన్న ఊర్లలో ఎక్స్ప్రెస్ ఆగదు అంతే తేడా మేము బస్టాండ్ కి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ పోతోంది.

సరేలే, ఇందులో అయితే ఏంటి కూర్చోవడమే కదా అని ఆర్డినరీలో ఎక్కాను అయితే అన్ని రకాల మనుషులను చూడొచ్చు ఒక కొత్త అనుభూతిని పొందవచ్చు అని అనుకుంటూనే నాకు ఇష్టం అయిన కిటికీ సీటుని వెతుక్కొని కంఫర్ట్ గా కూర్చున్నా. మా పిన్ని ఇంతలోనే వెళ్లి ఒక మజా బాటిల్ తెచ్చింది తాగడానికి. నీళ్ళు ఉన్నాయిగా పిన్ని అన్నాను. పర్లేదులే, నాకు ఇంటికి వెళ్ళడానికి ఆటోకి అందుకే 500 ఇచ్చి తెచ్చి తాగుతూ వెళ్ళు అంది. సరే అన్నాను. ఇంతలో బస్సు బయలుదేరుతున్నట్టు విజిల్ వేసాడు కండక్టర్. నేను పిన్నికి బై చెప్పను బస్సు కదిలింది. కనుమరుగు అయ్యేవరకు చూస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో చిన్నప్పుడు కలిసాం ఇదిగో మళ్లీ ఇన్నేళ్లకు ఇలా కలుసుకున్నాం. అదో పెద్ద కథ పోనీలే ఇన్ని రోజులు అయినా నేను గుర్తొచ్చానా అని ఆనందపడ్డాను.

పాపం పిన్నిని తలచుకుంటూనే చల్లగాలి రావడంతో టిక్కెట్టు తీసుకొని పడుకున్నాను కిటికీకి తల ఆనించి అలా ఎంతసేపు గడిచిందో తెలియదు బస్సు కీచు అంటూ ఆగింది. నిద్రలో ఉన్న నేను ముందుకు వెళ్ళడంతో మెలకువ వచ్చింది. అయోమయంగా చుట్టూ చూశాను ఎక్కడో అడవి మధ్యలో ఉన్నాం. చుట్టూ ఏ ఊరు లేనట్లు ఉంది. ఏమైందో అర్థం కాక నన్ను గమనించిన ఓ అబ్బాయి టైరు మారుస్తున్నారు అండి లేట్ అవుతుంది అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో నేను కిటికీ లోంచి చూసాను మగాళ్ళంతా దిగి చెట్ల చాటున వెళుతున్నారు అని అనుకుంటూ ఆడ వాళ్ళు ఎవరైనా వెళ్ళారేమో చూశాను కానీ ఎవరూ వారి సీట్లోంచి లేవలేదు. పోనీలే ఇంకో గంటలో వెళ్దాం అని అనుకుంటూ దాహం వేయడంతో చేతిలో ఉన్న మజా బాటిల్ తీసుకుని తాగాను. పైగా మజా మామిడి పళ్ళ రసం కావడంతో నాకు తెలియకుండానే మొత్తం ఖాళీ చేశారు.

ఇంతలోనే టైరు మార్చడం మగాళ్ళంతా వచ్చి బస్సు ఎక్కడంతో బస్సు బయలుదేరింది. హమ్మయ్య అని అనుకుంటూ చల్లనిగాలి రావడంతో నేను మళ్లీ నిద్రలోకి జారుకోబోయాను. కానీ, నాకు నిద్ర రాలేదు ఎందుకంటే ఒకసారి మెలకువ వచ్చాక తిరిగి నిద్ర రావడం కష్టం. ఇక చేసేది ఏమి లేక మెల్లిగా బస్సులో ఉన్న వారందరిని గమనిస్తూ కూర్చున్నాను. గాలిలో తేలి వస్తున్న మాటలను వింటూ కూర్చున్నాను. నా ముందు సీట్లో ఒక కొత్త జంట అనుకుంటా ఇద్దరూ చాలా బాగున్నారు చిలకాగోరింకల్లా వారిద్దరి చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తుంది. వారు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అతను ఏదో చెప్తూ ఉంటే ఆ అమ్మాయి నవ్వుతూ వింటుంది. ఏం మాట్లాడుకుంటున్నారో కాస్త విందామని అటువైపు వేసాను కానీ అస్సలు వినిపించడం లేదు. అంత మెల్లగా వాళ్లు మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు కాస్త లిప్ రీడింగ్ తెలుసు.

దాంతో కొంచెం అర్థమైంది కానీ కొత్త దంపతుల మధ్య నేను ఎందుకు అని అనుకుంటూ వారి నుండి వేరే వాళ్ళని చూడడంలో చూపులు పక్కకి తిప్పాను. చుట్టూ చెట్లు చల్లగా ఉంది ఈ ఎండాకాలంలో ఇలా చల్లగా దొరకడం ఎంత అదృష్టం పల్లెటూరిలో ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో అని అనిపించింది. బస్సు వెళ్తూనే ఉంది గమ్యం వైపు నేను పల్లె లో పుట్టిన పట్నంలో బ్రతకడానికి వచ్చిన వలస జీవులు ఆ కాంక్రీట్ జంగిల్లో స్వచ్ఛమైనగాలి దొరకడం అంటే అది అందరాని చందమామ అందుకే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆస్వాదిస్తున్నాను. సాయంత్రం అయినట్లుగా పక్షులు తమ ఇల్లల్లకు వెళుతున్నాయి. వేడి చల్లబడుతుంది పశువులు ఇళ్లకు మారుతున్నాయి. బస్సు సిటీ లోకి ఎంటర్ అవుతున్నట్లు అనిపించి చుట్టూ చూశాను. అవును బస్సు సిటీ లోకి ఎంటర్ అయింది. ఉప్పల్ దాటుతుంది. ఆరోజు ఎవరో మంత్రి వస్తున్నారు అనుకుంటా దారి మళ్లించారు అనే మాటలు వినిపించాయి.

కానీ, ఇంతలోనే ఇది మొదలైంది బస్సు రోడ్డు మధ్యలో ఉంది చుట్టూ ఇలాంటి బస్సులు కార్లు బైకులు కొడుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయింది. ఎంత మంది జనాలు ఎక్కడనుండి వస్తున్నారు రోడ్లు కూడా సరిపోవడం లేదు ఫ్లై ఓవర్లు, ట్రైన్స్ కూడా సరిపోవడం లేదు. ఎవరికీ ఎన్ని మార్గాలు ఉన్న ఎన్ని వసతులు చేసినా అన్నిట్లోనూ జనమే ఎటు చూసినా జనమే. ఎక్కడ ఉన్న జనమే జనం కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. అంతగా మమేకం అయ్యారు ఒక చోటు అంటూ ఏమీ లేదు. ఎత్తైన కట్టడాలు, చిన్న ఇండ్లు ఉన్నట్టే పెద్ద పెద్ద వారిని ఏమీ లేని వాడిని కూడా దాచుకుంది ఈ నగరం తనలోనే. కానీ, ఇక్కడ ఒక్కటే లోపం అందరికీ అన్ని వసతులు కల్పించే ఈ ప్రభుత్వాలు మాకు ఏ వసతి మాత్రం కల్పించలేదు. పోనీ, ఎక్కడైనా దిగుదాం అని అనుకుంటే 55 రూపాయలు పెట్టి టికెట్టు మళ్ళీ వృధా అవుతుందనే భయం.

అసలు విషయం ఏంటంటే నాకు హైదరాబాదులో నాఇల్లు ఆఫీస్ తప్పా వేరే రోడ్లు బస్సులు తెలియవు అందుకే ఎక్కడ దిగలేదు పైగా ఈ బస్సు స్టాప్ మా ఇంటి దగ్గరే కావడంతో దాన్ని విడిచిపెట్టలేదు. పోనీ బస్సు ఏదైనా బస్టాండ్ లోకి వెళుతుంది ఏమో అక్కడ చూడొచ్చు అని అనుకుంటే అది కూడా లేదు బస్సు బస్ స్టాప్ లోకి వెళ్లడం లేదు అసలు బస్ స్టాప్ వెళ్లడానికి నాకు ఎక్కడ బస్ స్టాప్ కనిపించలేదు. రోడ్డు పైకి రావడం పైగా ఇది జిల్లా బస్సు కాబట్టి ఆ గొడవ లేదు లేకపోతే అమ్మ బాబోయ్ ఈ మాత్రం కూడా వచ్చేది కాదు. అయినా అటూ ఇటూ చూస్తూ సిటీలోని ప్రజలందరిని గమనిస్తూ నా ఆవేదనని బాధని కాస్త మర్చిపోగలుగుతున్నాను.

ఇంత అభివృద్ధి చెందిన నగరం, అందమైన నగరం, సుందర నగరం, పెద్దపెద్ద ఉద్యానవనాలు, పిల్లల కోసం మ్యూజియంలు, స్కూల్స్, ఆటస్థలాలు, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్, ఇలా ఏదంటే అది ఎందుకంటే అన్ని అందరికీ కావాలి. అలంటి వసతులు ఎన్నో ఉన్న ఈ నగరం లో అన్ని రాష్ట్రాల వారు ఈ నగరానికి వచ్చి బ్రతుకుతున్నారు అనే నిజాన్ని చెప్పిన నగరం అందమైన రహదారులే కాదు నగరం అందమైన బిల్డింగ్ లేక కాదు మురికివాడలు కూడా ఉన్నాయని నిరూపించిన ఈ నగరంలో ఎక్కడపడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, పెట్టుకో మన ప్రభుత్వం మగాళ్ళ కోసం అడుగడు కి మందు షాపులు, బెల్టు షాపులు, ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆడవారికి మాత్రం ఒక్కటంటే ఒక్కటి సులబ్ కాంప్లెక్స్ కట్టించి ఉంటే ఎంత బాగుండేది.

ఈరోజు ఉద్యోగాలు చేసే ఉద్యోగిని ఫ్యాక్టరీలకు వెళ్లే వారంతా ఇంటికి వచ్చేవరకు కడుపులో పెట్టుకొని రావాల్సిందే. 10, 20 కిలోమీటర్ల దూరం వెళ్లిన వారంతా దారిలో ఎక్కడ ఏ వసతులు లేక షాపింగ్ కాంప్లెక్స్ లోకి వెళ్ళలేక ఇబ్బందులు పడాల్సిందే. ఎలక్షన్ లప్పుడు మీటింగు లోనూ ఆడవాళ్ళకి సమానత్వం మహిళా సాధికారత అంటూ ఉపన్యాసాలు ఇచ్చే ఈ నాయకులంతా ఆడవాళ్ళ కోసం ఈ ఒక్క పని చేయలేక పోయారు. ఎవరైనా ఎలక్షన్స్ అప్పుడు ఈ ఒక్క పని చేసి ఉంటే మహిళలంతా వారికి నీరాజనం పట్టేవారు ఇలాంటి ఇబ్బందుల తోనే సంవత్సరానికి ఎంతో మంది మహిళలు చనిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు.

ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుంది అభివృద్ధి ఎక్కడుంది మహిళా సాధికారత ఎక్కడుంది మహిళా సమానత్వం ఈ విషయాన్ని గురించి అందరితో మాట్లాడాలి అందరిలో చైతన్యం తీసుకురావాలి అందరూ ఈ సమస్య గురించి మాట్లాడాలి అని అనుకుంటూనే నేను ఎలాగో ఆపసోపాలు పడుతూ ఇంటికి చేరాను .. ఎవరు పలకరిస్తున్న మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్లి నా కడుపు ఉబ్బరాన్ని దించుకున్నాను ఇప్పటివరకు ఈ సమస్యకు ఏదో పరిష్కారం చేసుకోవాలనుకున్న నేను బాత్రూం లోనే ఆ విషయాన్ని మర్చిపోయి నా వారితో ముచ్చట్లలో పడ్డాను …. అదండీ సంగతి ఇలాగే చాలా మంది ఉపన్యాసాల వరకే పరిమితం తప్ప ఏ ఒక్కరూ సమస్యను పట్టించుకోరు….

Related Posts