ఆశ

ఆశ

రాధా ఇదిగో టీ తీసుకో మళ్లీ చల్లారి పోతుంది. ఇదిగో నువ్వు ఇలా నాకు ఏం చెప్పకుండా చెప్తే నేను ఊరుకోను తెలుసా నువ్వు ఏం చేసినా నాకు కాస్త చెప్పు ఇదిగో టీ తాగుతూ ఉప్మా తిను వద్ద సర్లే నువ్వు టీ తాగావా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కాస్త స్విచ్ వెయ్యి ఇదిగో నీకు నీళ్లు కూడా పెట్టాను అసలే చలికాలం చన్నీళ్లు నీకు పడవు హాట్ బాక్స్ లో రైస్ పెట్టానా  కూర కాస్త కూడా ఎక్కువే వేస్తున్న

నేను మా కొలీగ్స్ దగ్గర తీసుకుంటా లే పిల్లలకు కట్టేశాను ఒరేయ్ ఇద్దరు సాక్సులు  వేసుకోండి  సోను నీకు జుట్టు కడతాను ఇలా రా అయ్యో ఏంట్రా నాని పాలు అలా పారవేయడం ఎందుకు జాగ్రత్త రా నాని ఇదిగో నూకాలు అంట్ల గిన్నెలను  సరిగ్గా కడుగు నిన్న నా ఎంగిలి కంచంలో ఎంగిలి  పోలేదు  అలాగే  అంటావు కానీ  సరిగ్గా కడుగు ఇదిగో వెళ్లేముందు నాకు కనిపించు రాధా అయిందా ఇదిగో వేడిగా మ్యాగి చేశాను తిను

ఒరేయ్ మీరు పాలు తాగారా అదిగో బస్ వచ్చేసింది . పదండి బాయ్ బాయ్ రాధా పిల్లలు వెళ్తున్నారు మనకు కూడా టైం అవుతుంది నీ చీర కట్టుకో అయిందా అక్కడ పెట్టాను నీకు ఇష్టమైన పింక్ కలర్ చీర దానికి మ్యాచింగ్ జాకెట్  పెట్టాను ఇదిగో సాయంత్రం వంట లేదు నువ్వు కాస్త తొందరగా వస్తే సెకండ్ షో కి వెళదాం  పిల్లలను మీ అమ్మ వాళ్ళింట్లో వదిలేద్దాం రేపు ఆదివారం కదా ఈరోజు రేపు రెస్ట్ తీసుకోవచ్చు

సాయంత్రం ఏం చేయకు ఫస్ట్ షో సినిమా చూసి ఆ తర్వాత హోటల్లో తినేసి వద్దాం రేపు ఆదివారం నువ్వేమి తొందరగా లేవాల్సి అవసరం లేదు వారానికి సరిపడా ఇద్దరం కలిసి చేసుకుందాం నువ్వేమి శ్రమ కొరకు ఎక్కువ ఆలోచించకు ఎందుకంటే మీ అమ్మ దగ్గరే ఉంటారు కాబట్టి రేపు అంతా రెస్టు తీసుకో తీసుకో నీ బట్టలు నా బట్టలు లాండ్రీ కి వేస్తాను, డబ్బు ఎందుకు ఖర్చు అంటావా  సరేలే అది ఎప్పుడూ ఉండేదే గాని.. అవును

ఏమైనా కిరాణా సామాను కావాలంటే లిస్టు రాసి ఇవ్వు వచ్చేటప్పుడు తెస్తాను ఇదిగో బాక్స్ తీసుకో బ్యాంకులో డబ్బు లేదా సరేలే నువ్వు లేక పోయినా ఉందనే అంటావు అయినా నా దగ్గర కొత్త రకం చీరలు వచ్చాయని అన్నావుగా నీకు నచ్చింది ఒకటి తీసుకో రేటు ఎక్కువైనా పర్లేదు మంచి చీరలు తీసుకుంటే పండగలకు పుట్టిన రోజులు వస్తున్నాయి గా ఆ మాత్రం ఉండాలి బట్టలు అయిపోయాయి నూకలు ఆ బట్టలు ఆరేసి  ఇదిగో  ఈ  అన్నం ,కూర తీసుకుని వెళ్ళు  పాచివి కావు , ఇప్పుడే వేడి గా చేసాను, సరేనా ..

మేము రాత్రి హోటల్లో తినేసి వస్తాం ఇదిగో ఇప్పుడే వేడివేడిగా నువ్వు రావాల్సిన అవసరం లేదు బట్టలు అయ్యాక తీసుకో మాకు టైం అవుతుంది కానీ ఇదిగో ఇంటికి తాళం వేసి తాళాలు పక్కనే ఉన్న గుడి కింద పెట్టి వెళ్ళు. అయ్యో రాధా అప్పుడే వచ్చేసావా పద పద పనిలో నిన్ననే పెట్రోల్ కొట్టించారు నీకు లేట్ అవుతుంది కదా అయ్యో సారీరా నేను లేవడం కాస్త లేట్ అయింది సోమవారం నుండి కరెక్టుగానే సమయానికి  నిద్ర లేచేస్తాను  నీతో పాటు నేను వస్తాను ఇద్దరం కలిసి పని చేసుకుందాం రా తొందరగా అయిపోతాయి

సాయంత్రం తొందరగా వచ్చేయ్ నేను బయట ఎదురు చూస్తూ ఉంటాను సాయంత్రం పిల్లలను తీసుకు వెళ్ళమని మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను కూడా సమయం లేదు.అరే అబ్బా రాధా ఇదిగో ఇటు చూడు ఈ రోజు నువ్వు చీరలో చాలా అందంగా ఉన్నావు తెలుసా నీకు నా దిష్టి తగిలేలా ఉంది ఆ కాటుక కాస్త తీసి పెట్టుకో దిష్టి తగలకుండా సరేలే  ఇదిగో ఈ గులాబీ జడలో పెట్టుకో ఇంకా ఇంకా అందంగా కనిపిస్తావు.

ఎక్కడిది అని చూస్తున్నావా నీకోసం పక్కింట్లో ఉంటే దొంగతనంగా కోసాను తప్పే అయినా తప్పలేదు లే పెట్టుకుంటే  ఇంకా అందంగా కనిపిస్తున్నావు ఇది రోడ్ కాకపోయి ఉంటే నిన్ను గట్టిగా ముద్దు పెట్టుకునే వాడిని ఇంట్లో పెట్టుకుంటే అయిపోయేది మర్చిపోయాను సరేలే రాత్రంతా మనదే వచ్చేటప్పుడు మల్లెలు కనకాంబరాలు ఏవి తీసుకురావాలి నాకైతే మల్లెలు ఇష్టం  నీకు కనకంబరాలు అంటే ఇష్టం కదా సరే రెండూ తెస్తా లే పెట్టుకో అవును చెప్పడం మర్చిపోయా నీ ఇష్టం అని పాలకోవా చేశాను ఒక బాక్స్ లో  పెరుగన్నం ఆవకాయ కూడా పెట్టాను

కూర అన్నం తిన్నా క  కడుపు లో  మండుతుంది అని అలా పెట్టాను లే ఇదిగో వాటర్ బాటిల్ ఇది ఇవ్వకుండా వెళితే పాపం నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుందని నీళ్లు కాచి తెచ్చాను సరే నిన్ను ఇంకా ఇక్కడ నిలబెట్టి మాట్లాడుతూ ఉంటే అవతల మీ వాళ్ళు ఉంటారు సరేలే కానీ తీసుకోవడం మర్చిపోకు చీర అంటే చాలా ఇష్టం కదా అదే తీసుకో వచ్చేది ఎలాగా వేసవి కాలం హాయిగా ఉంటుంది కట్టుకుంటే నిజం చెప్పనా నువ్వు చీరలోనే అందంగా ఉంటావు సరే సరే నేను వెళ్తున్న మర్చిపోకు సాయంత్రం సినిమా హోటల్లో భోజనం ఇక రాత్రంతా నిద్ర కరువే మనకు బై ..బై ..రాధా

చేతులు ఊపుతున్నారు రాధ పైన చల్లని నీళ్లు పడడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది రాధా చుట్టూ చూస్తూ గబుక్కున లేచి కూర్చుంది ఇంకా చీకట్లు పోలేదు. గడియారం వంక నీళ్ల వంక చూసింది గడియారం 4:00 చూపిస్తుంది నీళ్లుపోసి నవ్వుతూ చూసి ఎవరికి బాయ్ చెప్తున్నావు లే ..లే బట్టలు రాత్రి నానబెట్టి పెట్టావు మొదట  అవి కాని ఆ తర్వాత టీ పెట్టి ఇవ్వు గారె లకు  మినప పప్పు రుబ్బాలి అని మర్చిపోయావా అసలే రేపు మా అక్క బావ లు వస్తున్నారు

ఇల్లంతా సర్దాలి ఇంకా బై బై లు చెప్తూ పడుకుంటే ఎలా అవతల ఇద్దర్ని రెడీ చేయాలి వంట చేయాలి బాక్సులు కట్టాలి, ఆపై ఆఫీసుకు వెళ్లాలి , ఆ తర్వాత కాస్త తొందరగా వచ్చి ఇల్లంతా సర్దు ఇప్పటికే గంట లేటు ఇంకా ఏంటది వెధవ  మొహం వేసుకుని చూస్తావు నాకు షేవింగ్ కు ముందుగా  వేడి నీళ్ళు పెట్టు అసలే   చలి చంపుతుంది అంటూ

లోపల స్వెటర్ పైనుండి బ్లాంకెట్ కళ్ళకు చెవులకు మంకీ క్యాప్ వేసుకుని  తనను లేపి ఈ చలిలో ఈ పనులన్నీ చెప్పడం అని తన మనసులో గుండె కలుక్కుమంది. తనది అత్యాశ అని  తెలిసి కూడా ఏమిటో  ఈ ఆశ కు , కలఅర్థం కాక , పన్నెండు ఏళ్ళ తన  కాపురం లో తన భర్త తనని “పాపం ” అన్న పాపాన పోలేదని గుర్తొచ్చి తనుకు రాబోయిన రాబోతున్న దుఃఖాన్ని నిట్టూర్పు బలవంతంగా అరుచుకుంటూ ..

తడిచిన జాకెట్ ని కొంగుతో తుడుచుకుంటున్న రాధ కు ఏంటి ఇంకా లేవలేదా అంటున్న భర్త పిలుపు వినిపించి ఆ వస్తున్నా అంటూ  ఆశ నిరాశల మధ్య బయటకు వెళ్లింది భర్తకు నీళ్ళు పెట్టడానికి కొంగును నడుముకు చుడుతూ భారతదేశ మధ్యతరగతి గృహిణి తన బాధ్యతలను నిర్వర్తించడానికి ఉద్యుక్తురాలవూతూ…

Related Posts