అక్షర కొరకు
అంశం : చిత్ర కవిత
శీర్షిక :ఊహలకు రెక్కలు వస్తే
అరటాకు ఒకటి ఆకాశమైందేమో….
గాలిలో తేలిపోతూ ఉంది…
ఒక మనిషి ఏ చింతా లేకుండా కూర్చున్నాడు….
అతడు రైతు కాదు, పైలటూ కాదు….
మన లాంటి మామూలు మనిషే..
పొద్దున్నే లేచి పొలం గట్టున కూర్చున్నాడు…
అరటాకు పరిచాడు,కాఫీ తెచ్చుకున్నాడు….
చేతిలో చిన్న కాఫీ గ్లాసు,
ఆవిర్లలోనే లోకాన్ని చూస్తున్నాడు…
కాళ్ళు ముడుచుకున్నాడు కానీ మనసు విప్పుకున్నాడు…..
కింద పచ్చని పొలాలు,
వంపులు తిరిగే నది..
నీలంగా నిలబడ్డ కొండలు,
అన్నీ అతనికి పలకరిస్తున్నాయి….
ఆశకు రెక్కలు ఉంటే చాలు,
ఎంత దూరమైనా ప్రయాణం చెయ్యవచ్చు…
అరటాకు మీదైనా సరే ఆకాశాన్ని దాటవచ్చు…
చేతిలో కాఫీ ఉంటే చాలు కాలాన్నే ఆపవచ్చు….
పొలాల పైన ఎగిరినా, కొండలను దాటినా…
అది కాళ్ళ ప్రయాణం కాదు, ఊహల ప్రయాణం…
ఆశల ప్రయాణం….
అతని కాళ్ళ కింద భూమే ఉంది,కానీ అతని ఆలోచన ఆకాశంలో ఉంది….
ఎంత డబ్బుంటే మాత్రం ఏం ఇలాంటి ఉదయం కొనగలమా…..
మనిషి ఎగరాలంటే విమానం అక్కర్లేదు…
మనసు తేలికైతే చాలు..
అరటాకు చాలు,ఒక కాఫీ చాలు…..
మట్టిని ప్రేమించే గుండె చాలు….
గాలి వీస్తుంటే చింతలన్నీ ఎగిరిపోతున్నాయి…
కాఫీ చుక్కలో లోకమంతా కనిపిస్తుంది…
ఇది ఊహా కాదు,ఒక సత్యం…
ఎత్తుకి ఎగిరినా మట్టిని మరువని మనిషి కథ…
నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
గరిగిపాటి శ్రీలక్ష్మి నారాయణమ్మ.
ఏలూరు.