కణకణకణమను నిప్పుల కొలిమీ…

కణకణకణమను నిప్పుల కొలిమీ
మిలమిలమిలమను ఖడ్గము కన్నది
రణమున-తనమన భేదము ఎరుగని
రేడుని వలచిన ఖడ్గమది
అతిక్రూరభీకర యుద్ధవీరులను
ఖండఖండముగ నరికెనది
కట కట కట కట నరుకుట మొదలు
ఒక్కొక్కరినీ ముక్కలు చెక్కలు
చేసి తరించిన రణ పిషాచమది
తాతల తండ్రుల కొడుకుల మనుమల
తరముల తుడిచిన శరభీకరమది
కాలాతీతం భయ ఉత్పాతం
ఓటమినెరుగని మృత్యురూపమది

ఒకరెనుకొకరెనుకొకరుగ రండని
అరువగ సోయే వచ్చినది
రాజులు పోయి రాజ్యాలు పోయి
ఒంటిగ మిగిలిన ప్రళయమునచ్చట
చూడగ జాలే వేసినది
ముద్దు ముద్దు ముదు ముద్దు
బాలలురిమురిమి సూడగ తలవంచెనది
లంబకోణమున వంగిన ముసలికి
మూడవకాలే అవునది
మెరుపు పోయినది పదును తగ్గినది
మరణం కోసం ఆగెనది
కాలం గెలుపే తథ్యం
మిగతా అంతా మిథ్యం
అనుమాటను మూటగ మనకిచ్చుటకే
మ్యూజియంలోని సాక్ష్యమిది

“శ్రీ”రాత

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *