కలయో నిజమో …

కలయో నిజమో...నింగి తెంచిన పుష్పమా…!!!

అరచేతిన రంగరించిన సిందూరంలా
పండు బారిన ఆకాశం…
కరిగిన మనస్సును విప్పార బోసినట్టుగా
సంధ్యనలకిన సువర్ణపుచ్ఛాయలు…
మూటగట్టుకొన్న మురిపెంగా…
ఎదలోతుల్లో ఒదిగిన పూర్ణీభావమై
ఎత్తు పల్లాలను దిగుతు అవని అంచుల్లో
వాలిపోతున్నట్టుంది…

కలయో నిజమో కనురెప్పలు
వాల్చని సమ్మోహనమో…
కరుడు గట్టిన మదిని సైతం కావ్యాలు
రాయిస్తు… కదలిన ఆ సుందర రూపం
నింగి తెంచిన పుష్పమా…
వెన్నెల చిలికిన పాలసంద్రమా…
వలచి వస్తున్న ఆ చల్లని వేళన
నోళ్ళూరే ఎన్ని ఆంతరంగిక
భావాలను ద్వారమై తెరుచునో…

కొత్త పుంతలతో కోనకు వెలుగవుతు
తరిగిన తనువును నెగడ్చే బతుకెంత
కష్టమో కాలానికి విధిగా చూపకా…
ఉదరం నిండని నెల వంకలా కష్టాల
కడలిని దాటుతు…దాగని వ్యథలతో
దర్పణమై కనబడుతు…
తన జీవితాన మలుపులను వెన్నెల
పరుపులపై కథలుగా వినిపించుటకు
వస్తుందేమో…

అరుదెంచే ఆ వెన్నెల పర్వతం…
వలపు విన్యాసం కాదు…తనదైవం
మండే అగ్ని గోళమైనా పుచ్చుకొన్న
ఫలితం మమకారమై మనుషుల
లోకానికి చలువలుగా పంచుతు…
చరాచర సృష్టికి మూలమై
అనురాగాల వెల్లువలతో ప్రతి మనిషిని
బలపరుస్తుంది చల్లని దీవెనలతో….

దేరంగుల భైరవ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *