కలేకూరు ప్రసాద్
కలేకూరి ప్రసాద్ (1964 అక్టోబర్ 25 – 2013 మే 17) కవి, సినీ గీత రచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, దళిత ఉద్యమకారుడు. జననాట్య మండలి, విప్లవ రచయితల సంఘంలో పనిచేశాడు. 1994 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరపున నందిగామ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి 1,467 ఓట్లు సాధించాడు.
ప్రసాద్ 1964 అక్టోబర్ 25వ తేదీన కృష్ణా జిల్లా, కంచికచెర్లలో జన్మించాడు. ఆయన తల్లి తండ్రులు లలితా సరోజిని, శ్రీనివాసరావులు ఇద్దరూ ఉపాధ్యాయులే. తమ గ్రామంలో కంచికచర్ల కోటేశు అనే యువకుడ్ని పెత్తందార్లు సజీవదహనం చేయడంతో చలించిపోయి, కలేకూరి ప్రసాద్ పీపుల్స్‌వార్ ఉద్యమంలో చేరాడు. పార్టీ రాజకీయ పాఠశాలల్లో బోధకుడిగా పనిచేశాడు. కారంచేడు ఘటనలో దళితుల మారణకాండతో దళిత ఉద్యమాల్లో పనిచేశాడు. పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చిన కె.జి.సత్యమూర్తి వంటి నాయకులతో కలిసి జిల్లాలో జరిగిన పలు ప్రజా, దళిత ఉద్యమాల్లో పనిచేశాడు. డర్బన్‌లో జాతి వివక్షపై జరిగిన చారిత్రక అంతర్జాతీయ సదస్సులో కలేకూరి పాల్గొన్నాడు. అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో సైతం తన ఉపన్యాసాన్ని ఆసక్తిగా విన్నారని కలేకూరి పలు సందర్భాల్లో చెప్పేవాడు.
కలేకూరి ప్రసాద్ యువక అనే కలం పేరుతో కవితలు రాసాడు. మండుతున్న చుండూరు, దళిత కవిత్వం లాంటి కవితా సంకలనాల్లో ఆయన కవితలు చోటు చేసుకున్నాయి. ప్రసాద్ రాసిన పాటలను పలు చిత్రాలకు ఉపయోగించుకున్నాడు. కర్మభూమిలో పూసిన ఓ పువ్వా, భూమికి పచ్చాని రంగేసినట్టూ, చిన్ని చిన్ని ఆశలే చిందులేయగా తదితర గీతాలు బహు ప్రాచుర్యం పొందాయి. శ్రీరాములయ్య సినిమాలో వాడిన భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలాలో.. పాట కారంచేడును ఉద్దేశించి రాసినది. టంగుటూరులో నవవధువు ఇందిర హత్యకు గురైన సమయంలో ఆయన రాసిన కర్మభూమిలో పూసిన ఓ పువ్వా.. విరిసీ విరియని ఓ చిరునవ్వా.. పాట రాసి మహిళా ఉద్యమానికి వూపిరిలూదాడు.
నిఘా, ఏకలవ్య, బహుజన వంటి పత్రికలకు సంపాదకత్వం వహించాడు. ఇంగ్లీష్ భాషపై మంచి పట్టున్న ఆయన విదేశీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించాడు. స్వామి ధర్మతీర్థ రచించిన హిందూ సామ్రాజ్యవాద చరిత్ర పుస్తకాన్ని తెలుగులోకి తెచ్చాడు. ఆ అనువాదం దాదాపు పది ముద్రణలు పొందింది. తెలుగులో రాచమల్లు రామచంద్రారెడ్డి తర్వాత ఆ స్థాయిలో అనువాదాలు చేసిన ఘనత కలేకూరికే దక్కుతుంది. ఆంధ్రభూమిలో కొంతకాలం సబ్ ఎడిటర్‌గానూ పనిచేశాడు.
చిలకలూరిపేట బస్సు ఘటనలో ఉరిశిక్ష పడిన చలపతి, విజయవర్ధనం కోసం జరిగిన ఉద్యమంలో విప్లవ దళిత కవి శివసాగర్‌తో కలిసి పాల్గొన్నాడు.
కలేకూరి ప్రసాద్ స్వీయ రచనలు
దళిత సాహిత్యం (దళిత స్త్రీ సాహిత్య పరిషత్, 1993)
దళిత కిరణాలు (లోకాయుత, 1996)
దళిత ఉద్యమం దళిత సాహిత్యోద్యమం (1999)
ఆంధ్రప్రదేశ్ దళితులు (ప్రజాశక్తి, 2001)
పిడికెడు ఆత్మగౌరవం కోసం (బహుజన కెరటాలు ప్రచురణ, 2012).
అనువాదాలు
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ:
మహాశ్వేతా దేవి కథలు ‘ఛోళీ కె పీఛే ‘, ‘పాలతల్లి ‘ (1997)
మహాశ్వేతా దేవి కథ ‘రుదాలి’, అంజుం కత్యాల్ ‘రుదాలి-జీవన పరిణామ చిత్రణ’ (1998)
అరుంధతీ రాయ్ ‘ఊహలు సైతం అంతమయ్యే వేళ’ (1998)
స్వామీ ధర్మతీర్ధ ‘హిందూ సామ్రాజ్యవాద చరిత్ర’ (1998)
వందన సోనాళ్కర్ “జెండర్ రాజకీయాలు- చర్చనీయాంశాలు’ (కె. సజయతో కలిసి, 1999).
ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రచురణ
జాన్ హోల్ట్ ‘పిల్లలు ఎలా నేర్చుకుంటారు’ (వి.శ్రీహరి, సుంకర రామచంద్రరావులతో కలిసి 2002)
ఏ.జి.నూరానీ ‘ఇస్లాం-జిహాద్’ (2003)
చేగువేరా రచనలు ‘విప్లవం రాజకీయాలు’ (సఫ్దర్ అహ్మద్, గుడిపూడి విజయరావులతో కలిసి, 2004).
ఇతర ప్రచురణలు
పి. సాయినాథ్ ‘ప్రచార సాధనాలు – పీడిత ప్రజలు’ (అనువాదం)
‘భోపాల్ డాక్యుమెంట్-డిక్లరేషన్’ (అనువాదం, 2002)
సాక్షి, హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలు (అనువాదం)
ఎవరికీ తలవంచని నేటి తరం హీరో (బహుజన కెరటాలు, కలేకూరి ప్రసాద్ స్మృతి సంచిక, 2013 ).
కలేకూరి ప్రసాద్ 2013, మే 17 న ఒంగోలు లోని అంబేద్కర్ భవన్‌లో మరణించాడు.
మాధవి కాళ్ల