కాలం పంపిన కారణమది…!!!
కనుపాపలపై కాచిన అక్షరాలను
మదితడినే సిరాగ చేసుకొని రాస్తున్నా..!!
మరణం కాలిపోయినది చితాభస్మం
చితిని దహించివేసినది అగ్ని కణం…
ఆలోచనెందుకు మిగిలేదుండని శూన్యం
బతుకు నడిచే సుఖదుఃఖాల ఆరాటాలతో
జీవన్మరణ పోరాటాన్ని ఎన్నాళ్ళని చేస్తావు…
సృష్టిని తోచిన విశ్వాసం ప్రళయం
వృష్టి ముంచిన బతుకు అయోమయం…
నీ శ్వాసల మడతలతో పిలిస్తే చావురాదు..!!
అది పనిగట్టుకు కాలం పంపిన కారణమది…
అహంకరించకు తిరగలిలా తిరిగే జీవితాన్ని
అనుభవాల జ్ఞాపకాలతో తీరం దాటించుకో…
వ్యామోహాల చిట్టాలతో విడిపోకు
ఉన్మాదాల ఊపిరితో గొడుగులిప్పకు..!!
చీకటి వెలుగులు ఒక కంటిలో పొడవనీకు
రెప్పల చాటున స్వర్గసుఖాలను తలువకు
నడిచే ఈ నేలపైనే పాపపుణ్యాల భేరీజులు…
అమలయ్యేదిక్కడే అనుభవించేది ఇక్కడే…
మొహమాటమెందుకు కారునిజం ఖచ్చితం
తప్పని భాగ్యానికి అందరు దాసోహం…
జననంతో చుట్టుముట్టినవి వలయాలు
మరణంతో నిన్నొదలినవి మమకారాలు..!!
తూగని తక్కెడలో జారేదే జననమరణాలు
విసరిన సవాళ్ళతో నేలనిడిచి సాముచేసినా
పిడికెడన్నము కొరకే మోసేది ఆ నలుగురే…
తెలిసిన వాస్తవానికి తెరచాటువై పోయి…
భౌతిక వ్యాపకమై లోకం కంటికి శుక్లమైనా…
మరణం తానైవచ్చే యాదృచ్ఛిక వరమది…
దేరంగుల భైరవ