కూరెళ్ల విఠలాచార్య
కూరెళ్ల విఠలాచార్య (తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు)
డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య, తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకులు, సామాజిక వేత్త, గ్రంథాలయ స్థాపకుడు. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు సాగిస్తున్నాడు. కవిగా 22 పుస్తకాలను వెలువరించిన విఠలాచార్య, పదవీ విరమణ అనంతరం తన స్వగ్రామంలోని తన గృహంలో సుమారు రెండు లక్షల గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశాడు.
ప్రధానమంత్రి మోడీ 2021, డిసెంబరు 26 ఆదివారం రోజున రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో కూరెల్ల విఠలాచార్య గురించి ప్రస్తావిస్తూ ‘‘కలలను నిజం చేసుకోవాడానికి వయసు అడ్డుకాదని, ఈ విషయంలో తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్ కూరెల్ల విఠలాచార్య మనందరికీ ఆదర్శం. ఆయనకు చిన్నతనం నుంచి ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేయాలనే కోరిక ఉండేది. చదువుకుని లెక్చరర్‌గా ఉద్యోగం చేసిన విఠలాచార్య.. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి ఈ రిటైర్మెంట్ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు” అని ప్రశంసించాడు.
2024, జనవరి 25న భారత ప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. 2024 మే 9న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.
ఆబాల్యకవియైన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య 1938 జూలై 9న యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని అతని మాతామహుల గ్రామమైన నీర్నేములలో కూరెళ్ల వెంకటరాజయ్య – లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆ కాలంలో ఇతని తండ్రి కూరెళ్ల వేంకటరాజయ్య గొప్ప స్వర్ణకారుడని ప్రతీతి. అంతేకాకుండా మంచి చిత్రకారుడు కూడా.అతను చేసిన అపురూపమైన చక్కని చొక్కపు ఆభరణాలు ఊళ్ళో వాళ్ళు విఠలాచార్యులకు చూపించి పొంగి పోతుంటారు. అయితే దురదృష్టవశాత్తూ తండ్రి వెంకటరాజయ్య అనారోగ్యానికి గురైనాడు.వెంకటరాజయ్య అన్నదమ్ములు అతని ఆరోగ్యాన్ని గురించి పట్టించుకోలేదు. శివుడు మీది భారంతో జైకేసారం అనే ఊరి చివరి శివాలయంలో విడిదికి వెళ్ళాడు. రోగం ముదిరి ఇతని తండ్రి వెంకటరాజయ్య1938లో మరణించారు. అప్పటికీ కష్టజాతకుడైన కవి విఠలాచార్య వయస్సు 5 నెలలు మాత్రమే. బాల్య వివాహాలు జరిగే ఆనాటి సమాజంలో అతని అమ్మ లక్ష్మమ్మ వయస్సు ఆనాటికీ 15 సంవత్సరాలు మాత్రమే. జీవిత సుఖాలు త్యాగం చేసి అష్టకష్టాలుపడి తల్లి లక్ష్మమ్మ విఠలాచార్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచింది. చిన్ననాటి ఆ పరిస్థితులు కవిహృదయంపై చెరగని ముద్రవేశాయి.
1957లో హెచ్.ఎస్.సి (higher secondary certificate) పరీక్ష పాసు కాగానే ఆచార్యులవారు వీరి బంధువైన దాసోజు విశ్వనాధాచారి పేషకార్ తమాసిల్‌క చేరి రామన్నపేట గారి సహాయంతో రామన్నపేటలోని తహశిల్దారు ఆఫీసులో 20 రూపాయల జీతంతో కాపేరైటర్‌గా ఉద్యోగాన్ని పొందాడు. ఇది చేస్తుండగా కో-ఆపరేటివ్‌లో సూపర్‌వైజర్ పోస్టు ఖాళీగా ఉంటే తన మిత్రుడైన లవణం సత్యనారాయణ ద్వారా ఆ ఉద్యోగంలో చేరాడు. అప్పట్లో ఆ ఉద్యోగ జీతం 80 రూపాయలు. అయితే కో-ఆపరేటివ్ కార్యాలయంలో జరిగే అవినేతి కార్యక్రమాలు, లంచాలు ఆచార్యులవారి హృదయానికి బాగా ఇబ్బంది కల్గించాయి. అది నచ్చక ఈయన ఆ ఉద్యోగాన్ని వదిలేసి దొరికిన ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోసాగాడు. కొంతకాలానికి అలీమొద్దిన్, అబ్బాస్ అలీ వకీల్ల సహాయంతో భువనగిరి న్యాయస్థానంలో కాపీరైటర్‌గా చేరాడు. ఆ తర్వాత కొంతకాలానికి వరంగల్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసు నుండి పిలుపు వచ్చి మిర్యాలగూడ సేల్స్-టాక్స్ ఆఫీసులో ఎల్.డి.సి.గా ఉద్యోగం పొందాడు. ఆచార్యులవారికి అవినేతితో నిండిన ఆ ఉద్యోగం నచ్చక రాజీనామా చేసాడు. తరువాత కొంత కాలానికి భువనగిరి ఎలక్ట్రిసిటి ఆఫీసులో ఎల్.డి.సి స్థాయి ఉద్యోగం చేయసాగాడు.
ఈ సమయంలో తన స్నేహితుడైన గుర్రం బుచ్చిరెడ్డి ఉపాధ్యాయ శిక్షణ కోసం మేడ్చల్ వెళ్ళాడు. అక్కడ ఇంకా రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. నీవు కూడా వచ్చి ప్రవేశం తీసుకోగలవు అని బుచ్చిరెడ్డిగారు ఆచార్యులవారికి లేఖ రాశాడు, వెంటనే ఆచార్యులవారు మేడ్చల్ వెళ్ళి ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో ప్రవేశించాడు. శిక్షణ కాలంలో అక్కడే బహుబాషా కవి సమ్మేళనం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమ్మేళనానికి తెలుగు కవిగా ప్రసిద్ధులైన ఉత్పల సత్యనారాయణాచార్య గారు హాజరయ్యారు. వారి కమ్మని పధ్యపఠన ధోరణి ఆచార్యుల వారి హృదయంపై చెరగని ముద్ర వేసింది. ఈ నాటికీ ఆచార్యులవారు ఉత్పల వారి ధోరణిలోనే కావ్యగానం చేస్థుంటారు. అయితే ఆ కవి సమ్మేళనంలో విఠలాచార్య వారు కూడా ఆశువుగా పద్యాలను చెప్పారు. వాటిని విని ఆ కళాశాల ప్రిన్సిపాల్ పి.వి. రామకృష్ణరావు ఉత్సాహం తట్టుకోలేక తన మెడలో వేసిన పూలమాలను తీసి ఆచార్యులవారి మెడలో వేసి అభినందించాడు. ఉపాధ్యాయ శిక్షణలో ఆచార్యుల వారికి రాష్ట్ర ఉత్తమస్థానం లభించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌ. భీంసేన్ సచారా ద్వారా షీల్డు బహుకరించబడింది.
విద్యార్థి దశలోనే తన రచనావ్యాసాంగానికి శ్రీకారం చుట్టారు. తెలుగులో గొలుసుకట్టు నవలలు, స్వాతంత్ర్యోద్యమం-ఆంధ్రప్రదేశ్‌లో దానిస్వరూపం, విఠలేశ్వరశతకం, శిల్పాచార్యులు (పద్యకవితాసంకలం), స్మృత్యంజలి (పద్యగద్యకవితాసంపుటి), వెల్లంకి వెలుగు (గ్రామచరిత్ర), సహస్రసత్యాలు, కూరెళ్ల పద్యకుసుమాలు వంటి రచనలు బాగా ప్రాచుర్యం పొందాయి. 12 ఏండ్ల ప్రాయంలో ఆచార్యులవారు 7వ తరగతి చదువుచున్నప్పుడు (1953-54) వారి తాతగారు బేతోజు లక్ష్మీనారాయణ గారు మరణించారు. ఆ వయస్సులోనే కవి గారు వారి మీద “స్మృతికావ్యం” రాశారు. ఆ పద్యాలను ఆయన స్నేహితుడైన దొంతరబోయిన, చెలమంద మొదలైనవారికి వినిపించేవారు. ఈ సమయంలోనే నీరునెములలో స్నేహితులతో కలిసి ఒక సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేశారు వివిధ పండుగల సందర్భాలలో ఆయా పండుగలపై పద్యాలు వ్రాసి స్నేహితులకు వినిపించేవారు. ఓ పర్యాయం నీరునెములలోని హనుమదాలయంలో మిత్రులతో కలిసి సహపంక్తి భోజన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఆ గ్రామంలోని అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురి అయ్యడు. ఈ దశలోనే ఆచార్యులవారు నీరునెములలో “విద్యాడ్రామా” అనే నాటికను రాయడమేగాక అందులో సుగంధరెడ్డి అనే పాత్రను కూడా ధరించి ప్రదర్శించాడు. అలాగే “గురుదక్షిణ”, “లంకాదహనం”, భక్త కన్నప్ప అనే నాటకాలలో ఏకలవ్య, హనుమంతుడు, కన్నప్ప పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ రకంగా ప్రాథమిక విద్యా స్థాయిలోనే ఆచార్యుల వారి కవితా వ్యాసంగం వెలుగులోకి వచ్చి సమకాలీన లబ్ధి ప్రతీష్ఠ సాహితీపరులను ఆశ్చర్య పరిచింది.
తొలిదశ ఉద్యమంలో భాగంగా 1952లో జరిగిన నాన్ ముల్కి ఉద్యమంలో విఠలాచార్య విద్యార్థిగా పాల్గొని హర్తాళ్ తదితర కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టారు. మలిదశ ఉద్యమంలో భాగంగా 1969లో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగిగా చురుకైన పాత్ర పోషించారు.
తుది సమరంలో భాగంగా 2001 నుంచి విశ్రాంత ఉద్యోగిగా పాల్గొంటూ కవిగా, రచయితగా, వక్తగా తనదైన ముద్రను ఉద్యమంలో చూపెట్టాడు. తన సహిత్య ప్రతిభతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమంపై కాంక్షను పెంచడంలో ప్రముఖ పాత్ర పోషించారు.
ఆచార్యులవారు చదువుకుంటున్న రోజుల్లో సెలవులకో, పండుగ పబ్బాలకో స్వగ్రామమైన ఎల్లంకి వెళ్ళేవారు. ఎల్లంకి గ్రామంలో 1955వ సంవత్సరంలో తిమ్మాపురం వీరారెడ్డి, కణతాల నరసింహారెడ్డి, పోలు నరసింహారెడ్డి, రావీటి విఠలేశ్వరం, పున్న నరసింహ మొదలగు మిత్రులతో కలసి శ్రీ శంభులింగేశ్వరస్వామి పేర ఒక గ్రంథాలయం స్థాపించారు. దీనిని ఆ ఊరి దేశ్‌ముఖ్ అనుముల లక్ష్మీనరసింహరావు గారిచే ప్రారంభం చేయించారు. మిత్రులతో కలసి ఇల్లిల్లు తిరిగి గ్రంథాలు సేకరించేవారు ఈ గ్రంథాలయమే యువ నాయకత్వానికి ఆ ఊళ్ళో ఎంతో స్పూర్తినిచ్చింది.
కాని ఈ గ్రంథాలయం ఎక్కువ కాలం నిలువలేదు. ఆనాటి నుండి ఆచార్యుల వారికి తన సొంతూరు ఎల్లంకిలో గ్రంథాలయాన్ని నెలకొల్పాలని ఆకాంక్ష బలంగా ఉండేది ఆ తపనతోనే “ఆచార్య కూరెళ్ళ ట్రస్టు”ను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఆధ్వర్యమున సుమారు నాలుగు వేల గ్రంథాలతో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుపెట్టిన రోజు (13 ఫిబ్రవరి 2014) న “ఆచార్య కూరెళ్ళ గ్రంథాలయం”, సాయి సాహితీ కుటీరము, ఎల్లంకి అనే పేరున తాను నివసిస్తున్న ఇంటినే గ్రంథాలయంగా మార్చి, జిల్లా కలెక్టర్ గౌరవ శ్రీ టి.చిరంజీవులు గారిచే మహావైభవంగా ప్రారంభోత్సవం చేసి గ్రామానికి అంకితం చేసారు.
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య రెండు లక్షల పుస్తకాలతో ఏర్పాటు చేసిన కూరెళ్ల గ్రంథాలయాన్ని, రూ.రెండు కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని 2024 ఫిబ్రవరి 19న రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించింది.
సేవాకార్యక్రమాలు
సాహిత్యంతోపాటు సమాజసేవలోనూ కూరెళ్ల తనదైనశైలిని కొనసాగించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రోజుల్లో ప్రభుత్వానికి ఆలోచనరాకముందే 1961లో భువనగిరి తాలుకా వడాయిగూడెంలో అక్షరాస్యతా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
1960 నుండి 1980 వరకు రాష్ట్రోపాధ్యాయ సంఘంలో సమితి స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ పదవులు నిర్వహించి, ఉపాధ్యాయులకు సేవలందించారు. చౌటుప్పల్ రామన్నపేట మండలాల స్థానికంగా ఉపాధ్యాయ సంఘ భవనాల నిర్మాణం కోసం కృషి చేసారు.
రామన్నపేట మండలం, నీరునెముల గ్రామంలో రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల జాతీయ సేవా పథకం పక్షాన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య ఆధ్వర్యాన రెండు మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేయబడి ఈ గ్రామ ప్రజల రాకపోకలకు మిక్కిలి అవరోధంగా ఉన్న బురుజును ( 1991 జూన్ 18- 1991 జూన్ 23) తొలగించి స్థానిక ప్రజలకు, ప్రత్యేకంగా పాఠశాలకు సౌకర్యం కలిగించనైనది.
రచనలు
తెలుగు నవలల్లో స్వాతంత్ర్యోద్యమ చిత్రణం. (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
తెలుగులో గొలుసుకట్టు నవలలు (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం)
స్వాతంత్ర్యోద్యమం ఆంధ్రప్రదేశ్‌లో దాని స్వరూపం
విఠలేశ్వర శతకము (సామాజిక స్పృహ నిండిన సచిత్ర పద్యకృతి)
మధురకవి కూరెళ్ళ పీఠికలు (సేకరణ: దాసోజు ఙ్ఞానేశ్వర్)
పురస్కారాలు, సన్మానాలు, స్వీకృత గ్రంథాలు
సాహిత్యంతోపాటు సామాజికరంగంలో విశేషమైన కృషిచేసినందుకుగాను పలుసాహిత్యసంస్థలు పురస్కారాలను అందజేశాయి.
తేజ ఆర్ట్ క్రియేషన్స్ ఆలేరు వారి జీవిత సాఫల్య పురస్కారం.
వాస్తుశిల్పి బి.ఎన్.రెడ్డి పురస్కారం.
ప్రజాకవి సుద్దాల హనుమంతు పురస్కారం.
1979 నల్లగొండ జిల్లా ఉత్తమ ప్రధానాచార్య పురస్కారం
రాష్ట్రోపాధ్యాయసంఘం స్వర్ణోత్సవ పురస్కారం.
అంబడిపూడి పురస్కారం.
తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ను, కీర్తి పురస్కారం
భూదానోద్యమ స్వర్ణోత్సవ పురస్కారం, పోచంపల్లి.
స్థాపించిన-స్థాపించడానికి ప్రముఖ పాత్ర వహించిన సంస్థలు
సత్యగాయత్రి ఆశ్రమం – ఎల్లంకి (1982)
చైతన్య కళాస్రవంతి – రామన్నపేట (1985)
సాహితీ స్నేహితులు – రామన్నపేట (1986)
స్పందన – రామన్నపేట (1987)
స్ఫూర్తి -సిరిపురం (1993)
విధ్యాలయాల్లో నెలకొల్పిన పత్రికలు
బాపు భారతి ప్రాథమిక పాఠశాల, గోకారం (1961)[23]
మా తెలుగుతల్లి ఉన్నత పాఠశాల, ఎల్లంకి (1963)
వలివెలుగు ఉన్నత పాఠశాల, వలిగొండ (1967)
మన పురోగమనం రాష్ట్రోపాధ్యాయ సంఘం, రామన్నపేట (1974)
చిరంజీవి ఉన్నత పాఠశాల, సిరిపురం (1977)
మాధవి కాళ్ల