కొన్ని సేకరణలు

కొన్ని సేకరణలు

(1) నవరత్నకిరీటం, నవరత్నఖడ్గం, నవరత్న అంగులీకం (ఉంగరం) = అనగా తొమ్మిది జాతిరత్నాలు పొదిగిన కిరీటం,కత్తి, ఉంగరమన్నమాట.
నవరత్నాలంటే తొమ్మిదిరత్నాలు, అవి 

(1) కెంపు (మాణిక్యం) (2) వజ్రం,
(3) నీలం, (4) పుష్యరాగం, (5) మరకతం, (6) ముత్యం,(7) పగడం, (ప్రవాళం)(8) గోమేదికం,
(9) వైడూర్యం.

1513 లో శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరువెంగళనాథునికి నవరత్నఖచిత కిరీటాన్ని బహుకరించాడు.

పెద్దపులిని చంపినవాడేవరు ?

పులిమాన్యం = పులినిచంపినందుకు ఇచ్చినమాన్యం. కోలారుజిల్లా శ్రీనివాసపురంలోని శాసనం ప్రకారం వీరన్న అనేసైనికుడు పెద్దపులిని ఎదుర్కొని వీరోచితంగా పోరాడిచంపాడు. అందుకుగాను వీరన్నకు 1728 లో తిరుమలప్పనాయుడు, దళవాయిరంగప్ప అనేవారు కొంత భూమిని వీరన్నకు పులిమాన్యంగా ఇవ్వడం జరిగింది.

టిప్పు సుల్తాన్ కంటే ముందుగానే ఓ సాధారణ సైనికుడు పులితో పోరాడి దానిని చంపేశాడు. వీరన్నకు ఎందుకోమరి ప్రచారం కరువైంది. ఈనాడు కర్ణాటకలోని కోలారుజిల్లా ప్రాంతం తెలుగు పాలేగారుల ఏలుబడిలోవుండేది.

శ్రోత్రియుడంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు. శ్రోత్రియ అగ్రహారమంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడికి కానుకగా ఇచ్చిన గ్రామం.

చతుష్షష్టివిద్యాప్రవీణుడు = అనగా 64 కళలలో నిష్ణాతుడైనవాడు. 64 విద్యలు నేర్చినవాడు. ఆ కళలేవంటే

(1) వేదాంగములు (2) న్యాయశాస్త్రము (3) కావ్యాలంకారనాటకము(4) కవిత్వము (5) కామశాస్త్రము (6) ద్యూతనైపుణ్యము (7) దేశభాషా పరిజ్ఞానము (8) లిపిజ్ఞానము (9) లిపిక్రియ ( 10 ) సమస్తావధానము, (11) స్వరశాస్త్రము (12) వాచకము (13) సాముద్రికము (14) శాకునము (15) రత్నపరీక్ష (16) స్వర్ణపరీక్ష, (17) తురగ (గుర్రం) లక్షణము (18) గజశాస్త్రము (19) మల్లవిద్య(20) పాకకర్మ (21) దశదోహలవిద్య (22) గంధవాదము (23) ధాతువాదము (24) ఖనీవాదము (25) రసవాదము (26) అగ్నిస్తంభము, (27) జలస్తంభము (28) అసిస్తంభము (29) వాయుస్తంభము (30) వశ్యము (31) మోహనము (32) ఆకర్షణము (33) ఉచ్చాటనము (34) విద్వేషము (35) మారణము (36) కాలవంచనము (37) వాణిజ్యము, (38) పాశుపాల్యము (39) కృషి (వ్యవసాయం (40) ఆసవకర్మ (41) లావుకాయోధనప్రౌఢి (42) మేషయుద్ధ కౌశలము (43) రతికౌశలము (44) ఆఖేటము (45) అదృశ్యకరణి (46) చిత్రరోగక్రియ (47) అశ్మక్రియ (48) మృత్క్రియ (49) దారుక్రియ (50) వేణుక్రియ (51) చర్మక్రియ (52) అంబరక్రియ (53) దూరకరణి (54) చోరకర్మ (55) అంజనకర్మ (56) మంత్రౌషధ సిద్ధి (57) స్వరవంచనము (58) దృష్టివంచనము (59) జలప్లవన సిద్ధి (60) వాక్సిద్ధి (61) ఘటికాసిద్ధి (62) పాదుకాసిద్ధి (63) ఇంద్రజాలము (64) మహేంద్రజాలము.

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్మ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.

ఈ భర్త్రహరిసుభాషితం ప్రకారం తివిరి అంటే ప్రయత్నంతో ఇసుకలో నూనెను తీయవచ్చు, దాహంతో మృగతృష్ణ( ఎడారి) లో నీటిని తాగవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు, కాని మూర్ఖులను రంజింపచేయడం కష్టమని అర్థం.

Related Posts