కోడి గుడ్డు పులుసు

ఆదివారం వచ్చిందంటే మా పిల్లలకు పండగే అన్న మాట, ఆరోజు మాయమ్మ మరి గుడ్డు పులుసు చేస్తుంది కదా, దాని కోసమే మేము వారమంతా ఎదురు చూస్తూ ఉంటాము. మరి మాయమ్మ చేసిన పులుసు కోసం ఎన్ని దినాలు అయిన ఎదురు చూడాల్సిందే మరి మా యమ్మ అంత గొప్పగా వండుతాది పులుసును.

అలాగని ప్రతి ఆదివారం వండదు పులుసుని మా నాయనా బాగా ఖుషీగా ఉన్న నాడు, కూలి డబ్బులు బాగా వచ్చిన నాడు నే, అంతే మరి రోజు డబ్బు కావాలంటే యడనుండి వస్తది,వచ్చే కూలి డబ్బులతో పండుకారాం ఏసుకుని తినడమే మాకు పరమాన్నం లాగా ఉంటది కదా,అందుకే గుడ్డు పులుసు చేసినా నాడు మాకు పండగ కిందనే లెక్క గదా.

మా నాయనా ఖుషీగా ఉన్న నాడు పొద్దునే బోయి ఒక ఆరు గుడ్లను,ఒక కల్లు సీసాను తెచ్చుకుంటాడు.దాన్ని మాకు తెల్వకుండా మంచం కింద దాసుకుంటాడు,మరి నాకెట్ల తెల్సు అంటవా మనం అన్ని సోట్లు సోదిస్తాం గదా,అట్లా తెలుసు అన్న మాట, సీసా ని చూస్తా ,మా యమ్మ వండే పులుసు కోసం ఎదురు చూస్తూ, మా చిన్నితో అడుకుంటా కూసుంటాడు..

మా యమ్మా గుడ్లను ఒక గిన్నెలో ఇంత ఉప్పెసి ఉడకేసి, అదే నిప్పులో ఉల్లిగడ్డ వేసి బాగా కాలుస్తుంది. కాల్చిన ఉల్లిగడ్డను, ఇంత కారాన్ని రోట్లో వేసి బాగా మెత్తగా రుబ్బి, ఉడికిన గుడ్ల పొట్టును తీసి, పక్కన పెట్టుకుని, నాలుగు పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు, పచ్చి  మిరపకాయలు, ఇంకో గిన్నెను పొయ్యి మీద పెట్టి అందులో ఇంత ఏంటి ఇంత నూనె పోసి, మాములు రోజుల్లో అంత నూనె కూరలో వెయ్యదు మరి. నూనె వేగిన తర్వాత  జీలకర్ర, ఉల్లిగడ్డ, నూరిన కారం వేసి మఘించి, పసుపు వేసి ఉడికిన గుడ్లకు సన్నగా రంద్రాలు చేసి అందులో వేస్తుంది. దాన్ని కోసేపు మగ్గించి, పులుసు పోసి మంచి మంట మీద మరిగెదాకా ఉంచుతుంది. అది మారుగుతున్నప్పుడు వాసనకు మా వాడోలంతా ముక్కులు ఎగబిలుస్తా వాళ్ళ కడుపులు నింపుకుంటారు..

పులుసులో మరిగిన గుడ్డును, ఇంత పులుసును గిన్నెలో మా నాయనకు ఏసిచ్చి, మాకు అన్నాలు పెడుతుంది మా యమ్మ, మా నాయనా పులుసు తాగాతా, ఉల్లిగడ్డ తింటా కల్లు సీసాను ఖాళీ చేస్తూ ఉంటాడు. మా యమ్మ మమ్మల్ని పిలిచి, ఉడుకుడుకు తెల్లని బువ్వలో ఎర్రని పులుసేసి పెడతాది.., దాన్ని మేము ఉదుకుంటూ, తింటా ఉంటే ఉంటాది ఆహా సోర్గం యాడనో లేదు అని. పులుసు సుక్క నాలిక మీద పడంగానే జిహ్వ లేసి వస్తుంది. పక్క ఉడుకు, ఇంకో పక్క కారంతో ఉక్కిరిబిక్కిరి అయినా మళ్ళీ అదే రుచి కావాలి అని అనిపిస్తుంది.

వానకాలం అయితే ఇదే పులుసుని ఉల్లిగడ్డలు, ఉల్లాకు వేసి, పులుసును మరిగిస్తుంది. దాన్ని ఇలాగే ఉదుకుంటు, సల్లగా వానలో తడిసిన మాకు పెడుతుంది. మేము దాన్ని ఆనందంగా తింటుంటే, అది వెచ్చగా కడుపులోకి దిగుతుంటే, రుచే వేరు నా సామిరంగా స్వర్గం కనిపిస్తుంది. అయినా మికేమి తెలుసు రుచుల సంగతి, మా యమ్మ కారం చేసినా, పులుసు చేసినా ఎంతో కమ్మగా ఉంటాది. మీరు మేడలో, పాసిన డబల్రొట్టె మీద ఎర్రని జమో అదేందో రగతం లాంటిది ఏసుకుని తింటే మీకేం రుచి కొడతాదో కానీ మిరివ్వన్నీ తినకపోతే పాపం రుచి తెల్వనోళ్లు అనుకుంటా నేను.. 

ఇగో మా యమ్మ బువ్వ తిననికి పిలుస్తున్నది కని, మల్లా వస్తా.. పోతున్నా మల్లా

Related Posts