చలంగా ప్రసిద్ధుడైన గుడిపాటి వెంకట చలం సుప్రసిద్ధ తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక, మానసిక హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానాలను చర్చించాడు. చలం రచనలలో ఇతివృత్తమూ, తాత్వికతా, రచనాశైలీ ఆయనకు ఆధునిక తెలుగు రచనా రంగంలో అనన్యమైన స్థానాన్ని సంపాదించిపెట్టాయి.
చలంగా ప్రసిద్ధి చెందిన గుడిపాటి వెంకటచలం 1894, మే నెలలో 18న మద్రాసు నగరంలో జన్మించాడు. చలం తల్లి వేంకటసుబ్బమ్మ, తండ్రి కొమ్మూరి సాంబశివరావు. అయితే తన తాతగారు గుడిపాటి వేంకటరామయ్య దత్తత తీసుకోవడంతో, ఇంటిపేరు మారి గుడిపాటి వెంకటచలంగా పేరొందాడు. చిన్నతనంలో సంధ్యావందనం వంటి ఆచారాలను నిష్టగా పాటించాడు. ఉన్నత పాఠశాల చదువులు పూర్తి కాకముందే ఇతిహాస పురాణాలను క్షుణ్ణంగా చదివాడు. తన తండ్రి, తల్లిని వేధించే తీరు ఆ చిన్నవాని హృదయంపై బలమైన ముద్ర వేసింది. తన చెల్లెలు ‘అమ్మణ్ణి’ పెళ్ళి ఆగిపోవడం కూడా స్త్రీల పట్ల జరుగుతున్న అన్యాయాలపైకి అతని దృష్టిని గాఢంగా మళ్ళించింది.
1911లో పిఠాపురం మహారాజా కళాశాలలో చేరాడు. ఆ సమయంలో బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు నాయకత్వంలో అక్కడ నడుస్తున్న బ్రహ్మసమాజం వైపు ఆకర్షితుడయ్యాడు. తరువాత బి. ఎ. చదువు కోసం మద్రాసు వెళ్ళాడు. అంతకు ముందే చిట్టి రంగనాయకమ్మతో చలం వివాహం జరిగింది. మద్రాసులో తాను డిగ్రీ చదువుతూనే తన భార్యను కాన్వెంట్‌లో చేర్చి, తాను కాలేజీకి వెళ్ళేటప్పుడు ఆమెను సైకిల్ పై స్కూల్లో దించేవాడు. దీనిని అంతా వింతగా చూసేవారట. మామగారైతే చలాన్ని తన ఇంటి గడపే తొక్కవద్దన్నాడు. అప్పటికి చలం భార్య వయసు 13 సంవత్సరాలు. చదువు అయిన తరువాత కాకినాడలో ట్యూటర్‌గా ఉద్యోగంలో చేరాడు. తిరిగి బ్రహ్మసమాజ ఉద్యమంలోనూ, ‘రత్నమ్మ’ తో స్నేహం-ప్రేమ లోనూ బిజీ అయ్యాడు. టీచరుగా హోస్పేటలో పనిచేసి తిరిగి రాజమండ్రిలో టీచర్ ట్రైనింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తరువాత పాఠశాల తనిఖీ అధికారిగా పనిచేశాడు. తన ఉద్యోగం గురించి తాను రచించిన “మ్యూజింగ్స్”లో (72వ పుట, 5వ ముద్రణ 2005) ఈవిధంగా వ్యాఖ్యానం చేశాడు
“ రాతిని, ప్రభుత్వ బానిసను. స్కూళ్ళ తనిఖీదారుణ్ణి, ఉపాధ్యాయవర్గ ప్రాణ మూషికాలకి మార్జాలాన్ని ”
—చలం
చలం రచనల్లో అతను వ్యక్తపరచిన భావాలు, ప్రతిపాదించిన విషయాలు, అప్పటి సమాజం మీద ఎంతగానో ప్రభావం చూపాయి. కానీ, సమాజం అతన్ని అపార్థం చేసుకున్నది. అతను స్త్రీ స్వేచ్ఛ పేరుతో విశృంఖల జీవన విధానాన్ని ప్రచారం చేస్తున్నాడని, అతని కథల్లో బూతులు ఉన్నాయని ప్రచారం జరిగింది. చలం పుస్తకాలను బహిరంగంగా చదవటానికి భయపడిన రోజులవి. ఆసక్తి గల పాఠకులు, చలం పుస్తకాలని దాచుకుని చదివేవారట. చలం తన కథలు, నవలల్లో వ్రాసిన విషయాలకు అప్పటి సమాజం తట్టుకోలేక పోయింది. అతను తన అనేక రచనల్లో వ్యక్తపరచిన భావాలు, మచ్చుకి కొన్ని, ఈ వ్యాసంలో చలం వ్యాఖ్యలు, అభిప్రాయాలుగా ఉటంకించడం జరిగింది, అక్కడ చూడవచ్చును. దీనికి తోడు, అతని వ్యక్తిగత జీవితంలో అతని ప్రవర్తన (స్త్రీ లోలత్వం) కూడా అభ్యంతరకరముగా పరిగణింపబడింది. మొత్తంమీద, అతను సంఘంలో ఒక “విపరీత వ్యక్తి”గా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. దీనివలన, అతనితో ఎవరూ మాట్లాడేవారుకాదట. అతనికి ఇల్లు అద్దెకివ్వడానికి కూడా వెనకాడేవారట. ఇంతెందుకు, చివరకు అతని దగ్గరబంధువులు కూడా అతన్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. చలం ముఖ్యంగా తన రచనల వలన , కొంతవరకు తన అసాధారణ వ్యక్తిగత ప్రవర్తన వలన సంఘంనుండి వేరుపడి ఒంటరివాడయ్యాడు. అతని భార్య కూడా అతని మూలాన బంధువులకు దూరమయ్యింది. ఆతనిని సమర్థించి అతనితోనే ఉండటానికి నిర్ణయించుకోవడం మూలాన ఆమె తండ్రి, ఇతర బంధువులు కూడా ఆమెను దగ్గరకు చేరనిచ్చేవారు కాదు. కాని ఆమె, చలంను కొంతవరకు అర్ధంచేసుకుని, ఆర్యసమాజ భావాలను ప్రచారం చేయడంలో ఉత్సాహంగా అతనికి సహాయం చేసేదట. కాని, కొంతకాలానికి, ఆమె కూడా చలం ప్రవర్తనతో విసిగిపోయింది. ఇద్దరిమధ్య కీచులాటలు ప్రారంభమై ఒకరితో ఒకరు మాట్లాడుకోని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరి మధ్య అన్యోన్యత కరవైంది.
చలం తన రచనలను 1920 చివరి ప్రాంతాలలో మొదలు పెట్టాడు. 1930-40లలో ఎంతో ప్రసిద్ధి చెందాడు. ఏ రచయిత కూడా తెలుగులో ఇంతగా స్త్రీలగురించి వ్రాయలేదు. స్త్రీ రచయితలుకూడా, ఆయన వ్రాసినదాంట్లో శతసహస్రాంశం కూడా ఇంతవరకు వ్రాయలేకపొయ్యారు. ఈ మధ్యకాలంలో (1920-1950 మధ్య) చలం రచనలు తెలుగు దేశమంతటా పెనుతుఫానులాగా ముసురుకొన్నాయి. అతని స్త్రీవాదమూ, స్వేచ్ఛా, హిపోక్రసీనెదిరించే తత్వమూ, లెక్కలేనంత మందిని అతనికి శతృవులుగా మార్చాయి. చలం రచనలను బూతు సాహిత్యంగా పరిగణించి వెలివేశారు. ఆ వెలి భరించలేకే ఆయన ఆంధ్రదేశం వదలి 1950లో తమిళనాడులోని అరుణాచలంలో ఉన్న రమణ మహర్షి ఆశ్రమానికి కుటుంబంతోసహా వెళ్ళిపోయాడు.
రచనలు
మైదానం
దైవమిచ్చిన భార్య
ప్రేమ లేఖలు
స్త్రీ
మ్యూజింగ్స్
విషాదం
హరిశ్చంద్ర నాటిక.
మాధవి కాళ్ల
సేకరణ