ప్రతి విద్యార్థి బాధ్యత

గురుదక్షిణ

అక్షర కొరకు
అంశం :⁠- ఉపాధ్యాయ దినోత్సవం(చిత్ర కవిత)
తేది:⁠- 02/09/2026
శీర్షిక:⁠- గురుదక్షిణ

  సమయం ఉదయం ఎనిమిది గంటలు.వీధిలోని స్కూల్ వైపు పిల్లలు ఉత్సాహంగా నడుస్తున్నారు.అందరి చేతుల్లోనూ రంగురంగుల రోజా పూలు, గ్రీటింగ్ కార్డులు, చిన్న చిన్న బహుమతుల ప్యాకెట్లు ఉన్నాయి. 

పిల్లలంతా టీచర్లలా చీరలు, లాలాచీలు వేసుకుని ముస్తాబయ్యారు. ప్రతియేటా సెప్టెంబర్ 5న వచ్చే ఉపాధ్యాయ దినోత్సవం సందడి అంతటా కనిపిస్తోంది.
వీధి చివర ఉన్న తన చిన్న ఇంటి అరుగుపై కూర్చుని ఇదంతా గమనిస్తున్నారు పరమేశ్వరం మాస్టారు.
ఆయన ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నలభై ఏళ్ల పాటు వందలాది మంది విద్యార్థులకు అక్షరాలు దిద్దించారు.
ఫోన్ తీసి చూస్తే సోషల్ మీడియాలో హ్యాపీ టీచర్స్ డే స్టేటస్‌లు, మెసేజ్‌ల వరద కనిపిస్తోంది.
పరమేశ్వరం మాస్టారి మనసులో ఒక చిన్న ఆలోచన మెదిలింది.
“ఈ రోజుల్లో ఉపాధ్యాయ దినోత్సవం అంటే ఒక రోజు శుభాకాంక్షలు చెప్పుకోవడం, పూల గుత్తులు ఇవ్వడం, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికే పరిమితమైపోతోందా? నిత్యజీవితంలో గురువు నేర్పిన విలువలను ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు?”అని అనుకున్నారు.
అంతలో ఒక పెద్ద కారు వచ్చి ఆయన ఇంటి ముందు ఆగింది. అందులోంచి సురేష్ అనే ముప్పై ఏళ్ల యువకుడు దిగాడు. అతన్ని చూడగానే… మాస్టారి ముఖంలో చిరునవ్వు వికసించింది.
సురేష్ ఒకప్పుడు పరమేశ్వరం మాస్టారి దగ్గర చదువుకున్న విద్యార్థి. పదో తరగతిలో ఉన్నప్పుడు సురేష్ తండ్రి దివంగతుడవ్వడంతో, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాలని అనుకున్నాడు.
కానీ , మాస్టారు సురేష్ పరిస్థితి గ్రహించి, తన సొంత డబ్బులతో… ఫీజులు కట్టి, రాత్రివేళల్లో ప్రత్యేకంగా చదువు చెప్పి ప్రోత్సహించారు. ఈరోజు సురేష్ ఒక ప్రముఖ నగరంలో ఐటీ కంపెనీ యజమానిగా స్థిరపడ్డాడు.
సురేష్ కారు దిగి నేరుగా వచ్చి పరమేశ్వరం మాస్టారి కాళ్లకు నమస్కరించి ,
“శుభోదయం మాస్టారూ! ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు” అని పలికాడు.
“రా సురేష్! ఎలా ఉన్నావు? ఈ రోజు బిజీగా ఉంటావనుకున్నాను, ప్రత్యేకంగా వచ్చావేంటి?” అన్నారు మాస్టారు ఆప్యాయంగా.
సురేష్ తన జేబులోంచి ఒక పత్రం తీసి మాస్టారి చేతిలో పెట్టాడు.
“ఏమిటిది సురేష్? ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఏదో బహుమతి తెచ్చావా? నాకు ఇవన్నీ వద్దని తెలుసు కదా!” అన్నారు మాస్టారు.
సురేష్ నవ్వి ,
“లేదండి మాస్టారూ! ఇది పూల గుత్తో, పెన్నుల సెట్టో కాదు. మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం పరమేశ్వరం విద్యా ట్రస్ట్ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేశాను. ప్రతి సంవత్సరం పదో తరగతిలో ప్రతిభ చూపించే పేద పిల్లల ఉన్నత చదువులకు అయ్యే ఖర్చంతా ఈ ట్రస్ట్ భరిస్తుంది. ఈరోజే దీనికి సంబంధించిన పత్రాలు సిద్ధమయ్యాయి” అని చెప్పాడు.
మాస్టారు ఆశ్చర్యంగా సురేష్ వైపు చూశారు.
సురేష్ కొనసాగిస్తూ…
“మాస్టారూ! మీరు నాకు పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే చెప్పలేదు. సమాజంలో మనకంటూ ఒక స్థాయి వచ్చినప్పుడు, వెనుకబడిన నలుగురికి చేయూతనివ్వడమే నిజమైన జీవితం అని నేర్పారు. నా కంపెనీలో కూడా ఏ ఒక్క ఉద్యోగి ఇబ్బందిలో ఉన్నా, మీలాగే ముందుండి ఆదుకోవడానికి ప్రయత్నిస్తాను?
మీరు నేర్పిన నిజాయితీ, క్రమశిక్షణే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఒక రోజు స్టేటస్ పెట్టడం కన్నా, మీరు నేర్పిన విలువలను నా నిత్యజీవితంలో పాటించడమే నేను మీకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ అని నమ్మాను” అని వినయంగా చెప్పాడు.
సురేష్ మాటలు విన్న పరమేశ్వరం మాస్టారి కళ్ళు ఆనందభాష్పాలతో… నిండాయి. సురేష్ భుజం తట్టి,
“ఒక ఉపాధ్యాయుడికి అంతకంటే గొప్ప బహుమతి ఏముంటుందిరా! నా జీవితం ధన్యమైంది” అన్నారు.
నిత్యజీవితంలో మన ఉపాధ్యాయులు నేర్పిన నైతిక విలువలను పాటిస్తూ, సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా జీవించడమే మనం మన గురువులకు ఇచ్చే అత్యుత్తమ గౌరవం.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *