గుర్తులు
అతను గబగబా వచ్చి పక్కనే పడున్న సైకిల్ నీ తీసి చూస్తున్నాడు. అది ఎందుకు పనికి రాని సైకిల్. అందుకే ఎవరో దాన్ని రోడ్డు పక్కన పారేసి వెళ్లారు. అది చూసిన రాము వెంటనే వెళ్ళి దాన్ని బయటకు తెచ్చాడు చెత్త లోంచి. దాన్ని పరిశీలనగా చూస్తూ ఎక్కడెక్కడ ఏమేమి పోయాయో బాగా గమనించాడు. తర్వాత లోపలికి వెళ్ళి దానికి కావాల్సిన సరంజమా మొత్తం తెచ్చి తిరిగి సైకిల్ ముందు కూర్చున్నాడు.దాన్ని బాగు చేయడానికి సిద్ద పడ్డాడు.
రాము ఒక అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతనికి ఒక్కగానోక్క కొడుకు రాహుల్ కి సైకిల్ కావాలని మారం చేయబట్టి నెలరోజులు అవుతుంది. కానీ రాము కి ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోవడం వలన కొత్త సైకిల్ కొనిచ్చే శక్తి లేదు కాబట్టే అతని కళ్ళలో ఈ పాత సైకిల్ కనిపించడం తో దాన్ని బాగుచేయడానికి పూనుకున్నాడు.
అలా రాము కొన్ని గంటలు పని చేస్తూ ఆ సైకిల్ నీ ఒక రూపుకి తీసుకోచ్చాడు. కాసేపు అయ్యాక తన గదిలో ఉన్న పాత రంగుల డబ్బాలు తెచ్చి, సైకిల్ కి రంగులు అద్ది కొత్తగా తయారు చేసి ముద్దుగా ఉన్న దాన్ని తిరిగి తిరిగి చూస్తూ తన కొడుకు రాగానే ఆ సైకిల్ చూపిస్తే ఎంత సంతోషిస్తాడో అనుకుంటూ తిరిగి తన డ్యూటీ కి వెళ్ళాడు.
రాహుల్ బడి నుండి వచ్చే సమయం కావడం వలన రాము ఎదురుచూస్తూ ఉన్నాడు. రాహుల్ రానే వచ్చాడు. నాన్న అంటూ బడి నుండి పరుగెత్తి ఊరుక్కుంటూ వచ్చి తండ్రినీ హత్తుకున్నాడు.పుట్టగానే తల్లి చనిపోవడం వలన రాహుల్ నీ తల్లి లేని లోటని తెలియకుండా పెంచుతున్నాడు రాము.
రాహుల్ వెళ్ళి స్నానం చేసి రా నీకు ఒక మంచి బహుమతి తయారు చేసాను అన్నాడు రాము. ఏంటి నాన్న బహుమతి అంటున్నావు నాకేనా కొత్తదా అన్నాడు రాహుల్.అవును నాన్న నీకే ముందు వెళ్ళి స్నానం చేసి రా అన్నాడు ముద్దు పెడుతూ.. అలాగే అంటూ రాహుల్ వెళ్ళి స్నానం చేసి మాములు బట్టలు వేసుకుని తిరిగి తండ్రి దగ్గరగా వచ్చి నాన్న ఏంటి నాన్న నాకేదో బహుమతి అన్నావ్ ఏంటో చెప్పవా అనగానే ఇలా రా అంటూ రాహుల్ నీ తీసుకోని తాను తయారు చేసిన సైకిల్ వద్దకు వెళ్ళి దానిపై కప్పిన ఎర్రటి దుప్పటి తీసాడు ఆ సైకిల్ చూసిన రాహుల్ కళ్ళు మెరిసాయి. అబ్బా ఎంత బాగుందో నాన్న నా కోసమేనా నాకు తెచ్చావా కొత్త సైకిల్ అంటూ దానిని పట్టుకుని పైకి ఎక్కి తొక్కదం మొదలు పెట్టాడు రాహుల్.
రాహుల్ ఉత్సాహం, కళ్ళలో కలిగిన మెరుపు చూసిన రాము చాలా సంతోషించాడు. తాను కొనకపోయినా ఎవరో పారేసిన సైకిల్ తో తన కొడుక్కి సంతోషం, తన కోరిక తీర్చడం వలన తాను చాలా సంతృప్తి చెందాడు రాము.
**
నాన్న.. నాన్న… అంటూ పిలుస్తున్న అవని పిలుపుకి ఉలిక్కి పడి ఆలోచనలోంచి బయటకు వచ్చాడు రాహుల్…
తన మనవడు మురిపెంగా చూస్తున్న సైకిల్ చూసి ఆలోచనలోకి జారిపోయిన రాహుల్ తిరిగి వర్తమానం లోకి వచ్చాడు ఇదిగో నాన్న కాఫీ తీసుకోండి అంటూ తానూ పక్కనే కూర్చొని ఏంటి నాన్న మళ్ళీ తాతయ్య ఆలోచనలోకి వెళ్ళావా అంటూ అడిగింది తండ్రినీ అవునంటూ తల ఉపాడు రాహుల్.. నిజంగా తాతయ్య ఎంత గొప్పవాడో కదా నాన్న తన చిన్న ఉద్యోగం తో నిన్ను బాగా చదివించి ఒక గొప్ప స్థాయిలో ఉండేలా చేయడం అంటే మామూలు విషయం కాదు నాన్న. మా తరం వారికీ ఎంత సంపాదించిన అవి కొన్ని అవసరాలు మాత్రమే తీరుస్తున్నాయి… అంటూ నిట్టూర్చింది అవని…
అవును అవని నాన్న జ్ఞాపకాలు నాకు ఇప్పుడు తీపి గుర్తులుగా ఉండిపోయాయి. నీ కొడుకు వలన ఈరోజు మళ్ళీ ఒకసారి నా తండ్రిని గుర్తుకు తెచ్చాయి తల్లి కాలం మారినా వారీ గుర్తులు మారవు. సంపాదన గురించి కాకుండా ఇదిగో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే మనకు రేపు గుర్తు గా , జ్ఞాపకం గా ఉంటాయి. ముందు వాటిని సంపాదించుకో తల్లి, ఈ క్షణాన్ని ఆస్వాదించు, తీరని కోరికలను పక్కన పెట్టు. అదిగో చూడు నీ కొడుకు సంతోషం అది ఇప్పుడు చిన్న విషయం కావచ్చు, కానీ రానున్న రోజుల్లో ఇలాంటి చిన్న విషయాలే మనకు మన మనస్సులో ఆనందాన్ని నింపుతాయి అనగానే నిజమే నాన్న నేను ఆ విషయం ఇప్పుడే నీలో చూస్తున్నాను అంటూ తన చేతిలోని ఫోన్ తో తన కొడుకు సైకిల్ తొక్కుతున్న క్షణాలను కెమెరా లో బంధించింది అవని.
మనుషులు కాలంతో పాటు కనుమరుగు అవ్వొచ్చు కానీ వారీ గుర్తులు ఎప్పటికి మన మనస్సులో చెరిగిపోకుండా ఉంటాయి.
కే. శారదా దేవి