చిన్న నవ్వే
ఆ ఊరి పేరు ఆనంద నిలయం. ఒకప్పుడు ఆ ఊరిలో ప్రతి ఇల్లూ నవ్వులతో... పలకరింపులతో... కళకళలాడుతూ ఉండేది. కానీ కాలం మారింది. చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి, మనసుల్లోకి స్వార్థం చేరింది. ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి గదిలో వాళ్లే కాలం గడపడం, పక్కవారి కష్టసుఖాలను పట్టించుకోకపోవడం ఎక్కువైపోయింది?
బంధాలన్నీ సోషల్ మీడియా లైక్‌లకు, పండగ రోజు వాట్సాప్ మెసేజ్‌లకు మాత్రమే పరిమితమైపోయి, క్రమంగా కనుమరుగవుతున్నాయి.
అదే ఊరిలో శ్రీనివాసరావు, లక్ష్మి అనే వృద్ధ దంపతులు ఉండేవారు. వారి పిల్లలు ఉద్యోగాల రీత్యా సిటీలో స్థిరపడ్డారు.
మొదట్లో ప్రతి వారం ఫోన్ చేసే పిల్లలు, ఇప్పుడు బిజీ లైఫ్ నెపంతో నెలకోసారి కూడా మాట్లాడటం లేదు. ఇంట్లో ఎటు చూసినా నిశ్శబ్దం, దూరం పెంచిన ఆవేదన?
ఒకరోజు లక్ష్మి ఇంటి పైకప్పు విరిగిపోతుంటే… చూసి బాధగా ,
“చూశారా! ఇల్లు ఎలా పాడైపోతుందో? మీకు వంద సార్లు చెప్పాను మా ఇల్లు బాగుచేయండి” అని. గోడల మధ్య దూరం పెరిగిపోతోంది, బంధాల మధ్య కూడా అంతే!” అని నిట్టూర్చింది.
శ్రీనివాసరావు ఆ మాటలకు తీవ్రంగా ఆలోచించాడు. ఆయన వీధిలోకి వచ్చి చూస్తే… ఊరంతా ఇదే పరిస్థితి. అన్నదమ్ముల మధ్య మాటలు లేవు, భార్యాభర్తల మధ్య పట్టింపులు, స్నేహితుల మధ్య దూరం.
“ఈ పరిస్థితికి పరిష్కారం మన చేతిలోనే ఉందా?” అని ఆయన మనసు ప్రశ్నించింది.
వెంటనే శ్రీనివాసరావు ఒక ఉపాయం ఆలోచించాడు. ఊరి మధ్యలో ఉన్న పాత మర్రిచెట్టు కింద ఒక పెద్ద అందమైన ఉయ్యాలను కట్టించాడు. చుట్టూ పచ్చని మొక్కలు నాటాడు. ఆ ప్రదేశాన్ని బంధాల తోట అని పిలిచారు.
ఆయన ఊరి వారందరికీ ఒక నియమం పెట్టాడు ,
“ప్రతి రోజు సాయంత్రం ఎవరైనా సరే, తమ కుటుంబ సభ్యులతోనో లేదా స్నేహితులతోనో వచ్చి ఆ ఉయ్యాల పై కాసేపు కూర్చోవాలి? కానీ , ఒకే ఒక కండిషన్ , అక్కడ కూర్చున్నప్పుడు చేతిలో ఫోన్లు ఉండకూడదు, మనసు విప్పి మాట్లాడుకోవాలి.”
మొదట ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు?
కానీ , ఒకరోజు ఒక భార్యాభర్తలు గొడవపడి, శ్రీనివాసరావు మాట కాదనలేక ఆ ఉయ్యాల పై కూర్చున్నారు. పైన నిండు చందమామ వెలుగుతోంది. చల్లని గాలి వీస్తోంది. ఫోన్లు పక్కన పెట్టి, ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా దాచుకున్న మనసులోని బాధలను, పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. చర్చలు జరిగాయి, ఆత్మీయతను పంచుకోవడం మొదలైంది. ఒకరి తప్పులను ఒకరు క్షమించుకున్నారు. వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయి, ముఖాల్లో ఒక చిన్న నవ్వు మొలిచింది. ఆ చిన్న నవ్వే వారి బంధానికి పెద్ద పరిష్కారమైంది.
ఆ రోజు నుండి ఆ ఉయ్యాల ఒక అద్భుత కేంద్రంగా మారింది.
దూరం అయిన చోట , ఈ కలయిక ఒక సరికొత్త పరిష్కారం చూపించింది. ప్రతిరోజూ ఊరి జనాలు అక్కడ కూర్చుని పాత జ్ఞాపకాలను, మమకారాలను ముచ్చటించుకోవడం ప్రారంభించారు.
ఫలితంగా మనస్పర్ధలు పోయి, మనుషుల మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
కొన్ని రోజులకు శ్రీనివాసరావు కొడుకులు కూడా ఊరికి వచ్చారు. తండ్రితో కలిసి ఆ ఉయ్యాల పై కూర్చుని, తాము చేసిన తప్పును తెలుసుకున్నారు.
“సారీ నాన్న! లగ్జరీ లైఫ్ వెనకాల పడి మీ ప్రేమను మర్చిపోయాం” అని తండ్రిని హత్తుకున్నారు. కనుమరుగవుతున్న ఆ కుటుంబ బంధం మళ్లీ చిగురించింది.
మాధవి కాళ్ల