జ్ఞాపకాల నీడలో.. స్వగతం

జ్ఞాపకాల నీడలో… స్వగతం

 

జ్ఞాపకాలను పదిల పరుచుకునేది మెదడు అని నా మొద్దు మొహానికి ఎదో తెలుసు కానీ నాకేంటి అట్టడుగు పొరల్లోంచి నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు రావడం,ఆసుపత్రిలో ఉన్న వారికి,అందులోనూ ఇప్పుడో,ఇంకాసేపట్లలోనో చావబోతున్నా నాకు భర్త,పిల్లలు,వారి పిల్లలు,ఇల్లు బాధ్యతలు గుర్తుకు రావాలి కానీ ఇదేంటి నాకు నా చిన్నతనం గుర్తుకు వస్తుంది.

అదిగో నేను మారం చేసేయడం తో మా నాన్నారు నా కోసం మామిడి చెట్టుకు కట్టిన ఊయల అందులోనూ నాకు సౌకర్యంగా ఉండేలా గొనె సంచితో మధ్యలో కూర్చునేలా చెయ్యడం దాంట్లోనే నేను పొద్దస్తమానం ఊగుతూ,దాంట్లోనే అమ్మ కలిపి పెట్టె గోరుముద్దలు తింటూ అందంగా ఉన్న నా బాల్యం,నన్ను మా నాన్నగారు భుజాల పైన ఎక్కించుకుని పొలానికి తీసుకుని వెళ్తుంటే దోవలో ఉన్న వాళ్ళు నవ్వుతూ చూస్తుంటే నాకు యువరాణి నేనేనా అనిపించేది.

పొలం లోకి వెళ్లి అడుకుంటాను అని మారం చేస్తే నా చిన్ని తెల్లని పాదాలు కంది పోతాయంటూ నాన్న బుజ్జగింపులు,నా మారం తో నాన్న వీపు మీద ఎక్కితే నాన్న పొలంలోకి దిగి నాట్లు వేస్తుంటే నాకు అది ఒక ఆటలాగా అనిపించడం,మధ్యాహ్నం అందరూ సద్దులు విప్పి తింటుంటే నేను వారి దగ్గరికి వెళ్లి వారి సత్తు డబ్బాలోని అన్నాన్ని తీసుకుని తింటుంటే వాళ్ళ కంగారు చూసి నేను నవ్వుతూ ఉండడం,నిజంగా ఇంట్లో అమ్మ చేసిన వంట రుచిగా ఉండదు కానీ వారి సత్తు డబ్బాలో అన్నం మాత్రం మహా రుచిగా ఉండేది ఎందుకో మరి కొన్ని రోజులు అయ్యాక బడిలో వేశారు నాన్నగారు..,

బడిలోకి వెళ్లిన మొదటి రోజు పoతులుగారికి,నా తరగతి గదిలోని పిల్లలకు అందరికి పప్పు బెల్లం,దక్షిణ ఇప్పించారు,ఆ రోజు కోసం నాకు పట్టు లంగా జాకెట్ కూడా కుట్టించారు,ఎంతో ఆనందంగా బడికి వెళ్లిన నాకు పొద్దంత అక్కడే కదలకుండా కూర్చోవాలి అంటే విసుగేసి,అందరూ అన్నలు తినే టైం లో అయ్యవరి కళ్ళు కప్పి ఇంటికి వచ్చేసా,అది చూసి అమ్మ నన్ను మళ్ళీ పంపించి రండి అంది నాన్నగారి తో ,దానికి నాన్నగారు పోనిలేవే అనడం,నేను గర్వంగా నాన్న నా పార్టీ అమ్మ నీతో కచ్చి అని అనడం అంతా ఇప్పుడు గుర్తొస్తుంది.

అసలు మా అమ్మ నన్ను చదివించాలని,నన్నొక డాక్టర్ లా చూడాలని అనుకుంది.కని నేను మాత్రం చదువు కో నూ అంటూ మారం చేసేదాన్ని, బడికి కూడా వెళ్ళాక పోయేదాన్ని, కానీ ఒక రోజు మా అమ్మ నన్ను కూర్చో బెట్టుకుని ఒక అల్బం చూపిస్తూ,ఇదిగో ఇక్కడ చూడు ఇది మీ డాక్టర్ మామయ్య,ఇదిగో ఇవిడ డాక్టర్ అత్త య్య,అని ఒక్కొక్కరి గురించి చెప్తూ,వారు నాకు ఏమవుతారో అని పరిచయం చేసింది,అయితే అందులో ఉన్న వారు ఎవరు నాకు తెలియదు, నేనెప్పుడూ వారిని చూసింది గుర్తు లేదు కూడా అదే అడిగాను అమ్మను దానికి అమ్మ నా తల నిమురుతూ పెళ్లి కానంత వరకే వారి బంధాలు అనుబంధాలు ఒకసారి పెళ్లి అయితే వారిని వారి జ్ఞాపకాలను వదిలేసి మనం మన ఇల్లు అనబడే కొత్త చోటు కి వెళ్ళాలి నువ్వు కూడా మీ మామలా డాక్టర్ కావాలనే నా కోరికను తీరుస్తారు కదా అని అంది అమ్మ. నేను నా ఆల్చిప్ప లాంటి పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అలాగే అని అన్నాను..

ఇక అప్పటి నుండి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పవచ్చు ఒక్కతే కూతురు కావడం మా పెద్దమ్మ చిన్నమ్మ వాళ్ళు కూడా ఆడపిల్లలు లేకపోవడం తో ఇంట్లో అంతా నన్ను గారాబంగా చూస్తారు నేను ఏది కావాలంటే దాన్ని క్షణాల్లో తెచ్చిపెట్టడం నాకు గుర్తున్న జ్ఞాపకాల తోటలో దొంగతనంగా మామిడి కాయలు కోయడం అది తెలిసి కూడా ఎవరూ ఏమీ అనకపోవడం సీమచింతకాయ లో ఉప్పు వేసుకుని తినడం లంగాలు గోచిలా కట్టుకొని కాలువలో ఈత కొట్టడం,ఈత రాని చిన్న పిల్లలకు నేర్పించడం ఇవన్నీ చూస్తున్న పెద్దవారు మాకు తెలియకుండా మా రక్షణ కోసం మా వెనకే ఉండడం అని మాకు తెలిసినా తెలియనట్లు మేము ఉండడం మేము చేస్తే,మేమంతా ఈతకొట్టి అలసిపోయి ఆకలితో ఉంటామని మాకు కనిపించేలా పెట్టడం చేసేవారు మా కోసం వెతుకుతున్నట్లు వచ్చి మీరు ఎక్కడున్నారు అని ఆశ్చర్యంగా అడిగేవారు..

మా సంతోషం కోసం వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు ఆ కాలంలో చాలా బాగా ఉండేవి మా స్నేహితురాలు ఒకరు ఒక రోజు బడికి పచ్చని పట్టు లంగా కట్టుకొని వచ్చిన రోజు అది చేసి నేను నాకలాంటిది కావాలన్న రోజు మా నాన్న నన్ను ఓదార్చడానికి పడిన పాట్లు గుర్తొచ్చి నాకు నవ్వు వస్తుంది.కానీ ఆక్సిజన్ మాస్క్ ఉందిగా నవ్వలేను తర్వాత బతుకమ్మ పండక్కి దాని తాత లాంటి పట్టు లంగా జాకెట్ ఎలాంటిది అంటారా,ఆకుపచ్చని పట్టు లంగా కు రాణి కలర్ బార్డర్ అలాంటిదే జాకెట్ నేను వేసుకుంటే ఆ రోజు నాకు తీసిన దిష్టి, పొయ్యిలో వేస్తే వచ్చిన ఎండుమిరపకాయలు ఘాటు చెప్పింది..

ఆ తరువాత తెల్లారి నాకు విపరీతమైన జ్వరం అందులోనే నేను పెద్దమనిషి కావడం నిజంగా నా అదృష్ట మో దురదృష్టమో మా నాన్నగారు ఈత చెట్టు మీది నుంచి పడడం అందరూ నన్ను దురదృష్టవంతురాలు అని అనడం,మా నాన్న మంచానికి పరిమితం కావడం నా డాక్టర్ చదువు అటక ఎక్కడం,మామయ్యాలు ఆదు కోవడం చివరికి వారి అండదండలతో నాకు ఏదో సంబంధం చూడడం అది అమ్మ కోరుకుంటున్నట్లుగా డాక్టర్ సంబంధం కావడం అమ్మ డాక్టర్ కాలేకపోయినా కనీసం పెళ్లి చేసుకో అని కోరడంతో వాళ్లు రావడం నేను నచ్చటం చేసుకోవడం..

నా నేస్తాల నుండి హితుల సన్నిహితుల నుండి వీడ్కోలు పిల్లలు నాన్న పోవడం ఇదిగో ఇప్పుడు ఇలా అన్ని అయిపోయి జీవిత చరమాంకంలో ఉన్న నేను నా జ్ఞాపకాల నీడలలో తలుచుకోవడం లో పెద్ద వింతేమీ లేదు కానీ నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే గొప్ప వింత నాకు ఏ రామ జపమో చేసుకోకుండా అదిగో రాముడు అనగానే వచ్చేసాడు నా రాముడు నన్ను పిలుస్తున్నాడు రా రమ్మని వెళ్తున్నా నేను వెళ్తున్నా …

 

Related Posts