తనదాకా వస్తే

అయ్యో ప్రశాంతి భర్తని వదిలేసింది అంట నీకు తెలుసా అక్కా అంటూ మాధవి లతకు ఫోన్ లో చెప్పింది. అవునా ఎందుకె పాపం బాగా చూసుకుంటాడు కదా, ఒక్కడే కొడుకు మంచి వాళ్ళే కదా మరెందుకు వదిలేసింది అంట అంటూ ఆరా తీసింది లత చెల్లి మాధవితో, హ ఏముంది జీతం అంతా తెచ్చి తనకి ఇమ్మని అందంట, అతను ఇవ్వను అని ఉంటాడు. లేదా ఆస్థి రాసిమ్మని అందో వాడు దీనికి ఎందుకు ఇస్తాడు, దాంతో ఇది వాడిని వదిలేసి అక్కా దగ్గరికి వచ్చిందంట అని తనకు తెలిసిన దానికి ఇంకొంచం మసాలా కలిపి లత చెవిలో వేసింది మాధవి.

అయినా దినికేం పోయే కాలమే మొగుడిని వదిలేసి ఏమి చేద్దామని, అయినా అక్కకు బుద్ది లేదు, బిడ్డకు సర్ది చెప్పుకోవాలి కానీ ఇలా వదిలేస్తే ఊరుకుంటారా అని ప్రశాంతి మిధ, అక్క పైన లేనిపోనీ చాడీలని ఓ గంట సేపు చెప్పుకున్న తర్వాత ఇంకా ఉంటాను అంటూ ఫోన్ లు పెట్టేసారు ఇద్దరూ…

వీళ్ళు ఇంతగా మాట్లాడుకున్న ఆ ప్రశాంతి ఎవరో కాదు వాళ్ళ స్వంత అక్క కూతురు, పాపం ఆమెకు చిన్నతనం లోనే బావతో పెళ్లి చేసారు తల్లిదండ్రులు. కానీ, పెళ్లి అయ్యాక కొన్ని రోజులు బాగానే ఉన్న అతను, తన నిజ రూపాన్ని చూపించడం మొదలు పెట్టాడు. చాలా రోజులు భరించిన తర్వాత ప్రశాంతి ఇక ఆ బాధ లు భరించలేక, అతన్ని వదిలేసి పుట్టింటికి చేరడoతో అక్క కూతురు గురించి ఇలా గంటల కొద్ది మాట్లాడుకునే విలు కలిగింది వారికీ, అదొక కాలక్షేపంలా మారింది..

కొన్ని రోజులు గడిచాయి. ప్రశాంతి బావతోని విడాకులు తీసుకుని, చదువును కంటిన్యూ చేసి, మంచి ఉద్యోగాన్ని తెచ్చుకుంది. అది చూసి అక్కా, చెలెల్లు ప్రశాంతి దగ్గరకు వచ్చి సానుభూతి మాటలు మాట్లాడుతూ, జాలి చూపించినట్టు నటించే వారు. ప్రశాంతికి అవ్వన్నీ తెలియక పోవు కానీ చూద్దాంలే అన్నట్టుగా ఉండేది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. లత కూతురికి సంబంధం కుదిరింది అని తెలిసి అంతా పెళ్ళికి వెళ్ళారు.

చాలా బాగా ఖర్చు పెట్టి పెళ్లి చేసారు పిన్ని వాళ్ళు ఎంతో ఆడంబరంగా, తమ కూతురు అత్తగారి గురించి, వారి అలవాట్ల గురించి గొప్పగా చెప్పింది లత అక్కకి, అక్క కుతురుతోనూ అవ్వన్నీ వింటూ తమని అవమానిస్తుందని తెలిసినా కూడా ఏమి అనలేక అక్కడ నుండి వెళ్ళి పోయారు మౌనంగా ప్రశాంతి వాళ్ళు..

రెండు సంవత్సరాలు గడిచాయి. లత కూతురు అత్తగారు వాళ్ళకు ఊరంతా అప్పులే ఉన్నాయి అంట, కూతురు భర్త కూడా ఏమి చదువుకోలేదు అంట, అతను చెప్పిన ఉద్యోగం, అతని ఆస్తులు అన్ని అబద్దాలు అని తెలిసి లతకి గుండె నొప్పి వచ్చినంత పని అయ్యింది అంట.

అవన్నీ చూసి కూతురు తనతో నేను ఉండలేను అని అతన్ని వదిలేసి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చింది. కూతురు కాపురం పాడవ్వడం చుసిన వాళ్ళు ఏమి చేయాలో తెలియక, కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అని తెలిసింది మాధవికి. విషయాన్ని తన అక్కకు చెప్పాలని మాధవి ఫోన్ చేసింది.

అక్కా ఇది విన్నావా లతక్క బిడ్డ భర్తని వదిలేసి వచ్చి ఇంట్లో కూర్చుంది అంట, ఏం మనుషులో ఏమో అంత ఖర్చు పెట్టి పెళ్లి అంత గ్రాండుగా చేసారు. పైగా ఆ పెళ్ళిలో వాళ్ళు ఇలా, వీళ్ళు అలా అని అంటూ వాళ్ళ గొప్పలు చెప్పి,నిన్ను ప్రశాంతిని అవమానించారు. ఓ పెద్ద వాళ్ళే మనుషులు అయినట్టు, వాళ్ళే గోప్ప అన్నట్టుగా చూసింది. వాళ్ళకు ఇంతా ఆస్థి ఉంది అని అంది. ఇప్పుడేమయ్యింది అంతా పోయింది అందుకే అంతా ఎగిరెగిరి పడకూడదు.

అయినా పెళ్లి అయ్యాక ఎదో కూతురికి సర్ది చెప్పుకోక దీనికి బుద్ది లేదు అసలు నిజంగా నాకంటే పెద్దదే కానీ దానికసలు బుద్ది లేదు, కూతురికి సర్ది చెప్పుకుని సంసారం చేయ్యిమని పంపాలి కానీ ఇలా ఇంట్లో పెట్టుకుంటారా అంది మాధవి ఫోన్ లో…..

ప్రశాంతి ఫోన్ స్పీకర్ లోంచి వినపడుతున్న మాటలు వింటూ తనేప్పుడో, తనేక్కడో అన్న మాటలుగా వినిపించి తల దించుకుంది లత కళ్ళలో నిళ్ళు జల జలా రాలాయి. తాను తన అక్కను, అక్క కూతుర్ని ఎన్ని రకాలుగా బాధ పెట్టిందో గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడవ సాగింది లత…

ప్రశాంతి ఫోన్ లో పిన్ని లత పిన్ని ఇక్కడే ఉంది. నిన్ననే వచ్చింది మాట్లాడుతావా అంది మాధవితో, ఆ వెంటనే  ఫోన్ కట్ అయ్యింది… తనదాకా వస్తే కానీ తెలియదు అని ఉరికే అనలేదు పెద్దలు, ఒకర్ని నువ్వు నిందిస్తే నిన్ను ఆ దేవుడు చూస్తాడు అనే సత్యం ఇంకోసారి ఋజువు అయ్యింది…….

Related Posts

1 Comment

Comments are closed.