తల్లి ప్రేమ

ఏంటి నేను విన్నది నిజమేనా లావణ్య” అంటూ  వచ్చింది అన్నపూర్ణ, “ఏం విన్నారు, ఏంటి మీరు మాట్లాడేది అంది నవ్వుతూ లావణ్య”. “హ నవ్వుతావు ఏం అడిగినా అలా నవ్వుతూనే ఉంటావు” ఎప్పుడూ నీలాంటి దాన్ని ఎందుకు  వదులుకున్నాడో ఆ మహానుభావుడు అంది అన్నపూర్ణ కుర్చీలో కూలబడుతూ”, ఆ మాట వినగానే లావణ్య మొహం లో నవ్వు మాయం అయ్యింది. గంభీరమైన మౌనంగా ఉంది.

అది చూసిన అన్నపూర్ణ “అయ్యో అనవసరంగా నేను ఆ విషయం తెచ్చి నీ మనసు పాడు చేసానా” అని భాద పడింది అన్నపూర్ణ, “హ అదేం లేదులే అత్తయ్యా నాకు ఇవ్వన్నీ మామూలుగానే అనిపిస్తాయి. ఇన్ని రోజులూ అన్ని అనుభవించి, అనుభవించి, ఇప్పుడు ఏడుద్దామన్నా నా కంట్లో కన్నీళ్లు మిగల లేదు” అంది లావణ్య.

అవును లావణ్య దాదాపు 21 ఒక్క ఏళ్ల తర్వాత  ఇప్పుడు నా కొడుకు నాకు కావాలి అంటే అర్థం ఏమిటి అంట, ఇన్ని రోజులు నిన్ను, నీ కొడుకుని  గాలికి వదిలేసి, తన సుఖాన్ని తాను చూసుకున్న మనిషి, ఇప్పుడు హఠాత్తుగా ఊడి పడి నా కొడుకుని ఇమ్మని అంటే నీకు ఎలా ఉందొ కానీ నాకు మాత్రం  ప్రాణం పోతుంది అనుకో, అంది అన్నపూర్ణ.

“అవును అత్తయ్యా నాకు అలాగే అనిపిస్తుంది, కానీ చూద్దాం ఏమి జరుగుతుందో, అన్నది లావణ్య అన్నపూర్ణ తో, సరే ఈ సంగతి తెలిసాక నువ్వు ఎలా ఉన్నవో, ఎంటో చూద్దామని వచ్చాను, నువ్వు ధైర్యంగా ఉండు, నీకు అండగా మేమున్నాం అని మర్చిపోకు, అని అంటూ మరి నేను మళ్ళీ వస్తాను అని అంటూ బయటకు నడిచి, తలుపు దగ్గర ఆగి అన్నపూర్ణ “అలాగే అత్తయ్యా, మీరు తప్ప నాకు ఇంకెవరు ఉన్నారు, తప్పకుండా మీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు తప్పకుండా అడుగుతాను అంది లావణ్య.

హ ఏం అడుగుతావో ఏమిటో వాడు వదిలేసినప్పటి నుండి మేము చెప్తూనే ఉన్నాము, కానీ నువ్వు ఒక్కనాడు కూడా మమ్మల్ని ఏమి అడగకుండానే ఇన్నేళ్లు బతికావు, ” సరే నేనింక వస్తాను, మీ మామయ్య గారు వచ్చే సమయం అయ్యింది, “అని వెళ్ళిపోయింది అన్నపూర్ణ”.  

అన్నపూర్ణ వెళ్లిన వైపు చూస్తూ ఉండి పోయింది లావణ్య, అలా చూస్తున్న లావణ్యకు ఆ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు గుర్తొచ్చింది. తనను భర్త వదిలేసి, సంవత్సరం తల్లిగారింటిలో ఉన్న తర్వాత, ఇక అక్కడ ఉండలేక, చిన్న ఉద్యోగం ఒకటి చూసుకుని, ఆఫీసుకి దగ్గరలో తన కొడుకు తో ఇల్లు కోసం చూస్తున్నప్పుడు, భర్త వదిలేసిన తనకి ఎవరూ ఇల్లు ఇవ్వనప్పుడు, ఈ అన్నపూర్ణమ్మ వాళ్ళ ఇంట్లో ఒక రెండు గదుల పోర్షన్ ఖాళీగా ఉందని తెల్సి, తాను వచ్చి అడిగింది.

అన్నపూర్ణ గారిని మొదటి సారి చూడగానే తనకి ఆప్తురాలిగా అనిపించి, ఆమెని అత్తయ్యా అని పిలిచింది. పిలిచాకా ఆవిడ ఏమనుకుంటున్నారో అని భయంగా చూస్తున్న తనని, నవ్వుతూ చూసి, ఎమ్మా కోడలు పిల్లా అలాంటి పిలుపులు వినక ఎన్ని రోజులు అయ్యిందో అంటూ అత్తయ్యా, మామయ్య వాళ్ళులో కలిసిపోయారు, తన భాద అంతా విని, తామున్నమని ఏమి దిగులు పడొద్దు అని ఎన్నో విధాలుగా వాళ్ళు తనకి సహాయం చేశారు.

వాళ్ళు తనకి అండగా ఉన్నారనే ఎవరూ తనని ఏ విధంగానూ ఇబ్బందులు పెట్టలేదు. తన కొడుకును కూడా వాళ్ళ పిల్లలతో పాటుగా, ఆప్యాయంగా చూస్తుంది అన్నపూర్ణ. పిల్లాడు కూడా వాళ్ళు అంటే ప్రేమగానే ఉంటాడు.

అన్నపూర్ణ ఆలోచనలో ఉన్న లావణ్య దగ్గరగా వచ్చిన పవన్ “అమ్మా,అమ్మా అంటూ గట్టిగా పిలిచాడు. హ అంటూ ఈ లోకంలోకి వచ్చింది లావణ్య, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావ్, నిలబడే నిద్రపోతున్నవా అంటూ నవ్వుతూ అడిగాడు పవన్.ఏమి లేదు నాన్న, అవును నువ్వు వచ్చి ఎంతసేపు అయ్యింది, అంది లావణ్య కొడుకుని చూస్తూ, ” హ్మ్మ్ అమ్మా నువ్వు మరి కలలో కి జారిపోయినప్పుడే వచ్చిన  కానీ నాకు బాగా ఆకలి వేస్తుంది, వంట ఏం చేశావ్ అని అన్నాడు పవన్, “కొడుకు ఆకలి అని అనేసరికి లావణ్య కి పేగులు కదిలిపోయాయి.

అప్పుడు గుర్తొచ్చింది తాను అసలు వంట చేయలేదు అని, అదే విషయాన్ని అయ్యో పవన్ నేను వంట చేయలేదు నాన్న, ఈరోజుకి ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్లి, బిర్యానీ తెచ్చుకో, అలాగే ఇదిగో వీటితో కూల్డ్రింక్ తెచ్చుకో, ఇదిగో మొన్న ఎప్పుడో డ్రెస్ కావాలని అడిగావ్ కదా, దానికి కూడా డబ్బు తీసుకో, అని అంటూ, పర్స్ లో ఉన్న డబ్బు అంతా తీసి, పవన్ చేతిలో పెట్టింది లావణ్య. తల్లి మానసిక పరిస్థితి ని అంచనా వేస్తున్నట్టు గా ఆలోచనలో పడిన పవన్, ఆ డబ్బుని అలాగే తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. పవన్ వెళ్ళాక లావణ్య ట్రాన్స్ లోంచి బయటకు వచ్చి, గట్టిగా ఏడుస్తూ కింద కూలబడింది.

బయటకు వెళ్లిన పవన్ సరాసరి అన్నపూర్ణ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఇంట్లో జరిగిన విషయం అంతా చెప్పి, తన తల్లి ఈ రోజు ప్రవర్తించినట్టుగా ఎప్పుడూ లేదని, అలా ఎందుకో తనకి అర్థం కావడం లేదని వాడు ఏడుస్తూ అన్నపూర్ణ, దంపతులకు చెప్పాడు. అన్నపూర్ణమ్మ భర్త రాఘవులు గారు పవన్ ని దగ్గరకు పిలిచి, కూర్చోబెట్టుకుని, చూడు బాబు నీకు ఇన్ని రోజులుగా ఒక విషయాన్ని చెప్పలేదు.

ఇక ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. కాబట్టి చెప్తాను విన్న తర్వాత నీకు ఏది మంచిది అని అనిపిస్తే, అదే చెయ్యి, ఇందులో బలవంతం ఏమి లేదు అని అన్నాడు. సరే తాతయ్య చెప్పండి, మీరేమి చెప్పినా నా మంచికే అని నాకు తెలుసు, నేను అన్ని అర్థం చేసుకోగలను అని అన్నాడు పదిహేను ఏళ్ల పవన్..

చూడు పవన్ మీ అమ్మమ్మ వాళ్ళు మాములు మధ్యతరగతి కుటుంబం వారు. వారికి మీ అమ్మ నాలుగో సంతానం. అందరికి పెళ్ళి చేసినట్టుగానే మీ అమ్మకి మంచి సంబంధం అని పెళ్లి చేశారు. కానీ వాళ్ళ కాపురం మూణ్నాళ్ల ముచ్చటే అయ్యింది. కారణం అతనికి అంటే మీ నాన్నా గారికి ఎవరితోనో సంబంధం ఉండి, మీ అమ్మని నానా రకాలుగా హింసించే వాడు.

అది తెలుసుకునే సరికి మీ అమ్మా కడుపులో నువ్వు ఉన్నావు. మీ అమ్మమ్మ వాళ్ళు విషయం తెల్సి, మీ అమ్మని తీసుకొచ్చారు. ఆ తర్వాత అతను విడాకులకు వెళ్ళాడు. మీ అమ్మ ఏమి అనకుండా సంతకం చేసింది. భరణం కూడా ఏమి అడగలేదు. ఎందుకంటే మీ అమ్మకు ఆత్మాభిమానం చాలా ఎక్కువ, ఎవరి దగ్గర చేయిచాచడం మీ అమ్మ కి ఇష్టం ఉండదు. అందుకనే నువ్వు కడుపులో ఉన్నప్పుడు కూడా చిన్న ఉద్యోగం చేసి, ఎంతో కొంత సంపాదించుకునేది.

నువ్వు పుట్టిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర ఉండడం వారికి బరువు అని బయటకు వచ్చి, తనబతుకు తాను బతూకుతూ, నిన్ను కాపాడుకుంటూ, నీకు చదువు చెప్పిస్తూ, తన కోరికలు, ఆశలు అన్ని మర్చిపోయి, కేవలం నీ కోసమే బతుకుతున్నది తాను. కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నిన్ను కన్న తండ్రి మళ్ళీ నువ్వు తనకి కావాలని కోర్టులో కేస్ వేసాడు. అది విన్నప్పటి నుండి మీ అమ్మ అలా మారిపోయింది నాన్న.

ఎప్పుడూ మిమల్ని పట్టించుకోని మీ నాన్న, మీరెలా ఉన్నారో అని కూడా ఆలోచించని వాడు, మీ అమ్మకి విడాకులు ఇచ్చాక, తాను ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తన సుఖం తాను చూసుకున్న వాడు. ఇన్నేళ్లు నువ్వు ఎలా ఉన్నవో, ఏమి చదువుతున్నావో, ఏం తింటున్నావో కూడా తెలుసుకోలేని వాడు, ఇప్పుడు సడెన్ గా వచ్చి, నా కొడుకు నాకు కావాలి అంటే ఏ తల్లి మాత్రం అలా మారకుండా ఉంటుంది.

నీ తండ్రి నిన్ను ఎన్ని విధాలా ఏమార్చలని చూస్తాడో అని ఇన్ని రోజులు నీకు పెట్టని తిండి విషయంలో, బట్టల విషయం లో నిన్ను తన వైపు తిప్పుకుంటాడేమో అని మీ అమ్మా అలా చేసింది. ఇన్నేళ్లుగా నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకుంది. ఇప్పుడేవరో వచ్చి బిడ్డను ఇవ్వమంటే ఆ తల్లి ప్రాణం ఎంత కొట్టుకుంటుందో, ఎంత మానసిక వేదన అనుభవిస్తుందో పాపం, అని తనలో తాను అనుకుంటున్నట్టుగా, లావణ్య తల్లిదండ్రులు ఆమెకి మళ్ళీ పెళ్లి చేస్తాము అని అన్నా కూడా నీ కోసం ఆమె అన్ని మానుకుంది.

ఇప్పుడు ఇక నీ తండ్రి వచ్చి, నిన్ను కావాలని అంటే, తొమ్మిది నెలలు కడుపులో మోసి, నిన్ను కష్టపడి కని, ఆ తర్వాత నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకు బతికే మీ అమ్మ ని నువ్వే కాపాడుకుంటావో, లేక ఏం చేసినా నీ మీదనే ఆధారపడి ఉంది అని దీర్ఘoగా నిట్టూర్చాడు రాఘవులు గారు…..

తన తల్లి తన కోసం పడిన వేదన అప్పుడు అర్థం అయ్యింది పవన్ కు, కళ్ళలో నుండి కారుతున్న కన్నీళ్లని తుడుచుకుంటూ,” తాతయ్య నేను కనిపించకపోతే అమ్మా గాబరా పడుతుంది. వెళ్తాను అని గబగబా బయటకు వెళ్ళాడు. అతను వెళ్లిన  వైపు చూస్తూ, హు ఇద్దరి భవిష్యత్తు ఏమి కానుందో అని నిట్టూర్చారు అన్నపూర్ణమ్మ దంపతులు.

ఇంటికి వెళ్లిన పవన్ కు తల్లి మంచం మీద పడుకుని ఉండడం కనిపించింది. వంట గదిలోకి వెళ్లి చూసాడు. అక్కడ వండిన ఆనవాళ్లు ఏమి కనిపించలేదు. తల్లికి వినిపించకుండా పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాడు. ఇంట్లో ఉన్న కురగాయలల్లోoచి టమాటలు తీసి, అవి తరిగి కూర చేసాడు, ఒక పదిహేను నిమిషాల తర్వాత ప్లేట్ లో వేడి అన్నం, కూర పెట్టుకుని తల్లి వద్దకు వెళ్ళాడు పవన్, ఏడుస్తూ, అలాగే పడుకుందేమో కన్నీటి చారికలు కనిపించాయి.

చెంబులోని నీళ్ళు తీసి వాటిని తుడిస్తున్న తడికి లావణ్య కు మెలుకువ వచ్చి, కళ్ళు విప్పి చూసింది, ఎదురుగా కొడుకు తన కన్నీళ్లు తుడవడం చూసి, మళ్ళీ కళ్ళలో నీళ్లు తిరిగాయి. పవన్ కన్నీళ్లు తుడిచి, వద్దు అన్నట్లుగా తల ఊపుతూ, తల్లిని మెల్లిగా కూర్చోబెట్టాడు. ఆమె కూర్చున్న తర్వాత అన్నాన్ని కలిపి ముద్దాలుగా పెట్టాడు. కన్న తల్లిగా తనకి అన్నం తినిపిస్తున్న కొడుకుని మురిపెంగా చూస్తూ, పవన్ కి కూడా ముద్దలు పెట్టింది లావణ్య.

అలా ఇద్దరూ ముద్దలు తినిపించుకుంటూ, పాత ఆలోచనలోంచి బయటకు వచ్చారు. తిన్న తర్వాత పవన్ తల్లి ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాడు, వాడి తలని నిమురుతూ కూర్చున్న లావణ్య వాడి అమాయకమైన మొహం చూస్తూ, ఇప్పుడు వీడు నా దగ్గర పెరిగాడు కాబట్టీ మంచిగా ఉన్నాడు. వీడిని వారికి అప్పగిస్తే వాడిని రాక్షసుడు గా మారుస్తారు అనడంలో సందేహం లేదు. ఆ ఆలోచన రావడంతో లావణ్య ఒళ్ళు జలదరించింది. నో విడిని వారికి అప్పగించదు ఎంత కష్టం అయినా సరే వాడిని వాళ్లకు దూరంగా పెంచుతుంది అని గట్టిగా నిర్ణయించుకుంది లావణ్య…..

కోర్టుకు వెళ్లే రోజు రానే వచ్చింది. రోజు వేన వేల దేవుళ్ళకు మొక్కుకుని కొడుకుని తీసుకుని బయల్దేరిoది లావణ్య, త్రోవలో అన్నపూర్ణమ్మ ఇంటికి వెళ్లి దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరూ, నీకు అంతా మంచే జరుగుతుంది అని అన్నారు వాళ్ళు, తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళింది లావణ్య, తల్లి లావణ్య బతుకు అన్యాయం అయ్యిందనే బాధలో చూసావా నీ కష్టానికి ఫలితం, ఇన్ని రోజులు మోడు లా బతికినందుకు ఇప్పుడు వాడొచ్చి గద్దెలా తన్నుకు పోవాలని చూస్తున్నాడు.

ఇన్నాళ్లు దెయ్యం, భూతం కొట్టకుండా వాడిని కాపాడి, ఇప్పుడు చేతికి ఆందోచ్చిన వాడిని వాడికి అప్పగించడానికే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, అయినా చేసుకున్న వారికి చేసుకున్నంత మేము నిన్ను కన్నాము కానీ నీ రాతని కనలేదు అని అంది. తల్లి మాటలు వింటూ నిట్టూర్చి, వెళ్తున్నా అని కూడా చెప్పకుండా బయటకు నడిచింది లావణ్య ….

తన మాటలని లెక్కచేయకుండా వెళ్తున్న కూతుర్ని చూసి, ఏమి చేస్తాం అంటూ నిట్టూర్చింది తల్లి శారద. ఇద్దరూ లావణ్య, పవన్ ఇద్దరు కోర్టుకు వెళ్ళారు అక్కడ లావణ్య తన భర్తని చూసి ఆశ్చర్య పోయింది. కారణం అతను చాలా సన్నగా అయ్యాడు. అసలు గుర్తు పట్టకుండా రెడీ అయ్యాడు. అయినా ఆ మొఖంలో అహంకారం, మొగాడు అన్న పొగరు అన్ని అలాగే కొట్తోచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. అతను లావణ్యని ఆమె పక్కనే ఉన్న పవన్ ని చూడగానే అతని కళ్ళు తళుక్కున మేరిసాయి.

పవన్ ని చూసి దగ్గరికి రమ్మని సైగ చేసాడు. పవన్ తల్లి వైపు చూసాడు, తల్లి వెళ్ళ మన్నట్లుగా తల ఉపింది. పవన్ తండ్రి దగ్గరగా వెళ్ళాడు, నాన్న పవన్ బాగున్నావా, నిన్ను ఇన్ని రోజులు నాకు కాకుండా చేసిందిరా మీ అమ్మ. మీ అమ్మ దగ్గర ఉంటె ని సరదాలు, సంతోషాలు ఏమి పట్టించుకోదు, నువ్వు నా దగ్గరికి వస్తే నీకేం కావాలన్నా కొని పెడతాను, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను రా…

బాబు ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నవో అని అనుకున్నా, నాకు ఉన్న పని ఒతిడి వాళ్ళ నిన్ను కలుసుకోలేక పోయాను, ఇప్పుడు నాకు సమయం దొరికింది అందుకే ని కోసం వచ్చాను, పైగా మనకి ఉన్న వ్యాపారాన్ని చూసుకోవాలి.

నా వంశానికి నువ్వే వారసుడువి రా, నీ చెల్లెళ్ళ కి పెళ్ళిళ్ళు చేయాలి. మీ పిన్ని కూడా నిన్ను తీసుకు రమ్మనే చెప్పింది. నువ్వు పది పాస్ అవ్వగానే మాన వ్యాపారంలోకి వచ్చేస్తే మనం చాలా సంపదిస్తాము. కాబట్టి నువ్వు నాతో వచ్చెయ్యి…

మీ అమ్మ దగ్గర ఏమిఉంది రా? ఏమి లేదు నువ్వు పదో తరగతి పాస్ అవ్వగానే నిన్ను ఎదో ఒక జాబు లోనో ,లేదా ఏదైనా షాప్ లోనే పనికి పెడుతుంది. నీకు మంచి బట్టలు, మంచి తిండి, సినిమాలు, షికార్లు వంటివి ఏవి నీకు చూపించదు. అదే నువ్వు నాతో వస్తే అవన్నీ నీకు నేను కొనిపెడతాను అని అంటూ పవన్ మనసులో లేని పోనీ ఆశలు రేపడం మొదలు పెట్టాడు. అవన్నీ తనకి వినపడుతున్నా, లావణ్య ఏమి అనకుండా, మౌనంగా అన్ని వింటూ, తనలో తను భాధ పడసాగింది.

ఇప్పుడు వాడు ఇవన్ని విని నన్ను కాదని వేల్లిపోతాడేమో, అలా కాకుండా వారి నుండి తన కొడుకుని కాపాడుకోవాలి అని అనుకుంది, ఇంతలో కోర్టు బంట్రోతు వారిని పిలిచాడు. ఇద్దరు లోపలి వెళ్లారు, జడ్జి గారు ఇద్దర్ని చూస్తూ ఏమయ్యా ఏమి మీ కేసు అని అడిగారు. అంతకూ ముందే  వాళ్ళ లాయర్ ముందే కేసు గురించి చెప్పినా, మళ్ళి వారిని అడిగారు జడ్జి గారు. అయ్య నేను నా  మొదటి భార్య కొన్నేళ్ళ క్రితం విడాకులు తిసుకున్నo. అయితే మాకు ఇద్దరికీ కలిపి అప్పుడు బాబు పుట్టాడు.

విడాకులు తీసుకునె సమయానికి వాడు పాలు తాగే పసి వాడు, అప్పుడు నేను నా కొడుకుని అడిగినా కూడా కోర్టు ఇవ్వదు అని నేను అడగకుండా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు వాడికి పదిహేనేళ్ళు వచ్చాయి కాబట్టి ఒక తండ్రిగా వాడిని చూసుకునే భాద్యత నాకుంది కదా అందుకే నేను నా కొడుకు నాకు కావాలి అని కేసు వేసాను అని అన్నాడు బాలాజీ. 

అదంతా విన్న జడ్జి గారు అవును నువ్వు కేసు వేయడం బాగానే ఉంది, అది సమంజసమైన కోరిక కూడా కన్న కొడుకుని కావాలి అనుకోవడంలో తప్పు లేదు. సరే అమ్మా మరి మీరేమి అంటారు మీకు ఇష్టమేనా మీ కొడుకుని అతనికి ఇవ్వడం, అతని కోరిక మంచిదే కదా అన్నాడు జడ్జి. అయ్యా నమస్కారం అతని కోరిక మంచిదే కాదు అని నేను అనను, కానీ మాకు పెళ్లి అయ్యాక అయిదు ఏళ్ళకి పుట్టిన వాడిని, పట్టుకుని కుండపోత వానలో వాడిని బయటకు తీసుకుని వెళ్ళి, ఇంకా మేడలు కూడా నిలవని పసి కూనని అ వర్షంలో పైకి ఎత్తి పట్టుకుని, విడు నాకే పుట్టాడా అని అడిగినప్పుడు అతని ప్రేమ ఏమయ్యింది? అ తర్వాత అయినా ఒక్కసారి అయిన చూడడానికి రాకుండా, కనీసం వాడి మొఖం ఎలా ఉందో కూడా చూడనప్పుడు ఏమయ్యింది ఆ ప్రేమ? పిల్లాడికి ఎ అచ్చటా, ముచ్చట చేయకుండా వాడి బుడి, బుడి అడుగులని, వాడి చిలిపి పనులని కూడా చూడని ఆ ప్రేమ ఇప్పుడు పుట్టుకు  వచ్చిందా?

వాడికి దయ్యం, బూతం కొట్టకుండా, ఇనాళ్లు పెంచిన నేను ఎంత భాదని అనుభావిన్చానో అ దేవుడికి తెలుసు. నా భాదని నాకు తిరిగి ఇస్తార, ఆరోజు అంత పెద్ద మాట అని నా పరువుని బజార్లోకి లాగిన వాడు, ఇప్పుడు ఆ పరువుని, ఆ కాలాన్ని, నా యవ్వనాన్ని నాకు తిరిగి ఇస్తాడా? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ మా గోడవనంతా వింటూ, చాటుగా నవ్వుకోడడం చూసి అవమానం పొందిన నా తల్లిదండ్రుల పరువుని తెచ్చి ఇచ్చి నా బాబుని తీసుకెళ్ళమని చెప్పండి.

ఇన్నేళ్ళుగా కొడుకు మొఖం చూడని, వాడి తిండికి, బట్టకి ఒక్క రూపాయి కూడా ఇవ్వని వాడిది ప్రేమ అంటారా? ఇప్పుడు వాడికి ఉన్నదీ ఆడపిల్లలు కాబట్టి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి కష్టపడి పని చేసే ఒక సేవకుడు కావాలి. దానికి మేము గుర్తొచ్చి, కొడుకు అని అంటున్నాడు, మరి అప్పుడు వీడు నాకే పుట్టడా?  అని అడిగినప్పుడు ఈ ప్రేమ ఎమైoది సర్?

ఇన్ని రోజులు నేనేదో పని చేసుకుని నా కొడుకుని పోషించుకున్నా, ఇప్పుడు హఠత్తుగా  వచ్చి నా కొడుకు నాకు కావలి అంటే ఎలా? అయినా అతని మాటని అతనికే చెప్తున్నా, వాడు అతనికే పుట్టాడు అని నమ్మకం లేనప్పుడు ఇక ఇప్పుడు అడిగినా నేను ఇస్తాను అని ఎలా అనుకుంటారు? అయినా ఇది నా అభిప్రాయం మాత్రమే, ఇప్పుడు నా కొడుకు కూడా పెద్ద వాడు అయ్యాడు. వాడికి అన్ని విషయాలు తెలుసు, వాడెం అనుకుంటే అది చేయనియ్యండి.

అంతా వాడిష్టం అని చెప్పి, ఉపిరి పీల్చుకుంది లావణ్య. ఏమయ్యా ఆమె చెప్పేది నిజమేనా నువ్వు ఆ మాటలన్నీ అన్నావా? వారికీ ఇప్పటి వరకు వారి భాద్యత చూసుకోలేదా ? అలాoటి వాడివి ఇప్పుడు చూసుకుంటావు అని నేనెలా అనుకోవాలి?

అసలు నువ్వు మొగుడి వేనా? అందుకేనా అలా అడిగావు ? అప్పుడే అలా అడిగిన వాడివి ఇప్పుడు  నిన్ను ఎలా నమ్మాలి, ఒక జడ్జిగా నేను నీకు తీర్పు ఇవ్వోచ్చు కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా నిన్ను నేను నమ్మలేను. అయినా నాకు అవన్నీ అనవసరం. మీ బాబు కి  ఎక్కడ ఇష్టం ఉంటె అక్కడ ఉండొచ్చు బాబుని అడగండి అయ్యా, ఎం బాబు నువ్వు ఎవరి దగ్గర ఉండాలి అనుకుంటున్నావో, భయపడకుండా చెప్పు అని అనడంతో, పవన్ లేచి నిలబడ్డాడు.

పవన్ ని మళ్ళి చూస్తూ బాబు నీ పేరు ఏంటి అని అడిగారు, నా పేరు పవన్ సర్ అని అన్నాడు పవన్. సరే నీకు ఎవరి దగ్గర ఉండడం ఇష్టమో చెప్పు, ఏ ఒక్కరి గురించి ఆలోచించకు, నీకు ఎక్కడ ఉండాలి అని అనిపిస్తుందో అక్కడే నువ్వు ఉండవచ్చు, ఎవరి బెదిరింపులకు, ఆశలకు లొంగకుండా చెప్పు బాబు అన్నారు లాయర్ గారు. దానికి పవన్ తండ్రి, తల్లి వైపు చూసాడు లావణ్య ఏమి మార్పు లేకుండా అలా చూస్తూ ఉండిపోయింది. కానీ, బాలాజీ మాత్రం పవన్ కి సైగలు చేస్తున్నాడు తన దగ్గరే ఉంటాను అని చెప్పమని పవన్ అందరి వైపు చూసి “అంకుల్ నాకు ఇప్పుడే తెలిసింది, మా నాన్న నన్ను, మా అమ్మని ఎలాంటి పరిస్థితిలో వదిలేసి వెళ్ళిపోయాడో, ఏమని అన్నాడో, ఇప్పటి వరకు మా నాన్న గురించి మా అమ్మ నాకు ఏమి చెప్పలేదు. విడిపోయాము అనే చెప్పింది తప్పా నాన్న గురించి చెడుగా ఏమి చెప్పలేదు.

కానీ ఇప్పుడు నేను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానో అని మా నాన్న నన్ను ఏమన్నాడో ఆ విషయాన్నీ చెప్పడం వల్ల అయన ఎలాంటి వాడో నాకు తెలిసింది. మా అమ్మ నన్ను తన దగ్గర ఉండమని ఎప్పుడూ అనలేదు, మా నాన్న మమల్ని వదిలేసి, తన సుఖాన్ని చుసుకున్నట్టుగా మా అమ్మా తన సుఖాన్ని చూసుకుని ఉంటే ఈ రోజు నేనొక అనాధలా ఉండేవాడిని. కానీ, మా అమ్మా అలా చేయకుండా, నా కోసమే బతికింది, నన్ను పెంచిoది.

నాకేం కావాలన్నా మా అమ్మనే అడుగుతాను, ఇన్ని రోజులు మా నాన్న లేకుండానె ఉన్నాము, ఇప్పుడు నన్ను రమ్మని అంటే ఎలా వెళ్తాను నేను, నేను చిన్నవాడినే కావచ్చు కానీ నాకు నా వాళ్ళు ఎవరో తెలుసు, ఆయనకు వయసు అయిపోయిందని, కూతుర్లకి సంపాదించడానికి ఒక కూలివాడు కావాలి కాబట్టి నేను ఇప్పుడు కావాల్సి వచ్చాను.

అయన దగ్గరికి వెళ్తే నేను కూలోడిని అవుతాను తప్ప కొడుకుని కాలేను. కానీ అదే నా తల్లి దగ్గర నేనే రాజుని, నన్ను మా అమ్మ రాజులా చూసుకుంటుంది. నిజమే నాకు మంచి బట్టలు, తిండి, సినిమాలు, షికార్లు లేకపోవచ్చు, కానీ అంతకన్నా మించిన తల్లి ప్రేమ దొరుకుతుంది. తల్లి ప్రేమని పొందిన ప్రతి కొడుకు ఒక మహా రాజే అవుతాడు, అని తండ్రి వైపు చూస్తూ నిన్ను నాన్న అని పిలవాలి అంటే చాలా ఇబ్బంది గా ఉంటుంది.

ఇల్లల్లకి వచ్చిన నిన్ను ఏమి అనకుండా ఉరుకోవడమే నా తల్లి నాకు నేర్పిన సంస్కారం, అంకుల్ నాకు నా తల్లి  ప్రేమ కావాలి అందుకే నేను మా అమ్మ దగ్గరే ఉంటాను. అని అంటూ వెళ్ళి లావణ్య చేతుల్లో వాలి పోయాడు పవన్.

అక్కడున్న వారు అతని మాటల్ని, భాధని అర్ధం చేసుకున్నట్టుగా కళ్ళు తుడుచుకున్నారు. బాలాజీ మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆ మూడు రోజుల భాద కన్నీళ్ళ రూపం లో బయటకు వచ్చింది లావణ్యకి……

Related Posts