తార A Burning Star 1

తార

తార
తార

ఏంటే తార ఎక్కడికి అంత హడావుడిగా వెళ్తున్నావు అంటూ అడిగింది పక్కింటి జ్యోతి. అదా నేను మా బావ దగ్గరికి వెళ్తున్నాను అంది తార. ఎందుకే? ఏదైనా పని ఉందంటానా? అవునే ఈమధ్య పరీక్షల హడావుడిలో పడి మా బావతో మాట్లాడడం తగ్గించాను. అయినా నా చదువు కోసం ఆ మాత్రం దూరం పెట్టలేక తప్పలేదులే అంది తార.

అవును నువ్వు బాగా చదువుకొని గవర్నమేంట్ ఉద్యోగం చెయ్యాలని మీ అమ్మగారి ఆశ కదా. అయినా మీ బావ నిన్ను అర్ధం చేసుకుంటాడు లే..

వెళ్ళు వెళ్ళు, ఇన్ని రోజుల విరహాన్ని ఈరోజు నీ బుగ్గలని ముద్దులతో నింపేస్తాడెమో ఈరోజు నీ పని అయినట్టే అంటూ ఆటపట్టిస్తున్న జ్యోతిని, అబ్బా ఛీ పోవే నీకసలు సిగ్గే లేదు అని అంది చేతులతో మొహం కప్పుకుంటూ, ఆ చేతులను కూడా వదలడులే, ఇక అన్ని ముద్దు మచ్చలే కనిపిస్తాయి.

ఇంకేంటి వెళ్ళు తల్లి, మళ్ళి లేట్ అయితే అతని విరహం తాళలేక, వచ్చినా వస్తాడు అంది జ్యోతి తార చేతులని తీసేస్తూ… సరే వెళ్తున్నా కాని మా అమ్మ వస్తే ఇప్పుడే వెళ్ళాను అని చెప్పు అంది తార. ఆ అదంతా మాకు తెలుసు కాని నువ్వు ముందు వెళ్ళు అని ముందుకు తోసింది జ్యోతి తారను.

******************************

ఇది ఇంకా  రావడం లేదేంటి? ఎప్పుడూ ఎంమనగానే రెక్కలు కట్టుకొని వాలేది. తొందరగానే వచ్చేది, ఇప్పుడు నేనంటే లెక్క లేకుండా పోయింది. రమ్మని చెప్పి గంట అయ్యింది. ఇంకా రావడం లేదు. ఏమైంది గత నెల రోజుల నుండి నన్ను పట్టించుకోవడమే లేదు. ఏమైనా అంటే పరీక్షలు అని వంక పెట్టుకొని, ఆ రాజేష్ గాడితో బైక్ మీద తిరుగుతుంది. నేను ఎన్ని సార్లు ఫోన్ చేసినా గంటలు, గంటలు మాట్లాడేది.

ఈ నెల రోజుల నుండి అయిదు నిమిషాలు కుడా మాట్లాడడంలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు అంటే చదువుకుంటున్న అని అంటుంది. వాడు దీనికి ఇంకో ఫోన్ ఇప్పించాడేమో దీని హొయలు చూసి.

మొన్న వాడి బైక్ మీద వచ్చింది, ఎందుకు బైక్ ఎక్కావు అని అడిగితె, తలనొప్పి ఉంది, ఇంటికి తొందరగా వెళ్దామని బైకు ఎక్కనని కల్లబొల్లి మాటలు చెప్పింది. వాడి బైక్ మీద రావడానికి ఇదొక సాకు. ఎన్ని చూడలేదు. ఇన్నిరోజులు బావా, బావా అంటూ నా వెనకాల తిరిగి, ఇప్పుడు వాడు మంచిగా అనిపించగానే వాడి బైక్ ఎక్కింది.

ఈ మధ్య తిరగడం ఎక్కువైంది. ఇన్నిరోజులు నాతోని తిరిగి, అన్ని అయ్యాక, ఇప్పుడు నన్ను కాదనుకుంది అంటే, నాలో ఎదో లోపం ఉందని ఊరోళ్ళు అనుకుంటారని తన ప్లాన్. ఇక దీన్ని సంగతేంటో తేల్చుకోవాలి, కాదు కాదు దీన్ని చంపాలి.

ఇన్నిరోజులు నాతో తిరిగి, నన్ను వాడుకొని పెళ్ళి చేసుకుందాం అనుకునే టైంలో, ఇది వాడితో బైక్ లో తిరగడం చూసి, నలుగురూ నన్ను చూసి నవ్వుతున్నారని దీనికి తెలుసు, కాని కావాలని ఇలా చేస్తుంది.నాలో లోపం ఉందని,లేదా నన్ను చేసుకుంటే ఏం లాభం ఉండదని నలుగురికి తెలియాలని దీని ఉద్దేశ్యం కావచ్చు.

ఇది ఇప్పుడు వాడి తో తిరిగితే నాకు పిల్లను ఇవ్వడానికి ఎవరూ రారు, సొంత మరదలే వేరే వాడితో తిరగడం చూసి నా దోస్తు శివగాడు అన్నాడు ఏంది మామ కథ అని అంటే అందరూ దాన్ని వాడి బైక్ మీద చూసే ఉంటారు ఇప్పటికే నా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కావచ్చు .

నిజంగానే నన్ను చేసుకోవాలని దానికి లేదు. అవును నాకేముంది చేసుకోవడానికి, రెండు ఎకరాల పొలం అంతే కదా, పైగా చదువు మధ్యలో ఆపేసిన వాడిని. అదే ఆ రాజేష్ గాడు, నాలుగు ఎకరాల పొలం ఉండి, బాగా ఆస్తిపరుడు. పైగా చదువుకున్న వాడు. అందుకే వాడిని పట్టుకుంది. దొంగ లంజ ఇప్పుడు, ఇది వాణ్ని పట్టుకుంటే నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎవరు వస్తారు? అవును దీన్ని ఎలాగైనా చంపాలి.

కాని, అది ఎవరికీ అనుమానం రాకుండా చంపాలి. అవును దాన్ని చంపుతేనే నాకు మనశ్శాంతి. అవును అది రాగానే టి పెట్టమంటే లోపలి వెళ్తుంది. అగ్గిపుల్ల గీస్తుంది. అని ఆలోచించుకొని, కిచెన్ లోకి వెళ్లి గ్యాస్ ఆన్ చేసి, కిటికీలు అన్ని మూసేసి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, తార కోసం ఎదురుచూస్తున్నాడు మనోహర్.

*******

తార

తార
తార

బావా ఇన్నిరోజుల విరహాన్ని ఎలా తట్టుకున్నాడో, అతని విరహానంతా ముద్దులతో పోగొట్టాలి, ఒకవేళ కోపంతో ఉంటె దాన్ని కూడా పోగొట్టాలి. బావని కూల్ చెయ్యడం ఎలాగో నాకు తెలుసు కదా, అయినా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. వ్యవసాయం చేస్తూ, చదువుని మధ్యలోనే ఆపిన బావని మళ్ళి చదివించాలి. అత్త అప్పులన్నీ తీర్చాలి. పెళ్ళి అవ్వగానే పిల్లల్ని కనకుండా, ముందు బావని చదివించిన తర్వాత బావకి ఉద్యోగం దొరికిన తర్వాత, అప్పుడు మెల్లగా పిల్లల్ని కనాలి.

ఈ పరీక్షల రిజల్ట్ రాగానే, ముందు దూం ధాం గా పెళ్ళి చేసుకోవాలి. ఊరు ఊరంతా మా పెళ్ళి గురించి మాట్లాడుకోవాలి, అందరిని పిలిచి, మంచి భోజనం పెట్టాలి. అత్తకు మంచి, మంచి చీరలు కొనాలి. అవును. బావను సూట్ లో చూడాలి. బావ సూట్ వేసుకుంటే చాలా బాగుంటాడు. అవును పెళ్ళికి సూట్ తెప్పించాలి. రాజేష్ గాడి బైక్ ఎక్కినందుకు కోపంగా ఉన్నాడేమో వెళ్లి కోపానంతా పోగొట్టాలి.

కోపం పోయాక అత్తతోటి పెళ్ళి మాటలకు అమ్మని పంపాలి. ఇక అందరూ మా పెళ్ళి గురించి మాట్లాడుకోవాలి. ఊరు ఊరంతా తరలి రావాలి అని అనుకుంటూ, చిలిపి ఊహలతో కొండంత ఆశతో, కొత్త పెళ్ళి కూతురిగా ఊహించుకుంటూ, ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది తార.

******

బావా, బావోయ్ ఎక్కడ ఉన్నావు బావా, బావా అంటూ తలుపులు తీసి లోపలి వచ్చినా తారకు, ఎదో వాసన వచ్చింది. కాని అంతగా గమనించకుండా బావా, బావా అంటూ ఇల్లంతా తిరిగింది తార. ఇదిగో ఇక్కడ ఉన్నా, ఇటూ రా అన్నాడు మనోహర్.

ఏంటి బావా టైం కాని టైం లో ఇలా పడుకున్నావు అని అడిగింది తార. అబ్బా తల నొప్పిగా ఉంది కొంచం టీ ఇస్తావా, అమ్మ పొలానికి వెళ్లిందని నిన్ను రమ్మన్నాను అన్నాడు మనోహర్.

మాములుగా ఉండడానికి ట్రై చేస్తూ, అయ్యో అవునా బావా, నిజంగానా, నాకు తెలియక లేట్ గా వచ్చాను. సారి, బావా… ఇదిగో ఇప్పుడే చేసి ఇస్తాను అంటూ కిచెన్ లోకి వెళ్ళింది హడావుడిగా తారా.

బావ తలనొప్పిని తగ్గించాలనే ఆత్రంతో, ఏమి ఆలోచించకుండా గుడ్డిగా బావ తలనొప్పికి అల్లాడిపోతుంటే తట్టుకోలేక, గబగబా వెళ్లి, గ్యాస్ ఆన్ చేసి, అగ్గిపెట్టేలోంచి పుల్ల తీసి గీసింది.

అంతే! ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఉక్కిరి బిక్కిరి అయ్యింది తార. అసలు ఏం జరిగుతుందో తెలిసే అవకాశం లేకుండా, అరవాలనే ఆలోచన కుడా రాకుండా, మంటల్లో కలిసిపోయింది తార.

అయ్యో అయ్యో అంటూ అరుస్తున్న మనోహర్ అద్దరికి కుడా రాకుండా నవ్వుతు చూస్తూ ఉండిపోయాడు. మచ్చలుగా కాలిపోయిన శరీరంతో, కట్టేలా కాలిపోయింది తార. అంతవరకు పెళ్ళి, చదువు, ఉద్యోగ ఊహల్లో ఊరేగుతున్న ఆమె, కాలిపోయిన కట్టెను చూడడానికి, తార కోరుకున్నట్టుగానే ఊరు ఊరంతా, చూడడానికి వచ్చారు.

కాని సంతోషంతో కాదు దుఖంతో, ఒక చిన్న అనుమానం, అపార్ధం, నిండు ప్రాణాన్ని తీసింది. ఇవేవి ఎవ్వరికి తెలియకుండా, మనోహర్ పిచ్చి ఏడుపు, అబద్దపు ఏడుపు ఏడుస్తున్నాడు. అయ్యో పాపం అని అతన్ని అందరూ ఓదారుస్తున్నారు.

ఒక వ్యక్తిని మనస్పూర్తిగా ప్రేమించిన తార పరీక్షలు ఉన్నాయి అని కాస్త పక్కన పెడితే, అపార్ధం చేసుకున్న మనోహర్, ప్రాణాన్ని తీయడంలో అర్ధం ఉందా ? అందుకే ఎవ్వరిని గుడ్డిగా నమ్మకండి.

ఎవ్వరూ  రమ్మని పిలవగానే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళకండి. ఇలాంటి పరిస్థితుల్లో మీరే ఉంటె ఏం చేస్తారు. ఎలా రియాక్ట్ అవుతారు. ఎలా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు.

ఒక సోదరి బావ ను నమ్మి అతని ఇంటికి వెళ్ళింది కానీ అతను మాత్రం అనుమానం , అపార్దం తో తనను చంపేసి సంపులో పారేసాడు. ఒక వేళ ఇలా జరిగి ఉంటుందా అనే ఉహ తో కొన్ని మార్పు చేర్పులతో ఈ కథ రాసాను.

ఈ కథను చదివి కనీసం ఒక్కరూ అయినా జాగ్రత్త పడతారని నా చిన్ని ఆశ.  ఇలా చేస్తారు అని అనుకోము కానీ ఎవరూ ఎప్పుడు ఎలా మారతారో నమ్మలేని ఈ కాలం కాబట్టి ఇలాంటి వాళ్ళను నమ్మి వెళ్ళి వారి ప్రాణాలను పోగొట్టుకున్న సోదరీమణు (ముఖ్యంగా ఈ రోజు ప్రాణాలు కోల్పోయిన మoజుల) లకు  నా ఈ కథ అంకితం …

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *