అక్షర ప్రేమలేఖల కొరకు
అంశం :- చిత్రం
తేది:- 10/01/2026
శీర్షిక:- నక్షత్రాల సాక్షిగా…
నా ప్రాణ సమానులైన నీకు,
నా చుట్టూ ఉన్న గాలి కూడా నీ జ్ఞాపకాల పరిమళాన్నే మోసుకొస్తోంది. నువ్వు నా పక్కన లేకపోయినా, నీ ఆలోచనలు నా హృదయపు పొరల్లో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
ప్రేమ అనేది కేవలం రెండు అక్షరాల పదం కాదు, అది ఒక అనంతమైన ప్రయాణం అని నిన్ను కలిశాకే నాకు అర్థమైంది.
మనం మొదటిసారి కలుసుకున్న ఆ క్షణం నాకింకా గుర్తుంది. లోకమంతా నిశ్శబ్దమైపోయి, కేవలం నీ కళ్ళలోని కాంతి మాత్రమే నాకు దారి చూపిస్తున్నట్టు అనిపించింది.
నువ్వు నవ్వినప్పుడు వికసించే ఆ మల్లెలు, నీ మాటల్లోని ఆ అమాయకత్వం నన్ను నీ వైపుకు అయస్కాంతంలా లాగేసుకున్నాయి.
ఆ రోజు నా జీవితం ఒక కొత్త మలుపు తిరిగింది. అంతవరకు ఏ గమ్యం లేని నా పయనానికి నువ్వు అనే ఒక అందమైన లక్ష్యం దొరికింది.
నీతో గడిపే ప్రతి నిమిషం ఒక అద్భుతం. ఆ జంటలాగే, మనం ఆకాశపు అంచుల్లో వెన్నెలను చూస్తూ గడిపిన రాత్రులు, ఆ చలి గాలిలో నీ వెచ్చని స్పర్శ.
ఇవన్నీ నా గుండె లోతుల్లో భద్రంగా దాచుకున్న నిధులు. నువ్వు నా పక్కన ఉంటే చాలు, ఈ ప్రపంచంలోని ఏ కష్టమైనా నాకు చిన్నదిగానే అనిపిస్తుంది?
నీ నీడలో నేను పొందే ఆ ప్రశాంతత, వేల అక్షరాలు రాసినా వర్ణించలేను.
నువ్వు నాపై చూపించే ఆ చిన్న చిన్న అలకలు, ఆపై కురిపించే అనంతమైన వాత్సల్యం. ఇవే కదా అసలైన ప్రేమ అంటే! నా ఆశలు, నా ఆశయాలు, నా భయాలు.
వీటన్నిటినీ అర్థం చేసుకుని, నాకు వెన్నుముకలా నిలిచే నీ ధైర్యం నాకెంతో ఇష్టం. మనం మాట్లాడుకోకపోయినా, మన కళ్ళు చేసే సంభాషణ మన మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది.
నువ్వు కొద్దిసేపు దూరమైనా, నా కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. నీ తలపులు నా మనసును చుట్టుముట్టి, ఒక తీయని బాధను మిగిలిస్తాయి.
ఈ దూరం మన మధ్య ఉన్న ప్రేమను తగ్గించదు సరే కదా! నిన్ను మళ్ళీ ఎప్పుడు కలుస్తానా అనే ఆరాటాన్ని పెంచుతుంది?
నీ శ్వాసలో శ్వాసగా మారిపోవాలన్న నా కోరిక, నీ కౌగిలిలో కరిగిపోవాలన్న నా ఆశ.
కలిసి నడిచే దారిలో ముళ్లు ఉండవచ్చు, ఆకాశంలో మేఘాలు కమ్మవచ్చు. కానీ మన చేతులు వీడకుండా ఉంటే… ఏ అడ్డంకినైనా దాటవచ్చు?
మనకోసం ఒక చిన్న ప్రపంచాన్ని నిర్మించుకుందాం. అక్కడ కేవలం ప్రేమ, నవ్వులు, మరికొన్ని తీపి జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. వయసు మళ్ళినా, తల నెరిసినా , నీ కళ్ళలో చూస్తూ, అదే మొదటి రోజు ప్రేమతో నీ చేయి పట్టుకుని ఉండాలని నా ఆశ.
నీపై నా ప్రేమకు ముగింపు లేదు. నా ప్రతి శ్వాసలో నీ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు. నా ఈ ప్రేమ నీకే అంకితం.
ఎప్పటికీ నీ ప్రేమ కోసం పరితపించే…
నీ నీడలా తోడుండే నీ ప్రేమికురాలు.
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ లేఖ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..