నమ్మక ద్రోహం

డోర్ బెల్ మోగింది లోపల బట్టలు వాషింగ్ మెషిన్ లో వేస్తున్న నేను, ఎవరూ అంటూ అరిచాను. సమాధానంగా ఇంకోసారి కాలింగ్ బెల్ మోగింది. అయినా నా పిచ్చి గాని, ఇక్కడ నేను అరిస్తే బయటకి ఎలా వినిపిస్తుంది? అని అనుకుని వెళ్ళి తలుపు తీసాను, ఎదురుగా ఉన్న వారిని అనుమానాస్పదంగా చూసాను ఆవిడ నవ్వుతూ, నమస్కారం అంది నా పేరు లలిత మేము మీ ఎదురు ఫ్లాట్ లోకి కొత్తగా వచ్చాము అని అంటూ తనని తానూ పరిచయం చేసుకుంది.

నేను కూడా మీరేనా కొత్తగా వచ్చింది అని నవ్వుతూ నమస్తే, నా పేరు కోమలి అని పరిచయం చేసుకొని రండి లోపలి అని పిలిచాను. ఆవిడ లోపలికి రాకుండా పర్లేదండి మా ఇంట్లో చిన్నగా వ్రతం చేసుకుంటున్నాం. మీరు తప్పకుండ రావాలి అందర్నీ పిలుస్తున్నాను మొదటి పిలుపు మీకే. వెళ్తున్న పిలవడానికి అని బొట్టు పెట్టి వెళిపోయింది. సరే నాకు పనేం లేదు కదా అని రెడీ అయ్యి వెళ్ళాను.

కొత్తగా వచ్చినా చాల బాగా అలంకరించుకుంది ఇంటిని, ఆవిడ ఇల్లు, నగలు, పట్టుచీర చూసి, నాకు కొంచం అసూయ కలిగిన మాట వాస్తవం, వాళ్ళతో నన్ను నేను పోల్చుకున్నాను కాస్త తక్కువే అనిపించింది నిజం చెప్పోద్దు ఏడుపు కూడా వచ్చింది. వచ్చిన వారికి పూజ అయిపోయాక తాబూలంతో పాటు మంచి స్టాండర్డ్ ఉన్న బహుమతులు కూడా ఇచ్చింది అది చూసి మనసు కుత కు ఉడికిపోయింది.

అప్పుడే కాదు అలా చాల సార్లు అందర్నీ పిలవడం తన గొప్పలు చూపించుకోవడం వంటివి ఎన్నో చేసేది. కానీ మాది ఎదో మధ్యతరగతి జీవితాలు అంత డాబు మేము చూపించలేము, అంత ఖర్చు కూడా మేము పెట్టలేము, ఉన్నదాoట్లోనే జాగ్రత్తగా బతకడం అలవాటు చేసుకుని, అప్పులు చేయకుండా సర్దుకుని ఉండడం మా మద్య తరగతికి అలవాటు అయిపోయి, మా నరనరానా జీర్ణించుకుని పోయింది.

అలా అని మేము ఎవరికీ సహాయం చేయము అని కాదు, అవసరం అయితే ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ద పడతాము. ఇక లలితా దర్జా, హోదా ని చుసిన మా ఫ్లోర్ లో ఉన్న అమ్మలక్కలు అందరూ ఆమె చుట్టూ తిరగడం, ఎదుటి వారు అసలు మనుషులే కానట్టుగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. అప్పటి వరకు ఏంతో హయిగా, కలసి మెలిసి, అన్నింటిలోను ఐక్యత గా ఉన్న మాలో లేనిపోని ఇగో లు మొదలయ్యాయి.

ఒకరంటే ఒకరికి పడకుండా అయ్యింది. చాడి లు చెప్పుకుంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు కొందరు వారిలో వారికీ గొడవలు స్టార్ట్ అయ్యాయి కూడా, ఇవ్వన్ని చూస్తూ ఇదంతా ఎందుకో అని అనుకున్నా నేను, కానీ నన్ను మాత్రం ఎవరూ లాగలేదు అందులోకి....

ఎప్పుడూ గణపతి నవరత్రులకు, దేవి నవరాత్రులకు అందరం కలిసి పూజలు చేయిన్చేవాళ్ళం, కానీ సరి రెండింటిలోనూ లలిత దంపతులే ఎక్కువగా పాల్గొన్నారు, లడ్డులు, చీరలు కూడా ఎక్కువ ధరకు వేలం పాడి, వాళ్ళే తీసుకోవడం తో వాళ్ళ మిద ఇంకా ఎక్కువ ఇంటరెస్ట్ కలిగింది అందరికి, వాళ్ళు రోజు అందర్నీ టీ లకు, టిఫిన్ లకు పిలవడం పరి పాటి అయ్యింది, దాంతో అందరూ ఆవిడ గురించి, ఆవిడ నగల గురించి మాట్లాడుకుటూనే ఉన్నారు. చూస్తున్న నాకు వాళ్ళు మంచితనం కన్నా, నగలకు, డబ్బుకు విలువ ఇస్తున్నారు అని అనిపించింది.

ఇంతలో మా ఆడపడుచు కూతురు పెళ్లి ఉండడం తో, మేమంతా మా అత్తగారి ఉరికి వెళ్ళాము ఒక పది రోజుల ముందే. పెళ్లి పనులు, పెళ్లి మాటలతో నేను అక్కడి విషయాన్ని మర్చిపోయాను. మా ఆడపడుచు కూతురు పెళ్లి చాల బాగా మాటలు పడకుండా, గొడవలు లేకుండా జరిగిపోయింది. పనులన్నీ అయ్యాక మేము తిరిగి బయలుదేరి మా ఇంటికి వచ్చాము.

ప్రయాణ బడలిక వల్ల నేను నాలుగు రోజులు వాకింగుకు వెళ్ళలేదు, రోజు కాస్త బయట గాలి పిల్చాలని అనిపించి, వాకింగుకు బయలుదేరి వెళ్ళాను కిందికి. కిందకు వెళ్ళాక ఎప్పుడూ ఆడవాళ్ళతో సరదాగా, హడావుడిగా ఉండే గ్రౌండ్ చాలా నిశ్శబ్దంగా ఉండడంతో ఆశ్చర్య పోయాను నేను. లలితా వచ్చాక  కూడా నలుగురిని వేసుకుని, గ్రౌండ్ అంతా తిరుగుతూ అల్లరల్లరిగా ఉండేది. ఇంతలో వాచ్ మెన్ రావడంతో అదే విషయాన్నీ అతన్ని అడిగాను, ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి అని, అప్పుడు అతను చెప్పినా విషయం విని నివ్వెరపోయాను.

విషయం ఏమిటంటే లలితా దర్జా, హోదా చూసిన ఆడవాళ్లు అందరూ ఆమె ఎదో వ్యాపారం పేరు చెప్పి అందులో మూడు రూపాయలు పెడితే ఆరు రూపాయలు ఇస్తాను అంటూ అందరితో చెప్పిందంట అలా ఒక్కర్నే కాకుండా వాళ్ళని, వాళ్ళ చుట్టాలని, స్నేహితులతో కూడా ఆమె వ్యాపారంలో డబ్బుకు ఆశ పడి, పెట్టు బడులు పెట్టారు అంట అందరూ…,

ఇక్కడ అందర్నీ అలా వ్యాపారంలో దింపి, మేము మా ఆడపడుచు కూతురి పెళ్ళికి వెళ్ళిన నాలుగు రోజులకు వాళ్ళ చుట్టాల పెళ్లి ఉందని చెప్పి, వెళ్ళి పోయారంట వాళ్ళు వెళ్ళాక రెండు రోజులకు పోలీసులు వారి కోసం వచ్చి, అపార్ట్మెంట్ వారిని ప్రశ్నించారు అంట, వాళ్లు జరిగింది చెప్పడంతో పోలీసులు వాళ్ళ గురించిన నిజాలు చెప్పారంట.

లలిత, ఆమె భర్త ఇద్దరూ మోసగాళ్ళు అంట, వ్యాపారం పేరు చెప్పి, వాళ్ళనుండి డబ్బులు లాగి, డబ్బుతో నగలు కొంటూ, జల్సాలు చేస్తూ, డబ్బునిర్చుపెడుతూ, ఆడవాళ్ళనే టార్గెట్ చేసి, వాళ్ళని మాయచేసి, మబ్య పెట్టి ఇలాంటి మోసాలకు పాల్పడుతునట్లు చెప్పి, ఇక ముందు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు అంట, అది విన్న మా అపార్ట్ మెంట్ వాళ్ళు లబో దిబో మంటూ తాము ఆవిడకు డబ్బు ఇచ్చిన విషయం చెప్తే, పోలీసులు ఇక డబ్బు మీకు రాదు అని చెప్పడం తో అంత వరకు భార్యలని ఏమి అనని భర్తలు భార్యలు చేసిన నిర్వాకానికి తిట్టి, ఇంట్లో నోర్లు ముసుకుని కూర్చోండి అని అన్నారంట, దాంతో బయటకు ఎవరూ రావడం లేదంట.

అంతా విన్న నేను వాళ్ళు ఆమె డబ్బుకు, నగలకు విలువ ఇవ్వడం, నాలాంటి దాంతో మాట్లాడడం తగ్గించడం, నన్ను అసలు మనిషిగా గుర్తించకుండా చేయడం చూసి వారికీ తగిన శాస్తి జరిగింది అని అనుకోవాలో, లేక ఆమె చేసిన పనికి అంటే ఇంత మందిని నమ్మించి, ద్రోహం చేయడాన్ని మెచ్చుకోవాలో తెలియక, ఆమె చేసిన నమ్మక ద్రోహానికి వీళ్ళు ఎంత బాధ పడుతున్నారో అని అనుకోవాలో, ఉచ్చులో నేను పడనందుకు సంతోషించాలో అర్ధం కాలేదు. ఒక్కసారిగా  పెద్దగా, గట్టిగా నిట్టూర్చి ఇంటి వైపు నడక సాగించాను భారమైన మనసుతో …….

Related Posts