నవశకానికి వారధులు

అక్షర అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోటీ కొరకు

అంశం :⁠- నేటి తరం ఆడపిల్లలు వారి మనస్తత్వం

తేది:⁠- 02/03/2026

శీర్షిక:⁠- నవశకానికి వారధులు

        ప్రకృతిలో మార్పు సహజం.ఆ మార్పుకు నిలువెత్తు రూపాలే నేటి తరం ఆడపిల్లలు.ఒకప్పుడు స్త్రీ అంటే వంటింటికే పరిమితం,అణిగిమణిగి ఉండాలి అనే భావన ఉండేది. 
     కానీ నేటి తరం ఆడపిల్లలు ఆ గీతలను చెరిపివేసి, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు.వారి మనస్తత్వం,ఆలోచనా విధానం గత తరాల కంటే భిన్నంగా, ఆధునికంగా మరియు అత్యంత ఆత్మవిశ్వాసంతో కూడి ఉంది.

నేటి తరం అమ్మాయిల్లో కనిపిస్తున్న ప్రధాన మార్పు ఆత్మవిశ్వాసం. వారు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలనే స్వతంత్ర భావజాలాన్ని కలిగి ఉన్నారు. చదువులో, ఉద్యోగంలో మగవారితో సమానంగా పోటీ పడటమే కాకుండా, తామేంటో నిరూపించుకుంటున్నారు? ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటాన్ని వారు తమ ఆత్మగౌరవంగా భావిస్తున్నారు.

నేటి తరం అమ్మాయిలు ఆధునికతను ఆహ్వానిస్తూనే… సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. పండుగలు, పబ్బాల సమయంలో పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తూ, సంస్కృతిని కాపాడుతున్నారు. అంటే.. వారు కేవలం జీన్స్, టీషర్ట్‌లకే పరిమితం కాలేదు. లోపల భారతీయ ఆత్మను భద్రంగా ఉంచుకుంటూనే బయట ప్రపంచంలో ఆధునిక మహిళలుగా రాణిస్తున్నారు.

నీ మనసును ఇతరుల నియంత్రణలో ఉండనివ్వకు. నేటి తరం అమ్మాయిలు ఈ సూత్రాన్ని బలంగా నమ్ముతున్నారు. పెళ్లి, కెరీర్ లేదా వ్యక్తిగత ఇష్టాయిష్టాల విషయంలో ఇతరుల ప్రమేయం కంటే తమ నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ జీవిత గేరు బాక్సును తామే నడపాలని, ఇతరులు తమను రివర్స్ గేరులోకి నెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు.

నేటి అమ్మాయిలకు సామాజిక స్పృహ ఎక్కువ. అన్యాయం జరిగినప్పుడు గొంతు ఎత్తడానికి వారు వెనుకాడటం లేదు. అయితే ఈ ప్రయాణంలో వారు అనేక సవాళ్లను కూడా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి , భద్రతపై ఆందోళనలు మరియు సోషల్ మీడియా ప్రభావం వల్ల కలిగే మానసిక ఒత్తిడి వారిని వేధిస్తున్నాయి. అయినప్పటికీ వారు ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.

నేటి తరం ఆడపిల్లలు మల్టీటాస్కర్లు. వారు ఒకవైపు దీపాలు వెలిగించే గృహలక్ష్మిగా, మరోవైపు ప్రపంచాన్ని శాసించే మేధావులుగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. వారి మనస్తత్వం ఒక నిరంతర ప్రవాహం లాంటిది. అది దారిలోని అడ్డంకులను తొలగించుకుంటూ తన గమ్యాన్ని వెతుక్కుంటుంది. వారిని నియంత్రించడం కంటే, వారికి అండగా నిలిచి ప్రోత్సహిస్తే, వారు నవ సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తారు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ వ్యాసం నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *