నవ్వుల నాగయ్య
ఒక ఊరిలో నాగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు?
కానీ , ఒక గొప్ప సంపద మాత్రం ఉండేది , అదే అతని చిరునవ్వు! ఎప్పుడూ నవ్వుతూ ఉండటంతో…? ఊరంతా అతడిని నవ్వుల నాగయ్య అని పిలిచేవారు.
ఒకరోజు నాగయ్య కొత్తగా కుట్టించుకున్న గులాబీ రంగు చొక్కా వేసుకుని బజారుకు వెళ్లాడు. అతని నవ్వు చూసిన వారందరూ,
“ఏమయ్యా నాగయ్య! లాటరీ తగిలిందా?” అని అడిగారు.
“లాటరీ కాదు రా బాబూ! మా ఆవు నన్ను ఈరోజు తన్నలేదు!” అన్నాడు నాగయ్య.
అంతలో టీ దుకాణం దగ్గరకు వెళ్లి,
“ఒక టీ ఇవ్వు” అన్నాడు.
టీ తాగి డబ్బులు ఇవ్వకుండా బయలుదేరాడు. టీ దుకాణం యజమాని,
“అయ్యా! డబ్బులు…!” అని అరిచాడు.
నాగయ్య వెంటనే జేబులో చేతిపెట్టి,
“అయ్యో! డబ్బులు ఇంట్లో మర్చిపోయాను. కానీ , నా నవ్వు చూసి ఒక టీ ఉచితంగా ఇవ్వొచ్చుగా!” అన్నాడు.
“నీ నవ్వుతో కడుపు నిండితే బాగుండేది!” అన్నాడు దుకాణదారుడు.
అప్పుడు నాగయ్య,
“అది నిజమే! కానీ , నా నవ్వు వల్ల మీ దుకాణానికి జనాలు చేరి ఇంకో పది టీలు తాగుతారు!” అన్నాడు.
అందరూ నవ్వేశారు. కొద్దిసేపటికి నాగయ్య కూరగాయల దుకాణానికి వెళ్లాడు.
“టమాటా కిలో ఎంత?” అని అడిగాడు.
“యాభై రూపాయలు” అన్నాడు వ్యాపారి.
“అయితే అర కిలోకి ఇరవై ఐదు రూపాయలే కదా?” అన్నాడు.
“అవును…!” అన్నాడు.
“అయితే నాకు పావు కిలోకి నవ్వు బహుమతిగా ఇవ్వు!” అన్నాడు నాగయ్య.
వ్యాపారి నవ్వుకుంటూ,
“నీతో వ్యాపారం చేయడం కంటే నాటకం ఆడడం సులభం!” అన్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లాక భార్య అడిగింది,
“రోజంతా తిరిగి ఏం తెచ్చావు?”
నాగయ్య చిరునవ్వుతో,
“ప్రజల ప్రేమ, పది మందికి నవ్వులు, ఇద్దరి తిట్లు!” అన్నాడు.
“అవి వండి తింటామా?” అని భార్య కోపంగా అడిగింది.
“తిట్లు వండలేం కానీ , నవ్వులతో బాధలు మర్చిపోవచ్చు కదా!” అన్నాడు.
అది విన్న భార్య కూడా నవ్వకుండా ఉండలేకపోయింది.
అప్పటి నుంచి ఊరివాళ్లు ఒక మాట చెప్పుకునేవారు.
“డబ్బు ఉన్నవాడు ధనవంతుడు కావచ్చు. కానీ , తన నవ్వుతో పది మందిని నవ్వించగలిగినవాడే నిజమైన అదృష్టవంతుడు అని”
జీవితంలో కష్టాలు ఎన్నున్నా, చిరునవ్వు ఉంటే చుట్టూ ఉన్నవారి హృదయాల్లో ఆనందాన్ని నింపవచ్చు.
మాధవి కాళ్ల