నువ్వెళ్ళిపోయాక…గాలి కెరటాల అలికిడితోనే

అక్షరలిపి రచయితల సమూహం..

అంశం :- నువ్వెళ్ళిపోయాక
రచన :- ఆదిత్య శివశంకర కలకొండ
ఊరు :- మాటూరు (మిర్యాలగూడ)

గాలి కెరటాల అలికిడితోనే
నువ్వొచ్చావని తెలిసిపోయేది..

నీ కాలి మువ్వల సవ్వడిలోనే
నా నవ్వుల పర్వం మొదలైపోయేది.

నీ చంద్ర బింబపు ముఖములోనే
నా ఆనందం తాండవించేది..

నీ ముత్యాల నవ్వుతోనే, నా మనసు
తడిసి ముద్దయిపోయేది..

నీ ఇంపైన సొగసు చూసి
నా వయస్సు తెగ ఉరకలేసేది..

ఏడిపించి , నవ్వించి..
కవ్వించి , మురిపించి , మైమరపించి
ఊహకు అందని ఊసులతో
మరువలేని నీ బాసలతో
ప్రేమకు సరైన బాస్యం చెప్పి

తీపి జ్ఞాపకాలు నాకు వదిలేసి
తీరని వేదన నాకు మిగిల్చి
కనుమరుగయిన నా కలల దేవత..

★ నువ్వెళ్ళిపోయాక…

కోకిల పాడనంటుంది..
నెమళ్ళు ఆడనన్నాయి..
పువ్వులు వాడనున్నాయి..
నవ్వులు ఆగిపోయాయి..

పున్నమి చిన్నబోయింది..
వెన్నెల ఆరిపోయింది..
జాబిల్లి కళ తప్పిపోయింది..
ఉదయించే అరుణ కిరణాలు
పలకరించడం మానేశాయి..

చీకటి ని చూస్తే నవ్వొస్తుంది..
వెలుగును చూస్తే భయమేస్తోంది..
పుడమిని వదిలించుకుని
ఆకాశాన్ని కౌగిలించుకోవాలనే కోరిక
నా నర నరాన జీర్ణించుకుపోయింది..

హృదయం స్తంభించింది ,
మనసు ఘనీభవించింది
దేహం ద్రవీభవించింది..
ఈ ఆత్మ అనంత వాయువులో
కలిసిపోయినంత పనయ్యింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *