నేను ఎవరు?
చుట్టూ చిక్కని చీకటి, రోడ్ మీద అప్పుడప్పుడు వెళ్తున్న వాహనాల ధ్వని తప్పితే ఇంకా సంచారం లేదు. పట్టణం అంతా సద్దుమణిగింది. బయట వాహనాల్లో తప్ప కాలినడకన ఎవరూ వెళ్లడం లేదు.అక్కోడో లైట్ ,ఇక్కడో లైట్లు వెలుగుతున్నాయి ప్రాణం లేనట్లు గా,ఆ వెలుగులో ఎవరిదో ఒక ఆకారం మెల్లిగా నడుస్తూ వస్తుంది, ఎవరో, ఏమిటో, ఇంత అర్ధరాత్రి ఎందుకు వస్తున్నారో అయ్యో ఆ ఆకారం లైట్ దగ్గరగా వచ్చేసరికి ఆమె అంటే ఆడమనిషి అని తెలిసింది. ఆ ఆకారం వట్టి ఎముకల గూడు ల ఉంది.శరీరంలో కొంచం కండ కూడా లేదు. కళ్ళలో మాత్రం ఎదో తెగింపు, ఎదో నిరాశ, గా ఉన్నాయి, ఆ ఆకారాన్ని చూస్తుంటే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనిషి అని అనిపిస్తుంది.
కానీ అలాంటి ఆ మనిషికి ఇంత రాత్రి ఇక్కడ ఏమి పనో అర్థం కాలేదు. అందరూ హాయిగా ఇంట్లో వెచ్చటి దుప్పట్లు కప్పుకుని పడుకున్నా ఈ సమయంలో ఆవిడ మాత్రం ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నట్టుగా ఎక్కడికో వెళ్తుంది. ఆమె నాలుగు అడుగులు వేయక ముందే రోడ్ కి అడ్డుగా ఉన్న రాయి ఆమె కాళ్ళ కి తగిలి ముందుకు పడింది. దాంతో ఆమె బొక్క బోర్లా పడిపోయింది, ఆ విసురుకు ఆమె చీర మోకాళ్ళ మీదకి జరిగింది. అలా పడినా కూడా ఆమె తిరిగి పైకి లేవాలనే ఆమె ప్రయత్నం నిరూపయోగం అయ్యింది.
కానీ అటు నుండి ఇటూ తల మాత్రం తిరిగి,వెలకిలా తిరిగింది. మోచేతులు కింద పెట్టి,పైకి లేవాలని అనుకున్నా ఆమె శక్తి సరిపోక అలాగే పడిపోయింది. ఆమె పడిన తీరు చుస్తే ఎదో ఆసహాజంగా అనిపించింది. ఆమె కళ్ళు ఆకాశాన్ని చూస్తున్నాయి. ఆమె మరణించింది అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కానీ ఆమె కళ్ల లో ఎదో నిరాశ, ఎదో సాధించాలనుకుని, సాధించలేక పోయాను అనే అసంతృప్తి ఆమె కళ్ళలో ప్రతిపలిస్తుంది.
ఆ రాత్రి ఆమె ఆ రోడ్ మీద అలాగే పడి ఉంది. ఇంకా నయం ఆమె మీదనుండి ఏ వాహనాలు వెళ్ళలేదు. ఆ వాహనాలు వెళ్తే మాత్రం ఆమెని ఎవరూ గుర్తుపట్టలేరు. అయినా ఆ మనిషి ఆడుక్కునే బిచ్చగత్తెనా అని అనుకుందాం అంటే అలా లేదు కానీ ఆకారం మాత్రం అలా అనుకోవచ్చు అనే చెప్తుంది. పోనీ వేశ్యనా అని అనుకుందాం అంటే అలాంటి అలంకరణ కానీ, అలాంటి శరీర కొలతలు కానీ ఏమి లేవు, పోనీ ఇంట్లో నుండి పారిపోయి వచ్చిందా అంటే ఆమె దగ్గర ఎలాంటి సామాను లేదు. మరి ఎవరు ఆమె ? అలా దిక్కులేని పక్షిలా ఎందుకు రోడ్ మీద చనిపోయింది ?అది తెలుసుకోవాలి అంటే పోలీసులు రావాలి, వాళ్ళు వస్తే తప్ప ఆమె ఎవరో,ఏమిటో,ఎందుకు ఇలా చచ్చిoదో తెలియదు.
అప్పటి దాకా ఈ శవ జాగారం తప్పదు.అలా చూస్తూ ఉండగానే తెల్లగా తెల్లారింది. అక్కడే లారీ లు ఆపిన డ్రైవర్లు కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో, అటువైపుగా వచ్చారు.వాళ్ళ దృష్టి ఆ శవం మీద పడింది.కానీ మనకెందుకులే అని అనుకునే అందరిలో వాళ్ళు ఒకరు కదా, అందుకే ఎవరూ పట్టించుకోకుండా తమ తమ పనులు చేసుకున్నారు.ఒక గంట అయ్యాక ఆ ఊరి వాడు కానీ ఎవరో పుణ్యాత్ముదు పోలీసులకి ఫోన్ చేసాడు తన వంతు కర్తవ్యం నిర్వర్తించాను అనుకుంటూ…
పోలీసులు గంట తర్వాత మెల్లిగా వచ్చారు అందరూ అనుకున్నట్టుగా, వచ్చాక ఆమెని అన్ని కోణాల్లో ఫోటోలు తీసి, అక్కడున్నవారిని అడిగారు.ఎవరో తెలుసా అని కానీ ఆమె వచ్చిన విషయం ఎవరికి తెలియదు కాబట్టి అందరూ తెలియదనే చెప్పారు.ఆ పోలీసులు ఆమెని ఒక అనాధ అన్నట్టుగా రాసుకున్నారు వారి కాగితాల్లో, కానీ ఆమె ఎవరో తెలుసుకోవాలని అనుకున్న నాకు నిరుత్సాహం కలిగింది. ఒక్కసారి వాళ్ళు అనాధ అని రాసుకున్నారు అంటే ఇక అంతే,ఎప్పటికి ఆమె ఎవరో తెలియకుండా పోతుంది.
అందువలన నేను ఆమె ఎవరో తెలుసుకోవాలి అని అనుకున్నా, ఇంతలో నన్ను ఏవరో పీల్చినట్టు అనిపించింది, నా పక్కనే ఉన్నట్టుగా అనిపించింది, పక్కనే చూసాను ఎదో తెల్లని పొగ లాంటిది ఉంది అక్కడ, నాకు తెలిసిన, వచ్చిన భాష లో అడిగాను నేను మీరెవరు అని,? దానికి ఆ తెల్లని ఆకారం లాంటి ఆకారం కాని ఆకారం నా గురించి తెలీసుకోవాలి అని అనుకుంటున్న నువ్వు నాకు ఆప్తుడువి, నేను ఎవరో నీకు చెప్పాలి అని అనుకుంటున్నా, అని అందా ఆకారం…,
నాకు కాస్త భయం వేసిన మాట నిజమే కానీ,ఆమె ఎవరో తెలుసుకోవాలి అన్న ఉత్సాహం తో ఆ భయాన్ని పక్కకు పెట్టేసి అవునా అయితే చెప్పండి నాకు మీరెవరో తెలుసుకోవాలని ఉంది అని అన్నాను,సరే చెప్పాలనే కదా వచ్చాను, అని కాస్త ఊపిరి తీసుకుంది.అవును ఆత్మ ఊపిరి తీసుకోవడం ఏమిటి పిచ్చి కాకపోతే, సరే చెప్పండీ అన్నాను తాను చెప్పడం మొదలు పెట్టింది,నేను నా చెవులు రిక్కించి వినడం మొదలు పెట్టాను….
నా పేరు కోమలి నేను అందరిలాంటి అమ్మాయినే,మా అమ్మానాన్నలకు ఒక్కగానొక్క కూతుర్ని.అందరి ఆడపిల్లల లాగానే నేను కమ్మని కలలు కన్నాను భావి జీవితం గురించి,అందరిలాగే చదువుకున్నా, ఆ వయస్సు లో నాలో ఒక యువకుడి తో ఆకర్షణ లో పడ్డాను, హద్దులు దాటము, అది నా తల్లిదండ్రులు గమనించి, నన్ను చదువు మానిపించి,నా అత్త కొడుకు తో పెళ్లి జరిపించారు. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు, ఆ తర్వాత అయిదేళ్ళు నరకం అనుభవించాను, కొడుకు పుట్టిన తర్వాత అతని నుండి విడాకులు తీసుకొని స్వతంత్రంగా బతికాను.
కానీ నా తండ్రి చనిపోయిన తర్వాత కూడా ఏమంత కష్టం అనిపించలేదు.ఎందుకంటే నేను అందరితోనూ రిజర్వు గా ఉండే దాన్ని దాంతో నాతో ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు, నేను కూడా నా పని,ఇల్లు తప్పా ఏమి పట్టించుకునే దాన్ని కాదు. అలా జీవితం సాగుతున్న సమయంలో నాకో సంబంధం వచ్చింది,రెండో పెళ్లి కి బాబుని ఒప్పుకున్నారు అని అతన్ని పెళ్లి చేసుకున్నా, తర్వాత అర్ధం అయ్యింది,ఇంకోసారి నేను అడుసులో కాలేసాను అని, కానీ చేసుకున్న వారికి చేసుకున్నంత అతనేం చెడ్డవాడు కాదు, అలా అని మంచివాడు కాదు. చదువుకున్నా మూర్ఖుడు అని తెలిసి అతన్ని వదిలెయ్య లేదు…
కానీ మళ్ళీ నా తల్లిగారింటికి వచ్చాను.అలా వచ్చిన సమయంలో నాలో ఉన్న రచయిత ని గుర్తించిన నా తమ్ముడు కథలు రాయమని అన్నాడు. నేను రాయడం మొదలు పెట్టాను. అలా ఒక సంస్థలో ఒక రచయిత గా పేరు పొందాను. వాటిని రాస్తున్నప్పుడు నాకేం తక్కువ అనే నమ్మకం తో ఉన్న నేను కొద్దిరోజులకు అందులో కూడా రాజకీయాలు మొదలు అయ్యాయి,అందులో నన్ను అనగదొక్కలనే ప్రయత్నాలు జరిగడం, పాత వారినే అంటే డబ్బులు పెట్టె వారికే పీటలు వేయడం జరిగింది.
దాంతో ఇదేంటి అని అడిగిన అంటే ప్రశ్నించిన నన్ను బయటకు వెళ్లిపో అన్నారు, అక్కడ వారు చెప్పినట్లు నేను వినలేదు అని నా గురించి చెడు గా ప్రచారం చేశారు. దాంతో నాకు రచయిత గా అవకాశాలు రావడం తగ్గిపోయింది.నేను చాలా బాధ పడ్డాను, అందరికి వారి విషయం చెప్పాను కానీ కానీ ఎవరూ పట్టించుకోలేదు,ఎందుకంటే వారికి అంగబలం, అర్ధబలం రెండు ఉన్నాయి. కాబట్టి నా మాటలు ఎవరూ వినలేదు.
సరే ఎవరూ ఎలా పోతే నాకేంటి అనుకుని నా పరిధిలో నేను ఉన్నా, కానీ వారి గురించి నేను అందరికి చెప్పాను అని నిన్న రాత్రి నా మీద దాడి చేశారు. ఆ దాడిలో నా తలకి బలమైన దెబ్బ తగిలింది. పారిపోయి వస్తూ ఇక్కడ ఈ రోడ్ మీద పడీ చనిపోయాను అని అంటూ తన సుదీర్ఘ కథ ని చెప్పింది ఆ దెయ్యం.
పాపం దయ్యం అని అంటున్నా నేoటి,పేరు ఎదో చెప్పిందే హ కోమలి కదా, పాపం గొప్ప రచయిత కావాలనుకుంటే ఆమె ఆశని ఈ పాడు లోకం అనగదొక్కింది, అయినా తాను చేసిన తప్పేంటి కేవలం అలా ఎందుకు అని ప్రశ్నించి నందుకా,అడిగే హక్కు ప్రతి వారికి ఉంది. ప్రశ్నించే హక్కు లేదా, అదే మగవాడు అడిగితే తప్పు కదా, ఆమె ఆడది, అబల,కోమలి అని కూడా చూడకుండా దాడి చేస్తారా, ఎక్కడుంది న్యాయం, ఎక్కడుంది అబలకు రక్షణ, అన్నింటిలోను అణిచివేతకు గురవుతున్నారు ఒక్క దీనిలో తప్పా అనుకుంటే ఇందులో కూడా వారిని అణిచివేత కు గురవుతున్నారు…
అయ్యో పాపం ఆమెని ఓదార్చడం మర్చిపోయాను కానీ ఇప్పుడు ఓదార్చి ఏమి లాభం లేదు.ఎందుకంటే ఆమె ఆల్రెడీ చనిపోయింది కదా, ఇప్పుడు ఓదార్చి ప్రయోజనం లేదు. కోమలే తిరిగి అవును నేను ప్రశ్నించడం తప్పు కాదు,కానీ వాళ్ళు డబ్బుకు అమ్ముడు పోయి , కనీస న్యాయాన్ని మర్చిపోయి, సామాజిక న్యాయం పాటించకుండా, ఇష్టం ఉన్న వారిని , ఇష్టమొచ్చినట్లు పొగడడం, డబ్బు ఇచ్చిన వారిని అందలం ఏక్కించడం వంటివి చేశారు.
అలా అని అందరూ అలాంటి వాళ్ళే అనడం లేదు,కొందరు మంచి వాళ్ళు కూడా ఉన్నారు,కానీ వారిని కూడా ఇలాంటి వారు మార్చేస్తున్నారు. డబ్బు లు ఇచ్చి మరి పొగడ్తలు,బిరుదులను కొనుక్కునే వారు ఉన్నంత కాలం ,ఇలాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు.అసలు సమాజంలోనే మార్పు రావాలి, అలా రావాలి అంటే నాలాంటి నిజాలు చెప్పేవారు రావాలి.కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది,అదేంటంటే నిజాలు చెప్తే ఎవరికి నచ్చదు.
ఎవరూ పట్టించుకోరు.కానీ నిజాన్ని నిర్భయంగా అంగీకరించే వారు వచ్చేoత వరకు మనం ఎదురు చూడడం తప్పా మనం చేసేది లేదు.ప్రజల్లో మార్పు రావాలి,ఎవరు మంచి రాస్తున్నారో, ఎవరు ముఖ స్తుతి చేస్తూన్నారో, గమనించాలి వారిని గౌరవించాలి.వారిలో నిజమైన రచయితని గుర్తించాలి అని అంటూ కాసేపు ఆగి….
హు చెప్పేది అంతా చెప్పేసా, ఇక సమాజంలో మార్పు వచ్చినప్పుడు నేను మళ్ళీ పుడతా, మళ్ళీ రాస్తా, నాకు సమయం అయిపోయింది మిత్రమా వెళ్తున్నా అంటూ ఆమె ఆత్మ గాల్లోకి ఎగిరిపోయింది.నేను ఆమె వెళ్లిన వైపు చూస్తూ గట్టిగా నిట్టూర్చి,ఆమె కోరిక త్వరలోనే తీరాలి అని గట్టిగా అనుకున్నాను. నా రెక్కలని ఊపుతూ..
ఇంతకీ నేను ఎవరో మీకు చెప్పలేదు కదా…నేనొక చెట్టుని.
భవ్య చారు