నేనూ.. మనిషినే! 2

నేనూ మనిషినే

నేనూ.. మనిషినే!
నేనూ.. మనిషినే!

నీ నోట్ల మన్నువడ , నీ గత్తర లెవ్వ ఎందుకు పుట్టినవో ఏం చేయనికి పుట్టినవో నా గండాన దాపురమైనావ్ తూ నీ బతుకు జడ , ఇంకా ఎన్ని రోజులు నిన్ను సాకలే రా నిన్ను రా అనాలనా రాయే అనాలనా అనేదే నాకు సమజైతలేదు ఎందుకు పుట్టినావు రా నా కడుపుల ఒక మగాడు పుడ్తడేమో నా కష్టాలు అన్ని తీరతాయి అనుకుంటే ఏం కాకుండా ఎటు కానోనివి పుట్టినవెం రా , నీ పినిగే ఎల్ల నువ్వు సస్తే నేను ఎడ్వాగూడ ఎడ్వ తూ నీ బతుకు ఎందుకురా నా కడుపుల పుట్టి నన్నిట్లా సతయిస్తావు నీ సిరలేంది ఆ సోకులేంది ఆ బొట్టేంది తూ గాడి ద శాకిరి స్హేషిణ కదరా నువ్వు పుట్టినప్పుడు   ఇట్లా అయితవు అని గప్పుడే తెలుస్తే నీ పీక విసికి సంపుతుంటి మొన్నటి దాకా మంచిగానే ఉంటివి కదరా గా నడుసుడు సుశి అడుగుతే గప్పుడు తెలిశే నీ అసలు రూపు  ఓరి దేవుడా నాకేందుకిన్ని కష్టాలు రా భగవంతుడా అంటూ ఏడుస్తున్న తల్లిని చూసి కళ్యాణ్ కాదు కళ్యాణి ఏం మాట్లాడాలో తెల్వక బిత్తరపోయి నిలబడింది.

తను చేసిన తెప్పెంటో తెలియక తల్లి పెడుతున్న శాపాలు వింటూ గోడకు చేరబడింది కళ్యాణి . అవును నిజమే తను మగాడు కాదని ఇప్పుడు అమ్మ చెప్పేదాకా తెలియదు తనకు అయినా తానూ కావాలని అయ్యాడా ఏమైనా కావాలని అనుకున్నాడా మొన్నటి వరకు అంటే ఏడవతరగతి వరకు తానూ అందరి మగపిల్లల్లా ఉన్నాడు ఆడుకున్నాడు కానీ ఎనిమిదిలోకి వచ్చేసరికే బొట్టు పెట్టుకోవాలని, పంజాబీ డ్రెస్ వేసుకోవాలని, పువ్వులు పెట్టుకోవాలని అనిపించింది దానికి కారణం ఏమిటో తనకు తెలియదు తానె ఆశ్చర్య పోయాడు తనకు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో తెలియక అప్పుడే పక్కింటి పిల్ల లంగా కట్టుకుంటే అమ్మ సుశి ఇప్పుడు గీ మాటలు మాట్లాడుతుంది.

నేనూ.. మనిషినే!

నేనూ.. మనిషినే!
నేనూ.. మనిషినే!

పాపం అమ్మ ఎన్నో కష్టాలు పడింది పెళ్ళి అయినా అరునేలలకే నాయిన ఇంకోదాన్ని తీసుకుని వెళ్ళిపోతే అప్పటికే నేను కడుపులో ఉన్నాను అంట, ఎవలు అమ్మను దగ్గరికి తియ్యకపోతే కష్టపడి ఇళ్ళలో పని చేస్తూనే నన్ను కన్నదంట ఇన్నాళ్ళు నేనేం అడిగినా కాదనకుండా చేసి పెట్టింది కొనిచ్చింది బళ్ళో వేసింది. ఇప్పుడు నేను ఇలా అయ్యాను అని తెలిస్తే అమ్మను అందరూ సుతి పోటీ మాటలు అంటారు . నీ కొడుకు కొజ్జా అంట గదా అని అందరూ అంటుంటే ఏ తల్లి మాత్రం తట్టుకుంటుంది. ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచుతే నేనిప్పుడు మగాడి నీ కాదు కొజ్జా అని తెలిస్తే ఆమె గుండె పగలదా ? ఎంతైనా ఆడది తాను చనిపోతే నలుగు సార్లు ఏడ్చి మర్చిపోతుంది కానీ తన ఎదురుగా ఉండి ఆమెని బాధ పెట్టె బదులు చనిపోవడం నయం అవును చనిపోవాలి అని నిర్ణయించుకుని తిడుతున్నా తల్లిని ఆఖరు సారి  కళ్ళ నిండా చూసుకుని బయటకు బయలుదేరింది కళ్యాణి అనబడే కళ్యాణ్ ..

ఏడికే పోతున్నావు నా ఇజ్జత్ తియ్యకే ఆగే అంటున్నా కూడా పట్టించుకోకుండా పోతున్న తనని చూస్తూ ఆ ఇనకు నా మాట ఎందుకు ఇంటావు నా ఇజ్జత్ తియ్యనికే పుట్టినావు రా కడుపుల కాలితే నువ్వే అస్తవు పో పో ఆకలి తో సావు పో అంటూ ముక్కు చిదుతూ , ఏడుస్తూనే ఉంది కమలమ్మ .

ఛి నా తల్లే నన్ను కాదు అనుకున్నాక ఇగ నేనెందుకు బతుకుడు ఛి సావే  నాకు దిక్కయ్యింది ఎందుకు పుట్టానో ఏంటో ఇట్లా నాకే ఎందుకిట్లా గావలె  ఇట్లా అయితే నేను మనిషిని కాకుండా పోతనా నాకంటూ కోరికాలెం ఉండవా అది ఇట్లా పుట్టడం నా తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంది అవ్వ ,నేను సాస్త పో ఇంటికే రాను ఇగ అయిపోయింది నిన్నెవలు ఏం అనరు పోతన్నా నేను సస్తే నీకేం బాధ ఉండది ఇగ ఒక్కదానివే ఉండు అని గునుక్కుంటూ రైలు పట్టాల మీదికి పోయి వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్ళాడు కళ్యాణ్ అనబడే కళ్యాణి  అప్పుడే ఒక చేయి తనని ఆపింది అది ఎవరో కాదు అన్నేమ్మ.

ఆ రోజు అన్నేమ్మ నన్ను కాపాడక పోయి ఉంటె ఈ రోజు ఈ కళ్యాణి ఉండేది కాదు ఇప్పుడిలా మీ ముందుకు వచ్చి మాట్లాడేదాన్నికాదు. ఆ రోజు అన్నేమ్మ నన్ను ఆపి ఏం చెప్పిందో తెలుసా అంటూ ఆ రోజులని గుర్తుచేసుకుంది కళ్యాణిబిడ్డా ఎందుకు సస్తావు నిన్ను తిట్టిన వాళ్ళను వద్దు అనుకున్న వాళ్ళను నువ్వు పుట్టినందుకు ఇట్లా మారినందుకు నీ తప్పేo లేదని మల్లా నీ దగ్గరికి వచ్చేలా చేసుకో , మనిషి జన్మ ఉత్తమమైనది దేవుడు మనల్ని పుట్టించిండు అంటే మన వల్ల లోకానికి ఏదో ఒక  ఉపయోగం ఉండడానికే గందుకే నువ్వు సావకూడదు బతకాలి బతికి ఏదైనా సాధించాలే బిడ్డా పా నేను నిన్ను తోల్కబోతా నా ఇంట్ల ఆ పని ఈ పని సెయ్యి నిన్ను సదివిస్తా అంటూ నేను పడబోయిన రైల్లోనే  నన్ను ముంబాయి తీసుకుని వెళ్లి చదివించింది . ఆమె దయ వల్లనే నేను ఈ రోజు పెద్ద బిజినెస్ ఉమెన్ అయ్యి నాలాంటి వారందరికి ఉద్యోగాలు ఇస్తూ అందరి మనస్సులు గెలుచుకున్నా, “నేను మనిషేనే” అనిపించుకున్నా ,

ఇప్పుడు చెప్పండి మనందరం ఏవేవో సమస్యలు చుట్టూ ముడుతున్నాయని అందరూ తిడుతున్నారని అనుకుంటూ జీవితం మీద విరక్తి పెంచుకుని చనిపోవాలని అనుకుంటాం ఆవేశం లో ప్రాణాలు తీసుకోవడం చాలా సులువు కొన్నాళ్ళకు అందరూ మనల్ని మర్చిపోతారు కానీ అదే ఆవేశం తగ్గించుకుని కొంత ప్రశాంతంగా ఆలోచిస్తే ప్రాణాలు తీసుకోకుండా ఏదో సాధించాలి అనే నిర్ణయం తీసుకుని ముందుకు నడవాలి అప్పుడే మన జన్మ ధన్యం అయినట్టు ఇది ఒక్క మనకే కాదు ఆవేశం లో ప్రాణాలు తీసుకునే వారందరికి నా కథ ఒక స్పూర్తిగా ఉండాలని మీతో పంచుకున్నా ఇప్పుడు నా తల్లి నన్ను విడిచి ఒక్క క్షణం ఉండదు . ఇదిగో ఇవిడే నన్ను కన్నతల్లి అయితే నన్ను పెంచిన తల్లి ఈవిడ అంటూ ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంది కళ్యాణి .

ఇంతకీ నన్ను ఇంతగా మార్చిన అన్నేమ్మ  ఎవరో కాదు కోనేళ్ళ క్రితమే మనలాగా పుట్టి మనలాగా మాటలు పడి ఎన్నో కష్టాలు పడి చివరికి నేనూ మనిషినే అని గుర్తించి జీవితం లో తానూ పైకి రాకపోయినా మనలాంటి వారందరికి పెద్ద దిక్కులా మారిన ఇంకొక హిజ్రానే అన్నేమ్మ .. ఆమెని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ తన కథను చెప్పిన కళ్యాణి భారతదేశం లోనే  ఇప్పుడొక పెద్ద బిజినెస్ గా చక్రం తిప్పుతూ తనలాంటి హిజ్రాలకు జీవితాన్ని ఇస్తున్న స్ఫూర్తి ప్రధాత …

    ఈ కథ కొందరికైనా ఉపయోగపడాలని ఆశిస్తూ….

                                                                       —–మీ భవ్య చారు…

Related Posts

1 Comment

  1. Variety సబ్జెక్టు good

Comments are closed.