పెండ్యాల వరవర రావు

పెండ్యాల వరవర రావు(విప్లవ రచయిత)

పెండ్యాల వరవర రావు అందరికీ వి.వి.గా సుపరిచితుడు. ఆయన నవంబర్ 3, 1940లో వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల అనే గ్రామంలో జన్మించాడు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. వరవర అంటే శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం.
నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన సృజన పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుండి 1992 వరకు 200 సంపుటులుగా అచ్చు అయిన సృజన, ప్రభుత్వము నుండి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. వి.వి. జైల్లో ఉన్న సమయంలో సృజనకి ప్రచురణకర్తగా ఆయన భార్య హేమలత వ్యవహరించింది. ఆమెకు కూడా 1978, 1984లో జైలు జీవితం చవిచూడక తప్పలేదు.

జనవరి 1970లో తోటి కవులతో స్థాపించిన తిరగబడు కవులు కొన్నాళ్లకే విప్లవభావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి 1970 జూలై 4 న విప్లవ రచయితల సంఘం (విరసం) గా అవతరించాక, తెలుగు సాహిత్య రంగంలో ఒక విప్లవ కెరటమై ఎగసింది. ఆయన ప్రారంభదశనుండి నేటి వరకు విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా కూడా ఉన్నాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. విరసం 35 సంవత్సరాలుగా రచయితలు, మేధావులు, విద్యార్థులు, యువకులకు స్ఫూర్తినిస్తూ, వారిని ప్రభావితం చేస్తూ, తెలుగు భాషలో విప్లవోద్యమమై నిలిచింది. వి.వి. విప్లవోద్యమంతో పాటు, సాహిత్య రంగానికి కూడా చాలా దోహదపడ్డాడు.
రెండు దశాబ్దాల పాటు ఎన్నో కేసులలో వీరిని నిందితులుగా చేర్చారు. 1980 లలో ఆయన ప్రాణానికి కుడా ముప్పు కలిగింది. మొత్తం మీద 18 కేసులు పెట్టగా, 1973 నుండి దాదాపు 6 సంవత్సరాలు జైల్లోనే గడిపారు. 1985-89 లో రాం నగర్ కుట్ర కేసు, సికింద్రాబాద్ కుట్ర కేసులో, శిక్ష అనుభవించాడు (‘one thousand days and nights of solitary confinement’). 1986లో టాడా (TADA) చట్టం కింద మోపబడిన రాం నగర్ కుట్ర కేసు ఇంకా కోర్టులోనే ఉంది. మిగిలిన 17 కేసులలో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది.

రచనలు
కావ్యము
విప్లవ సాహిత్యోద్యమంలో భాగంగా 9 పద్యసంకలనాలు, ఇరాక్ యుద్ధం పై రెండు బుల్లి పస్తకాలు ప్రచురించాడు.
చలినెగళ్లు (1968)
జీవనది (1970)
ఊరేగింపు (1973)
1973 అక్టోబరు నుండి నవంబర్ వరకు MISA చట్టం కింద నిర్బంధించబడి వరంగల్లు జైలులో ఉన్నపుడు వ్రాసిన కవితలు.

పురస్కారాలు
1968లో చలినెగళ్ళు గంథానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది.

శాంతి దూత
జూన్ 2002 లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం CPI-ML (పీపుల్స్ వార్) తో శాంతి చర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ఆయన ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించాడు. తెలుగుదేశం ప్రభుత్వంతో జరిగిన ఆ శాంతి చర్చల ప్రయత్నం ఆది లోనే విఫలమయింది.
మరలా 2004-2005 లో కాంగ్రెసు ప్రభుత్వం పీపుల్స్ వార్ తో శాంతి చర్చలు జరపాలని నిర్ణయించినపుడు ఆయన మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించాడు. 2004 లో మొదలయిన చర్చల ప్రయత్నం ఒక విడత చర్చల అనంతరం 2005 ఆగస్టు 18 న CPI (మావోయిస్టు), విరసం, ఇతర ప్రజాసంఘాలపై నిషేధంతో ముగిసింది.

విరసంపై నిషేధం విధించిన 24 గంటలలోనే 2005 ఆగస్టు 19 తెల్లవారు జామున అయిదున్నర గంటల ప్రాంతంలో వరవర రావును మలక్ పేటలోని ఆయన ఇంట్లో అరెస్టు చేసారు.
అరెస్టు చేసినప్పటినుండి ఇప్పటివరకు ప్రభుత్వం ఆయనపై మొత్తం 9 కేసులు పెట్టి ఆయన జైలు రిమాండును పొడిగిస్తూనే ఉంది. ప్రస్తుతం (నవంబర్ 15 నాటికి) ఆయనను చంచల్ గూడ జైలులో ఉంచారు

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *