బాషా- పువ్వులు పార్ట్ -5

అరేయి బాషా ఎన్ని రోజులు ఇలా కష్టపడుతూ పువ్వులు అమ్ముకోవలె రా నాకు అయితే చాలా కష్టం గా ఉంది రా మా నాయన పక్షవాతం తో మంచం లో ఉన్నాడు, మా ఇద్దరు అక్కలకు పెళ్ళి చేయాలే ఇగ అమ్మకు అయితే టి. బి తో తెల్లందాక దగ్గుడే పొద్దంతా కష్టపడితే ఇగ నాకు ఈ పువ్వులు అమ్ముతే నాలుగు వందలు కూడా వస్తలేవు ఏం చేయాలో అర్ధం అయితలేదు చల్ నీ యవ్వ అన్ని మనకే వస్తాయి ఏందిరా మనమే ఇట్లా ఉన్నాం అంటే మనకంటే పేదోల్లు ఇంకెన్ని కష్టాలు పడుతున్నారో ఈ పెదోని కడుపుల పుట్టే బదులు సచ్చుడు నయం రా అయ్యా  నేను ఈ బాధలు పడలేను రా  ఈ సంసారం ఇదుడు  నా వల్ల అయితలేదు .

నాకు ఇంకో అన్న ఉన్నా మంచిగుండు నేనేదో పెద్ద మొగొన్ని అని నా మీద ఈ బాధ్యతలు అన్ని పెట్టిండ్రు నేనేమన్నా అన్నిట్లా అరితెరినోన్నా , నువ్వే సుసుకోవాలి నువ్వే నడపాలి అని అంటూ నా మీద మొత్తం రుద్దుతే నేనేం చేస్తా నేనేదో వయస్సు ఎక్కువున్నోనా ఏందా నీకంటే నాలుగు ఏళ్ళు పెద్దోన్ని గంతే కదా నాకేం కొమ్ములు ఉన్నాయా మొగోడు అనంగానే బాధ్యతలు నెట్టి మీద ఎసుకోవలనా , పాపం మా అక్కలు కూడా ఎంతో కొంత కష్టపడుతున్నారు పువ్వులు అల్లుతా కానీ ఎంతైనా సాలడం లేదు .అరేయి బాషా ఒక్కటి చెప్తారా పుడితే మంచి ధనవంతుడి ఇంట్లో అయినా పుట్టలే.

లేకపోతే అసలు ఏం గతి లేని ఇంట్లో అడుక్కు తినే ఇంట్లో అయినా పుట్టలే కానీ ఇగో ఇట్లా మధ్యతరగతి ఇంట్లో అసలే పుట్టకుడదు రా బై నేను ఈ భాదలన్ని పడలేను ఇగ సావుడే నాకు మార్గం కానీ నువ్వు మాత్రం మస్తు పైసలు సంపాదించాలే నా లెక్క బాధ పడకూడదు, నేను అన్నిటికి భయపడతాను కానీ నువ్వు భయపడకుండా తప్పుచేసే ఎలాగైనా డబ్బు సంపాదించాలి కానీ అది ఎవరి కడుపు కొట్టి కాకుండా నీతి గా సంపాదించాలి దొంగతనం అల్లా సహించడు కానీ ఇంకేదైనా అలోచించి నువ్వు బాగా పైసల్ సంపాదించి నీ వాళ్ళను మంచిగా సుసుకోరా అంటున్న ఫకీర్ నీ విస్తుపోయి చూస్తూ నిలబడ్డాడు బాషా ..

అయితే అతని చిన్న మెదడుకు కొన్ని మాటలు అర్ధం కాలేదు కానీ ఫకీర్ బాధ మాత్రం అర్ధం అయ్యింది, ఎందుకంటే ఇద్దారు ఒకే వృతి లో ఉన్నారు రోజు కలిసే వెళ్లి గల్లిల్లో పువ్వులు అమ్ముతూ జీవనం సాగిస్తారు , ఫకీర్ తండ్రి కి పక్షవాతం రావాడం తో ఇంటికే పరిమితం అయ్యాడు, ఇక బాషాకు తండ్రి ఉన్నా లేనట్టే తాగుబోతు తల్లిని బాగా కొడతాడు. దాంతో ఇంట్లో వారిని చూసుకోవడం ఇద్దరి మగ పిల్లల మీద పడింది దాంతో వాళ్ళు చిన్న వయస్సులోనే అంటే ఫకీర్ కి పద్నాలుగేళ్ళు, బాషా కు ఎనిమిదేళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు కుటుంబం కోసం పాటు పడడం మొదలు పెట్టారు. ( ఇక్కడ కొందరికి అనుమానం రావచ్చు అంత చిన్న వయస్సులో ఏం తెలుస్తుంది ఎలా సంపాదిస్తారు అని కానీ అనుభవం అన్ని నేర్పుతుంది అది పిల్లలు అని, పెద్దవాళ్ళు అనే తేడా లేదు. అది అర్ధం చేసుకుంటారనే అనుకుంటున్నా )..

ఫకీర్ కళ్ళు తుడుచుకుంటూ రేయి బాషా నేను ఉన్నా లేకున్నా ఒకటి గుర్తు పెట్టుకో డబ్బు కావాలి దేనికైనా కానీ అది న్యాయంగా సంపాదించాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు కూడా ఎవరికీ హాని చెయ్యకుండా సంపాదించేలా చూసుకో సరేనా ..

మీ అమ్మను, చెల్లెళ్ళను అందరిని బాగా చూసుకోరా మరి పోదాం పా అన్నాడు ఫకీర్ బాషా తో అతని మాటలు అర్ధం కాకపోయినా కళ్ళలో నీళ్ళు చూసి అర్ధం చేసుకుని అన్నా నువ్వు అట్లా అనకే నేను బాగా పైసల్ సంపాదించి నిన్ను పెద్దమ్మను బాగా చూసుకుంటాను, మనకు మస్తు పైసల్ తెస్తా అని అంటున్న బాషా నీ హత్తుకుని నువ్వైనా నన్ను అర్ధం చేసుకున్నావు రా.. ఆ మాట అన్నావు చాలు మరి ఇగ పోదాం పా అమ్మ ఎదురు చూస్తాది అని అంటూ ఇద్దరూ ఇంటి బాట పట్టారు..

కొన్నిరోజులు అలాగే గడిచాయి. ఒక రోజు బాషా తాతయ్య చనిపోయాడని తెలిసి  తల్లి తో కలిసి అంతా చివరి సారి తాతయ్యను  చూడడానికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాడు బాషాకుటుంబం తో సహా .. అయితే అక్కడ తండ్రి బాగా తాగి గొడవ చేయడం తో అతన్ని తీసుకుని తల్లిని, అక్కలను అక్కడే ఉంచేసి మళ్ళి తమ ఊరికి వచ్చిన బాషాకు ఫకీర్ కుటుంబం సాముహిక ఆత్మహత్యలు దర్శనం ఇచ్చాయి. వాళ్ళని అలా విగత జీవులుగా చూసి షాక్ అయ్యాడు.

ఇన్నిరోజులు తన పక్కనే ఉండి తనతో మాట్లాడుతూ నవ్వుతూ తిరిగిన వాడు తననీ ప్రేమగా పిలిచేవాడు, ఏదైనా కొనుక్కున్నా,ఇంట్లో చేసుకున్నా ప్రేమగా తనకు దాచి తెచ్చి ఇచ్చేవాడు. ప్రతి జుమ్మాకు ఇద్దరూ కలిసి మసీదుకు వెళ్ళేవాళ్ళు, అక్కడ కొబ్బరి స్వీటుకొనిచ్చే తన నేస్తంలాంటి అన్న, తనకున్న ఒక్కగానొక్క మిత్రుడు ఇలా అకస్మాత్తుగా చావడం అది కూడా బలవంతంగా అలాగే చూస్తూ నిలబడిన బాషాకు పక్కనున్న ఎవరి మాటలో లీలగా వినిపిస్తున్నాయి.

పాపం చిన్న పిల్లగాడు ఒక్కడే ఎంతని గుంజుకోస్తాడు. వాళ్ళ సేటు దగ్గర తండ్రి కోసం అప్పు చేసాడు. వాడేమో ఇవ్వమని ఒకటే సతాయింపు పాపం పదివేల అప్పును ఇరవై అయిదువేలు చేసిండు ఒక్క పోరడు ఎంతని కడుతాడు. ఎమన్నా అనుభవం ఉన్నోడా, పిల్లల తండ్రి కే చేతకాక సతమతం అయితుంటే ఇప్పుడు గీ పోరడు ఏం చేస్తాడు. ఇవ్వని బాధలు ఉన్నాయనే ఉన్న తానోక్కడు పోతే అప్పు తల్లిదండ్రి, అక్కల మీద పడితే కష్టం అని నిన్న బిర్యానిల పురుగుల మందు కలిపి తెచ్చి అందరికి తినవేట్టిండు అంట అందుకే అందరూ ఒకేసారి పోయారు.

ఇంత కష్టం ఏ పగోనికి కూడా రావద్దు,ఆ సేటు పైసల్ అడగకపోతే ఏం బాయే వానికి మస్తు ఉంది కదా ఉన్నోనీకె మల్ల మల్ల కావాలి పాపం పాలుగారే పిల్లోడు ఏం చేస్తాం పాపం అనుకునుడు తప్ప అంటూ మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలు వింటున్న బాషా మనసులో ఒక అగ్నిగోళం బద్దలు అయ్యింది.తానూ ఎదో ఒకటి చేయాలి అని గట్టిగా  అప్పుడే నిర్ణయించుకున్నాడు.. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి ? ఇది ఎంత వరకు పోతుంది ? బాషా ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు  ? చదవండి తదుపరి భాగం లో …..

 

Related Posts