మనిషికి మనిషే బలం

అక్షర కొరకు
అంశం :⁠- చిత్ర కవిత
తేది:⁠- 30/04/2026
శీర్షిక:⁠- మనిషికి మనిషే బలం

ఎండ మండుతున్న మధ్యాహ్నం… ఆకాశం నీలంగా మెరిసినా,భూమి మాత్రం తట్టుకోలేని వేడితో పొగలు కక్కుతున్నట్టుంది.ఆ గ్రామం చివరనున్న పాత బజారు వద్ద ఒక వృద్ధుడు నెమ్మదిగా నడుస్తున్నాడు.అతని పేరు రామయ్య.

రామయ్య వయసు ఎనభై దాటింది. శరీరం ఎముకలతో మాత్రమే మిగిలినట్టు సన్నగా ఉంది. కాళ్లు వణుకుతున్నాయి, కళ్లలో నీళ్లు ఆగకుండా జారుతున్నాయి. కానీ అతని భుజంపై ఉన్న భారమే అతని జీవితం మొత్తం చెప్పేస్తోంది , ఒక మృతదేహం.
అది అతని భార్య లక్ష్మమ్మది. లక్ష్మమ్మతో రామయ్య జీవితం చిన్నదైనా, ఎంతో ప్రేమతో నిండిపోయింది. ఇద్దరూ కలిసే కష్టపడ్డారు, కలిసే నవ్వుకున్నారు. పిల్లలు లేరు. కానీ , ఒకరికొకరు ప్రపంచమే అయ్యారు. కాలం మారింది ఆరోగ్యం క్షీణించింది. చివరకు ఒక రోజు లక్ష్మమ్మ ఈ లోకాన్ని విడిచిపోయింది.
ఆమె చనిపోయిన తర్వాత రామయ్య ముందు ఒక పెద్ద ప్రశ్న నిలిచింది.
“ఆమెకు అంతిమ సంస్కారాలు ఎలా చేయాలి?”
గ్రామంలో ఎవరూ దగ్గరకు రాలేదు? పేదరికం, వృద్ధాప్యం ఇవన్నీ చూసి వాళ్లు దూరంగా వెళ్లిపోయారు.
“మనం ఎందుకు ఇబ్బంది పడాలి?” అన్నట్టు తలలు తిప్పుకున్నారు. కొందరు సానుభూతి చూపినా, సహాయం చేయడానికి ముందుకు రాలేదు. రామయ్య మాత్రం వెనక్కి తగ్గలేదు.
“నేను ఉన్నాను కదా! నేను చేస్తాను” అని తన మనసుకు ధైర్యం చెప్పుకున్నాడు.
అతను తన చేతులతో లక్ష్మమ్మను ఒక గుడ్డలో చుట్టాడు. కన్నీళ్లు ఆగలేదు.
“నువ్వు నాకు అన్నీ ఇచ్చావు. ఇప్పుడు నేను నీకు చివరి విధి చేయలేకపోతే, నా జీవితం వ్యర్థం అవుతుంది” అని ఆమెతో మాట్లాడుకుంటూ భుజంపై ఎత్తుకున్నాడు.
గ్రామ వీధుల్లో అతను నడుస్తూ పోతున్నాడు. ప్రతి అడుగు భారంగా ఉంది. శరీరం అలసిపోయినా, మనసు మాత్రం ఓటమి ఒప్పుకోలేదు. కొందరు అతన్ని చూస్తూ నిలబడ్డారు, కానీ ఎవరూ ముందుకు రాలేదు?
సూర్యుడు మండిపోతున్నాడు. నేల వేడిగా ఉంది. కానీ రామయ్య అడుగులు ఆగలేదు. ఒక చిన్న బాలుడు ఈ దృశ్యం చూసి తన తండ్రిని ,
“నాన్నా, ఆ తాతయ్య ఎందుకు ఒంటరిగా ఇంత భారాన్ని మోస్తున్నాడు?” అని అడిగాడు.
ఆ ప్రశ్న తండ్రి గుండెల్లో తగిలింది. వెంటనే అతను ముందుకు వచ్చి,
“తాతయ్య! నేను సహాయం చేస్తాను” అని చెప్పాడు. అతనితో పాటు మరికొందరు కూడా ముందుకు వచ్చారు.
చివరకు రామయ్య ఒంటరిగా లేడు.
అందరూ కలిసి లక్ష్మమ్మకు గౌరవంగా అంతిమ సంస్కారాలు చేశారు. రామయ్య కళ్లలో ఇంకా కన్నీళ్లు ఉన్నా, మనసులో మాత్రం ఓ తృప్తి కనిపించింది.
“మనిషి పేదవాడైనా ప్రేమలో ధనవంతుడవుతాడు. కానీ , సమాజంలో మనిషిగా ఉండాలి” అని రామయ్య నెమ్మదిగా అన్నాడు.
ఆ గ్రామ ప్రజలందరికీ మనిషికి మనిషే బలం. సహాయం చేయడానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఎవరి భారమూ ఒంటరిది కాదు అని తెలుసుకున్నారు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *