జీవితంలో మరిచిపోలేని మా మాష్టారు……!!
నేను హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు సబ్జెక్టు బాలనర్సయ్య సారు బోధించే వారు. ఆయన పిల్లలకు ఇంగ్లీషు బాగా రావాలనే కాంక్ష మెండుగా ఉండేది. చాలా చక్కగా బోధించే వారు.
కాని పిల్లల నుండి తగిన స్పందన రాబట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసేవాడు.అందుకు ఆయన బెత్తంగా పశువులను కొట్టే దుడ్డు కర్రను ఉపయోగించేవాడు .
ఆ రోజుల్లో ఎలాగైనా ఇంగ్లీషు చదవడం రాయడం నేర్పాలని ఆయన సదుద్దేశం. ప్రతి పదాన్ని స్పష్టంగా పలుకుతూ అర్థయుక్తంగా పాఠాలను బోధించేవాడు. కాని అతను రాయించిన పదాలకు అర్ధాలు ,వాటికి స్పెల్లింగ్ ఇంటి వద్ద బైహార్ట్ చేసుకుని రమ్మనే వాడు. అలాగే పాఠం ప్రతి రోజు చదివించేవాడు .
చదువరాని పిల్లలను దుడ్డుకర్రతో వీరబాదుడు .పిల్లలు బొబ్బలు పెట్టేవాళ్ళు . ఇంగ్లీషు పదాలకు అర్ధాలు ,స్పెల్లింగ్ రాకపోయినా బాదుడే .పిల్లలు ఆయన క్లాసులో అల్లల్లాడి పోయేవాళ్ళు. మా తరగతిలో ఒకతను వాకింగ్ అనే పదాన్ని డబ్ల్యు ఏ ఎల్— వాల్ ,కే ఐ ఎన్ జి– కింగ్ ,వాల్ కింగ్ అని చదివాడు .తరగతిలో అందరూ బిగ్గరగా నవ్వారు.ఇంకేముంది వీరబాదుడు .హెల్ కు వ్యతిరేక పదం ఏమిటి అని అడిగాడు. ఇనుహెల్ అన్నాడు. చివరకు హెవెను అని ఒకతను చెప్పాడు.
ఆ రోజుల్లో ఆ మాష్టారు దండన మహా భయంకరంగా ఉండేది. ఆ భయంతో ఇంగ్లీషు చదవడం,రాయడం ఎనిమిదవ తరగతి లోనే నేర్చుకున్నాము.చదివే వాక్యాల అర్థం కూడా తెలిసేది.మాకు ఇంగ్లీషు పునాది వేసింది ఆయనే. నేను జీవితంలో మరువగారాని మా మాష్టారు.
అపరాజిత్
సూర్యాపేట