మల్లన్నలో మార్పు
"ప్రతిరోజు నేను పని చేసి రావడం , ఆ డబ్బులు నువ్వేమో తీసుకొని వెళ్లి ఆ బెట్టింగులు ఆడడం , నువ్వు తీసుకెళ్లిన డబ్బులు అలాగే పోతున్నాయే గాని ఒక్క రూపాయి అయినా వచ్చిందా! నా మాట వినయ్యా నాతో పాటు పనికిరా! మనం సంతోషంగా ఉందాం! మన బిడ్డని బాగా చదివిద్దాం" అని అంది రాజమ్మ.
“ఏంటే! చాలామందికి అక్కడ బెట్టింగ్ కాస్తుంటే… ఎంతమందికి ఎన్ని డబ్బులు వస్తున్నాయో తెలుసా? చూడవే ఈసారి డబ్బులు వస్తాయి. అప్పుడు నా కూతుర్ని గొప్ప చదువులు చదివిస్తాను”అని గర్వంగా చెప్పి రాజమ్మ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు మల్లన్న.
వెళ్తున్న మల్లన్నని చూసి తల కొట్టుకొని కింద కూర్చొని ‘అయ్యో దేవుడా! ఈ మనిషికి ఎలా చెప్పాలి?’ అని ఏడుస్తూనే ఉంది రాజమ్మ.
అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన చిట్టి ,
“అమ్మ! సాయంత్రం మనం సినిమాకి వెళ్దామా! నా స్నేహితులు వాళ్ళ తల్లిదండ్రులతో… వెళ్లారు ఆ సినిమా చాలా బాగుంది అంట” అని నవ్వుతూ చెప్పింది.
ఆ మాటలకు ఏడవ లేక కోపం తెచ్చుకొని ,
స్కూల్ నుంచి ఇప్పుడే కదా వచ్చింది వెళ్ళు లోపలికి!” అని గట్టిగా అరిచింది రాజమ్మ.
దాంతో…
“సరే అమ్మ..!” అని దిగులుగా చెప్పి లోపలికి వెళ్లిపోయింది చిట్టి.
ప్రతిరోజు ఇలాగే జరగడంతో… ఒకరోజు మల్లన్న ఇంటికి వచ్చేసరికి తన భార్య బిడ్డ కనిపించరు. తెలిసిన వాళ్ళని అడిగితే… మాకు తెలీదు అని అన్నారు.
ప్రతిరోజు రాజమ్మ , వీరమ్మ తో… పనికి వెళ్ళేది తనని అడిగితే…
“ఏమో తెలియదు అన్న! కానీ , తన బిడ్డను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నా?” అని నాతో అంది అన్న.
ఆ మాటకు ఆశ్చర్యపోయి ,
“ఎక్కడికి వెళ్తానన్నారు…?”అని కంగారుగా అడిగాడు మల్లన్న.
“ఏమో అన్న! నీలో మార్పు ఇంక రాదని ఎక్కడికో నిన్ను వదిలి దూరంగా వెళ్లిపోతాను?” అని అంది అని బాధగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది వీరమ్మ.
“ఆ వెళ్ళిపోతే… వెళ్ళిపోని రేపు ఆ బెట్టింగ్ లో నాకు డబ్బులు వస్తే తానే వస్తుందిలే” అని అనుకోని ఇంటికి వెళ్ళాడు మల్లన్న.
కాసేపు పడుకున్నాడు. ఆ తర్వాత ఆకలి వేస్తుందని వంట గదిలోకి వెళ్లి చూస్తే ఏమి కనిపించలేదు?
తనకొచ్చిన వంట వండి ఏదో చప్పగా తిన్నాడు? అలా వారం రోజులు గడిచిపోయాయి. రాజమ్మ తన బిడ్డ ఎక్కడున్నారు జాడలేదు?
అదే రోజు ఉదయం వీరమ్మ వచ్చి ,
“అన్న… అన్న నాకు ఒక చిన్న సహాయం కావాలి” అని అడిగింది.
“ఏం కావాలో చెప్పమ్మా…?” అని అడిగాడు మల్లన్న.
“మా మేస్త్రి వస్తుండగా… యాక్సిడెంట్ అయ్యింది. అర్జెంటుగా ఆ పని చేయాలని ఆ ఇంటి యజమాని అంటున్నారు. కానీ , ఎవరికి చెప్పాలో తెలియట్లేదు అన్న? మీరైతే… ఈ రెండు రోజులు రెండు అన్న , తర్వాత పని పూర్తయితే… మీ డబ్బులు మీకు వస్తాయి” అని చెప్పింది వీరమ్మ.
ఇంట్లో వారం రోజుల నుంచి ఏదో వండుకోవడం , తినడం లేదంటే… పడుకోవడం ఇలాంటివే చేస్తున్నాడు అందుకే ఎందుకో పనికి వెళ్లాలనిపించి వీరమ్మతో పనికి వెళ్ళాడు?
రెండు రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని వచ్చి ,
“పని బాగా చేశావయ్యా! నిన్ను ఎప్పుడూ చూడలేదు? అని చెప్పి , నవ్వుతూ మల్లన్న కూలి డబ్బులతో… పాటు ఒక 500 కలిపి ఇచ్చాడు ఆ యజమాని.
ఆ డబ్బుల్ని చూడగానే… వెంటనే రాజమ్మ తన బిడ్డ చిట్టి గుర్తుకొచ్చారు.
యజమాని వెళ్లిపోగానే వీరమ్మ , మల్లన్న దగ్గరికి వచ్చి ,
“అన్న! ఇన్ని రోజులైతే… రాజమ్మ డబ్బులు ఇచ్చేది. నువ్వు బెట్టింగ్ ఆడటానికి కానీ , ఇప్పుడైతే… నువ్వే సంపాదించుకున్నావు. ఈ డబ్బులు పెట్టుకొని ఇంకా చాలా డబ్బులు సంపాదించుకో” అని వెటకారంగా నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది.
ఆ మాటలకు మల్లన్న ఆలోచనలో పడ్డాడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే తన బిడ్డ చిట్టి…?
“నాన్న! నా కోసం ఏం తీసుకొచ్చావ్?” అని అడుగుతూ ఉండేది.
రాజమ్మ కోపంతో…
“మీ నాయన! నిన్ను బాగా చదివించాలని రాత్రి పగలు పనికి వెళ్తున్నాడు తల్లి” అని చెప్పింది.
ఆ మాటల్ని పట్టించుకోకుండా కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోయి మరుసటి రోజు ఉదయమే బెట్టింగ్ ఆడటానికి వెళ్లిపోయేవాడు.
అది గుర్తు తెచ్చుకొని తన కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి.
తన భార్య బిడ్డ ఎక్కడున్నారో వెతకడం మొదలుపెట్టాడు?
రెండు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్తూ ఉండగా…
ఒక చిన్న అమ్మాయి వచ్చి మల్లన్న కౌగిలించుకొని ,
“నాన్న! ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు?” అని అడిగింది చిట్టి.
“చిట్టి రా ఇంటికి వెళ్దాం..!” అని కోపంగా తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది రాజమ్మ.
‘ఇంక నా పైన కోపం తగ్గలేదు!’ అనుకుంటాను అనుకుంటూ వాళ్ళ వెనకాలే వెళ్ళాడు మల్లన్న.
చిట్టిని తయారుచేసి స్కూలుకి పంపించేసింది. తాను పనిచేసిన డబ్బులు రాజమ్మ చేతిలో పెట్టి ,
“ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టనే రాజా? నీతో పాటు పనికి వస్తానే మనిద్దరం పని చేసుకుందాం! నాకు చెప్పకుండా ఇన్ని రోజులు ఏడికి వెళ్ళిపోయావే?” అని బాధగా అడిగితే…
“ఏ చనిపోయాను అనుకున్నావా? నాకు అంత ధైర్యం లేదయ్యా! ఎందుకంటే… నా కూతురే నా ధైర్యం అందుకే తనను చదివించుకుంటూ నేను బ్రతుకుతున్నాను. నువ్వు ఎలాగైనా బ్రతుకు? అని కోపంగా అంది రాజమ్మ.
“ఒక వారం రోజులు నన్ను చూడవే. ఆ తర్వాత… నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకో”అని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు మల్లన్న.
“సరే చూద్దాంలే! నాకు టైం అవుతుంది నేను పనికి వెళ్లే వస్తాను”అని అంటుంటే…
“రాజా! నేను వస్తాను” అని చెప్పి తన వెనకాలే బయలుదేరాడు మల్లన్న.
మల్లన్న చేస్తూ చేసిన పనిని యజమానులు మెచ్చుకోవడం చూసి ఆనంద పడింది లోలోపల రాజమ్మ.
తను చేసిన పని డబ్బులతో… కూతురికి బొమ్మలు బట్టలు అన్నీ కొని పెట్టేవాడు.
ఆ తర్వాత ఎన్ని సార్లు బెట్టింగ్ కి రమ్మని చెప్పిన కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా తన కుటుంబాన్ని చూసుకుంటూ ఆనంద పడుతున్నాడు మల్లన్న.
కొన్ని రోజులకు రాజమ్మ కూడా మల్లన్న క్షమించి తనకి దగ్గరయింది. తన భర్తలో మార్పు రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అలా తన భార్యని , బిడ్డని చూసుకొని రోజులు గడుపుతున్నాడు మల్లన్న.
మద్యం , పేకాట , బెట్టింగ్ అనే వాటికి బానిసైతే ఎప్పటికీ బయటపడలేము? ఆ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు అనుకుంటారు. కానీ , దాంట్లోనే నష్టపోతున్నారు. అది తెలుసుకోలేకపోతున్నారు , అది తెలుసుకొని కుటుంబాన్ని బాగా చూసుకోండి.
మాధవి కాళ్ల