మల్లమ్మ (ఒక ఊహ జనిత కథ )

హాయ్ అండి, నా పేరు చందు నేను ఈ రోజు మీకు మల్లమ్మ గురించి కొన్ని విషయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను.ఈ మల్లమ్మ ఎవరు ? ఆమెకు నాకు సంభంధం ఏమిటీ ? ఆమె గురించి మాకెందుకు చెప్పడం అని మీ అనుమనo కదా అయితే చెప్తా ,నేను మల్లమ్మ ముని,ముని ముని మనుమన్ని,అందరూ ఆమెకు బంధువులే కదా, అయితే ఈ మల్లమ్మ ఎవరు చెప్పు తొందరగా అని అంటున్నారని నాకు తెలుసు…

ఇప్పుడు మీరంతా బతుకమ్మ ఆడుతూ ఆమెని తొమ్మిది రోజులు పువ్వుల తో పూజిస్తారు కదా,ఆమెనే మన మల్లమ్మ మా మత్తత్తమ్మా ఆమె అసలు పేరు మల్లమ్మ ఆమె గురించి చాల మంది చాలా కథలు చెప్తారు.చెప్పారు కూడా అయితే ఆ కాలం లో ఏమి జరిగి ఉంటుంది అని నేను ఉహించుకున్న కథను,ఆమె ధైర్యం, తెగువ లను చెప్పడానికి మాత్రమే వచ్చా, ఇది కేవలం నా ఊహ మాత్రమే ఇలా జరిగి ఉంటుందా అని అనుకుని రాసిన కథనే మీకు చెప్తున్న వినండి మరి….

ఆమె పేరు మల్లమ్మ,పల్లెటూరి ముగ్ధ,పల్లె పడుచు,అమాయకమైన అతివ,తల్లిదండ్రుల చాటు బిడ్డ, అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు,ఆ గూడెం లో వంద గడపలకంటే ఎక్కువ లేని గూడెం ఆ గూడెం ప్రజలకు వ్యవసాయం,వేట ప్రధానమైన వనరులు.అడవి లోని వన సంపద,కట్టెలు,పుట్ట తేనె,ఇలా ఎన్నో విలువైన సంపదను,జంతువుల ను వేటాడి తెచ్చి,అదే ఊరిలో బతకడానికి వచ్చి,గిరిజనుల సంపదను తక్కువ ధరకు ,అసలు డబ్బు కాదు వారు తెచ్చిన దానికంటే తక్కువ బరువు తూచి వారికి గింజలు,ఉప్పు,ఇచ్చే శెట్టి గారు వారిని అమాయకులను చేసి,వారి బలహీనత ను సొమ్ము చేసుకునే వాడు.

వారు తాము పడిన కష్టాన్ని మర్చిపోవడానికి కాస్త నాటు సారాను తాగేవాళ్ళు,దాన్ని మరిపిస్తు శెట్టి అదే సారాను వేరే కొత్త సీసాలో పోసి,సీమ సరుకు అని రంగును కలిపి వారికి ఇచ్చేవాడు.అది సీమ సరుకు అని భావించిన అమాయక ప్రజలు అతను ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్లిపోయే వారు.

చదువులేదు కాబట్టి తాము అడవిలో సేకరించిన జీడి మామిడి,వెలగ పండ్లు,చింత పండు,పుట్టు తేనే, మెర్రి,ఈ త పళ్ళ విలువ వారికి తెలియదు కాబట్టి తాము తెచ్చిన వాటికి ఎంత వస్తే అంత పప్పులు,కొనేవారు ,శెట్టి వారిని మత్పరిచి తూకం తక్కువగా తూచి ఇచ్చే వాడు.

వారి సంపదను దోచుకుంటూ,దాన్ని పట్నంలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉండేవాడు.శెట్టి,ఇంకో ముగ్గురు కలిసి వ్యాపారం చేసేవారు….

మల్లమ్మ ఒక పేదవాడి ఇంట పుట్టినా స్వతహాగా చాలా తెలివైనది. ఒకసారి ఏదైనా చూసినా విన్నా కూడా నేర్చుకునే ఏక సంధగ్రహి కావడం వల్ల అన్నలతో,తల్లి తోనూ అడవికి వెళ్లినపౌడల్లా వారు వేటాడే విధానం చూసి,తొందరగానే నేర్చుకుంది. తర్వాత అన్నలు,సోపాతి గళ్ళ తోను కలిసి అడవిలో తిరుగుతూ అందరికంటే ముందుగా వేట ముగించి తెచ్చినావు శెట్టి దగ్గర అమ్మేసి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళేది.అప్పుడప్పుడు శెట్టి మల్లమ్మ దగ్గర తేనె తీసుకుని మిఠాయిలు చేతిలో పెట్టె పంపేసేవాడు.కొన్ని రోజుల్లోనే మల్లమ్మ పెద్దది అయ్యింది.

గూడెం అంత పండగ చేసుకున్నారు మల్లమ్మ పిల్ల నుండి యుక్త వయస్కురాలు అయినా కూడా తన వేట మానలేదు. స్ర్తీ సహజమైన సిగ్గు బిడియం వదిలేమగవారితో పోటీ పడి మరీ వేగంగా చెట్లు ఎక్కుతూ చిటా రూ కొమ్మన దాగిన పుట్టుతేనే ఇంకా టేకు ఆకులు,కాయలు,పండ్లు,ఇప్పపువ్వులను సేకరించేది.తన స్నేహితులకు కూడా సహాయం చేసేది.ఇంటి పనుల్లో కూడా తల్లికంటే ముందే నిద్ర లేచి అన్ని పనులు చక్క పెట్టేది.తన తండ్రికి,అన్నలకు కూడా వ్యవసాయపు పనుల్లో సాయపడేది..గూడెం ప్రజల్లో కూడా ఎవరికి ఏ సాయం కావాలన్న తన చెయ్యి పడాల్సిందే.వారికి మల్లమ్మ గుర్తుకు రావాల్సిందే…

ఆరడుగుల ఎత్తు,బలిష్టమైన భుజాలు,స్త్రీ సహజ అవయవాల పొంగు,నల్లగా ఉన్నా కళ గల మొహం ,ఒత్తైన తల కట్టు,బారెడు జడ ని సిగల చుట్టి అందులో అడవిలో పూసిన రకరకాల పువ్వుల తో అలంకరించుకుని,నండూరి వారు వర్ణించిన ఎంకిలా,మన బాపు గారి సినిమాలోని నాయికలా అనిపించే మన మల్లమ్మ గోచి ఎగగట్టి చెట్టెక్కిందంటే మిగతా వారికి ఏమి దొరకనివ్వక పోవునంటే అతిశయోక్తి కాదు.

తేనెటీగలు కుట్టకుండా లాఘవంగా తీసి తన ఆకలి ని తీర్చుకున,అడవిలో దొరికే సహజమైన పండ్లు,ఫలాలు తింటున్న మల్లమ్మ అందంగా ఆకర్షణీయo గా కనిపించడంలో తప్పేమీ లేదు. అలా వయసుకొచ్చిన మల్లమ్మ కు జతగాడు చిన్నప్పటి నేస్తం అయిన రామన్న దొర అంటే ఇష్టమే కానీ ఎప్పుడూ బయటపడలేదు మల్లమ్మ. కానీ అతను ఎదురుపడితే మాత్రం ఆమె కాళ్ళు, చేతులు స్వాధీనం తప్పేవి, కళ్ళు నేలను చూసేవి.

సిగ్గుల మొగ్గైపోయి అంతటి ఎత్తు ఉన్న మల్లమ్మ అతని ముందు చంటి దానిలా అయ్యేది. రామన్న చౌదరికి కూడా మల్లమ్మ అంటే ఇష్టమే అది ప్రేమగా వారి వయస్సు తో పాటు పెరుగుతూ వచ్చింది. కానీ గూడెంలో కొన్ని ఆచారాలున్నాయి. దాని ప్రకారంగా ఎవరైతే మలయుద్ధంలో ఓడి పోతారో ( అంటే పిల్ల తండ్రి తన కూతురుకి స్వయంవరం లాంటిది ఏర్పాటు చేస్తారు యుక్తవయసు రాగానే మలయుద్ధంలో గెలిచినవారు పిల్లను పెళ్లాడాలి) ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం.

ఆ గూడెం ప్రజలు దాన్ని తూ చ తప్పక పాటిస్తారు. తమ కులదేవత ఎదుట పెళ్లి చేస్తారు. రామన్న పెద్ద ఆస్తి పరుడు కాదు రెక్కల కష్టం మీద అతను అతని తల్లిదండ్రులు బ్రతకాలి కాబట్టి మల్లమ్మ్మను పెళ్లిచేసుకుంటానని గట్టిగా చెప్పలేకపోయాడు. ఇలా ఒకరి మీద ఒకరికి ఇష్టంగా ఉన్న ఏనాడు హద్దులు దాటి ప్రవర్తించలేదు. కానీ ఒకనాడు మల్లమ్మనే ధైర్యం చేసి అందరి ఎదుట చెప్పే పరిస్థితి వచ్చింది.

అది ఎలాగంటే ఒకనాడు ఎప్పట్లా మల్లమ్మ తన నేస్తాలతో కలిసి అడవికి పోయింది అక్కడేవో పోటీలు పెట్టుకుని అడవి లోపలికి వెళ్ళిపోయింది మల్లమ్మ తనకు తెలియకుండానే దారితప్పి పోయింది. నేస్తాలు ఎంతగా పిలిచినా పలకలేదు ఆ తర్వాత పులి గాండ్రిoపు విని వారు మల్లమ్మను పులి పంజాకు బలైందని గాబరా పడి గూడెం లోకి పరిగెత్తి విషయాన్ని మల్లమ్మ తల్లిదండ్రులకు చేరవేశారు.

తమ బిడ్డ పులి నోట్ల పడిందని తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. అన్నలు మల్లమ్మను వెతకడానికి నడుం బిగించారు. కానీ రామన్న దొర మల్లమ్మ ను వెతకడానికి వెళ్లాడని తెలిసి తల్లిదండ్రులకు ధైర్యం చెప్తూ గూడెం లొనే ఉన్నారు.అంతా రామన్న దొర ను మెచ్చుకున్నారు. అలా మూడు పగల్లు, మూడు రాత్రులు ఎదురుచూస్తు ఉన్నారు అయినా పిల్లల జాడ తెలియరాక వారిని పులి పంజా కు బలి అయ్యిందని భావించి ఆశను వదులుకున్నారు..

కానీ ఏడో రోజు ఉదయాన్నే శరీరం నిండా గాయాలతో ఉన్న మల్లమ్మ ను రామన్న తన రెండు చేతులతో మోసుకుంటూ వచ్చాడు.అది చూసి సంతోషించాల్సిన పెద్దలు కళ్ళెర్ర చేశారు.మనువు కాక ముందే ముందే బిడ్డను ముట్టుకున్నాడనిపంచాయితీ పెట్టారు.తెలివి వచ్చిన మల్లమ్మ జరిగింది గ్రహించి, అందర్నీ ఎదిరించి నా ప్రాణాలను,మానాన్ని కాపాడిన ఈ రామన్న దొరనే నేను మనువు ఆడతా అని,రామన్న చేసింది తప్పు కాదని అందరి ఎదుటా చెప్పింది. అయినా మల్లయుద్ధం చేసి గెలవలన్న ఆంక్షని గుర్తు చేశారు పెద్దలు.
పులి పంజాకు చిక్కకుండా నన్ను కాపాడిన వీరుణ్ణి ఇలా అవమానించడం మీకు న్యాయం కాదని అతని గాయాలు అన్ని మానిన తర్వాత మల్లయుద్ధంలో పాల్గొంటాడని పెద్దల్ని ఒప్పించిన మల్లమ్మ ,అతని గాయాలు తగ్గడానికి మల్లమ్మ ఎన్నో ఆకుపసర్లను తెచ్చి పోయసాగిo ది.గాయాలు మనుతున్నాయి ఆమె రామన్న కు శుశ్రూహ చేస్తూనే అడవిలోకి వేటకు వెళ్ళసాగింది….

రామన్న మల్లమ్మ చేసిన వైద్యం తో మునుపటి కన్నా బాగా బలం పుంజుకుని,మంచి కోడె గిత్తలా తాయర్రయ్యడు.ఇక పున్నమి నాడు మలయుద్ధంలో పాల్గొంటానని పెద్దలకు కబురు పంపించాడు.మల్లమ్మ ఆ వార్త విని సంతోష పడ్డది. అనుకున్నట్టుగానే రామన్న దొర పున్నమి వెన్నెల్లో ఇంకో మల్లయుద్ద వీరుడితో పోటి పడి, మల్లమ్మ చూస్తుండగా అతన్ని ఓడించాడు.గర్వoగ మీసాలు తిప్పుతూ, మల్లమ్మ ను ఎత్తుకుని గిరా గిరా తిప్పాడు.ఇక గూడెం అంతా సంబరాలు వెల్లువిరిసాయి.

ఒకానొక మంచి ముహూర్తంలో వారి కుల దేవత సాక్షిగా వారిద్దరూ ఒకటయ్యారు పెద్దల ఆశీర్వాదం తో,ఇక వారిద్దరి ఆనందం చెప్పనలవి కాదు.ఆడివంతా అత్తారిల్లు లా మారిపోయింది. చెట్టూ, చెమ, పుట్టా,వాగువంక, కొండా కోనా అంతా పట్టుపరుపులే అయ్యయ్యి.ఆరునెలలు ఆరు రోజుల్లా ఆనందాల అంచులను జుర్రుకున్నారు.దాని ఫలితంగా మల్లమ్మ గర్భం దాల్చింది,కొత్త అందాలతో రామన్న దొర ను మైమరిపిస్తోంది.ఆమెను అపురూపంగా చూసుకోవడం రామన్న దొర వంతు అయ్యింది….

నెలలు నిండి మల్లమ్మ అందమైన ఆడపిల్ల కు జన్మనిచ్చింది. అది చూసి అంతా మహాలక్ష్మీ పుట్టిందని సంబరాలు చేశారు.రామన్న మల్లమ్మ ను వదిలి క్షణం కూడా అవుతాలికి వెళ్లడం లేదు.అది చూసిన తల్లిదండ్రులు ఇదంతా సహజమే అని,అతన్ని వేటకు వెళ్ళమని బలవంతం చేశారు.నాలుగు రోజులు అవ్వగానే రామన్న వేటకు వెళ్ళాడు అందరి బలవంతం మీద,ఎవరి పనుల్లో కి వాళ్ళు వెళ్లిపోయారు..

ఇక శెట్టి తన వ్యాపారాన్ని ఇంకా వృద్ధిలోకి తేవడానికి తన మిత్రుల తో కలిసి వ్యూహo పన్నలని అనుకున్నాడు.గూడెం ప్రజలు తెచ్చిన కుందేళ్ల కు,జింక చర్మానికి డిమాండ్ బాగా పెరగడంతో శెట్టిని వెతుక్కుంటూ అతని ఇద్దరు మిత్రులు గుడెనికి వచ్చారు.

వారిని చూసి శెట్టి తబ్బిబ్బు అయిపోయి,తనకు తోచిన మర్యాదలు ఏవో చేయసాగాడు.అందమైన కుందేళ్ళ ను,లేళ్ళ ను తీసుకొచ్చి వాటికీ మసాలా దట్టించి,కూరలు వండి పెట్టాడు.అప్పుడే కాచిన నాటుసారా ను తెప్పించి పోసాడు.

ఇక వారికి ఎప్పుడూ దొరకని మందు,విందు దొరకడం తో బాగా తాగి,కుందేలు కూరను,దుప్పి కూరను నంజుకుని తిని,మైకం తలకు ఎక్కడం తో,తమకు మంచి పొందును కూడా ఏర్పాటు చేయమని అడిగారు వాళ్ళు.ఇప్పటి కిప్పుడు పొందు అనేది కుదరదు అని ,గూడెం లోని ప్రజలు ప్రొద్దున్నే వేటకు వెళ్ళిపోయి,ఏ రాత్రికో వస్తారు కానీ వాళ్ళు దీనికి ఒప్పుకోరని,బలవంతంగా ఒప్పిస్తే మొదటికే మోసం రావచ్చు అని శెట్టి చెప్పి,అవసరం అయితే పట్నం లో చూపిస్తాను అని వారితో అన్నాడు..

కానీ వారు దానికి సమ్మతించక మాకు గూడెం పడుచే కావాలని,పల్లె పడుచు పొందు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కోరికను,జీవితం లో ఒక్కసారి అయినా గూడెం పడుచు పొందును పొందాలని ఉందని అన్నారు,శెట్టిని బలవంతo చేశారు.డబ్బు ఆశ చూపించడం తో శెట్టి గూడెం లోకి వారిని తీసుకుని వెళ్ళాడు…

కానీ ఎక్కడ ఎవరు కన్పించలేదు. అంతా పిల్లలు,వృద్ధులు ఉన్నారు.కన్ను మిన్ను కానని వారు నాటుసారా బాగా తలకెక్కడం తో,ఎం చేస్తున్నామో కూడా తెలియని పరిస్థితి లో అన్ని గుడిసెలు వెతుకుతూ వెళ్లి,బాలింతరాలు మల్లమ్మ గుడిసెలోకి చొరబడ్డారు. అది చూసిన మల్లమ్మ అత్తామామలు,తల్లిదండ్రులు వృద్ధులు వారిని అడ్డగించారు.

కానీ వారిని ఒకే వేటుతో నరికి వేశారు కత్తితో,వారి అరాచకం చూసి మల్లమ్మ బాలింతరాలిని కనికరించమని వేడుకుంది.కాళ్ళ వెళ్ళా పడింది కానీ మైకంలో,కామం లో ఉన్న దుర్మార్గు లు అవన్నీ ఏం వినలేదు.తమ దాహాన్ని,తుచ్ఛమైన కోరికను మల్లమ్మ ద్వారా తీర్చుకున్నారు.తమ కోరిక తిరగానే,మల్లమ్మ చనిపోయింది అని భావించి,వారు వచ్చిన దారినే శవాల పైనుండి వెళ్లిపోయారు తూగుతూ….

వారి అన్యాయనికి బలైన పచ్చి బాలింతరాలు మల్లమ్మ తన శక్తినంతా కూడదీసుకుని లేచింది.పచ్చిగా ఉన్న శరీరం మీద పంటి గాట్లను, రక్తస్రావాన్ని చూసి తన మాలిన మైన శరీరాన్ని చూసుకుని గుండెలు పగిలేలా ఏడ్చింది.

రక్తపుటేరులో పడి ఉన్నా అత్తామామల,తల్లిదండ్రుల చూసి దుఃఖించి,ఒక నిర్ణయానికి వచ్చింది.కళ్ళు తుడుచుకుంది,బాయి దగ్గరికి వెళ్ళి,చన్నీళ్ళు తోడి తల మీద పోసుకుంది. గుడిసెలోకి వెళ్లి పసి కున కు కడుపు నిండా పాలు ఇచ్చింది. తర్వాత చీరను గోచి కట్టి,నడుం ని బిగించింది. మెడలో ఉన్న నల్లపూసలు తీసి ఊయల కు కట్టింది.రామన్న దొరను తల్చుకుంది.గట్టిగా ఊపిరి తీసి, పటాక కత్తి చే బుని కదానరంగం కు వెళ్తున్న రుద్రమదేవి లా ఆ కామాంధులను వెతుకుతూ బయలుదేరింది…

శెట్టి ఇంట్లో ,ఆ పెద్ద గడిలా ఇంకా తాగుతున్న వారిని చూసి శివంగిలా గర్జించి,ముందుకు దూకి,తన పండంటి జీవితాన్ని నిమిషంలో నాశనం చేసి, కులాసాగా నవ్వుతున్న వారిని ఖండా ఖండలుగా నరికి వేసింది.వారి రక్తం తో తన పాదాలు తడిసి పోయాయి.తలలు గడి ల గుమ్మానికి కట్టేసింది.ఈ విషయం ఎలాగో తెలుసుకున్న రామన్న దొర పరుగు పరుగున వచ్చడూ.కాని మల్లమ్మ తాను మైల పడిపోయాను అని దగ్గరికి రావద్దు అని అజ్ఞాపించింది.

రౌద్రం తో రక్తసిక్తమైన ఆమె ముఖారవిందం అమ్మవారిలా కనిపించింది వారికి అందర్నీ చూస్తూ నా జీవితాన్ని నా అనుమతి లేకుండా నాశనం చేసిన వారిని నేను నరికాను.ఇక ముందు ఇలా ఎవరైనా చేసినా,చేయాలనే ఆలోచన వచ్చినా వారికి ఇదే శిక్ష ను అమలు పరచాలి.

నా శీలం నాకు మళ్ళీ రాకపోవచ్చు కానీ ఆడపిల్ల అంటే కేవలం కామాన్ని మాత్రమే చూసే వీధి కుక్కలకు,ఆడదంటే అంగడి బొమ్మ కాదు,అన్ని భరించేది అనే భావనను తుంచేయాలి.ఇక ముందు కూడా ఇలాంటి కామాంధులకు ఇదే శిక్ష వేయండి.నా కోసం ఎవరూ ఎడవకండి,ఆడపిల్లలను బతకనివ్వండి..

నా కూతురికి పుట్టే మొదటి ఆడపిల్ల కు బతుకమ్మ అనే పేరు పెట్టండి.ఈ రోజును ప్రతి యేడు పువ్వులతో పండగ చేసి ,నన్ను కొలవండి, నేను ఆడపిల్లలను కాపాడడానికి తప్పక వస్తాను. నాకు ప్రతి సంవత్సరం పువ్వులతో నా ప్రతిమను చేసి,ఆడబిడ్డలందరు ఆట పాటలతో నన్ను సాగనంపాండి,కామాంధుల మదం అణచిన రోజును పండగ చేయండి, అని అంటూ భర్తను,కూతుర్ని కనులారా చివరిగా చూసుకుని,అదే కత్తి తో తన తల ను నరుక్కుంది…

అది చూసి గూడెంలోని ప్రజలంతా ఏడుస్తూ వచ్చి ఆమె ను తీసుకుని వెళ్లి తమ కుల దేవత పక్కనే దహనం చేసి,ఒక మొక్కను నాటి,దానికి పూసిన పచ్చని పువ్వులతో బతుకమ్మను పేర్చి,అక్కడే పెట్టి ఆడబిడ్డలందరు చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో తమ సంతోషాన్ని పంచుకుంటారు..

ఇలా మల్లమ్మ చేసిన పనికి,త్యాగానికి ప్రతీకగా ఇప్పటివరకు అడపిల్లలంతా ఇదే విధంగా బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు.అప్పుడు ఆ కాలం లో మల్లమ్మ శీలం పోయిందని ఏడుస్తూ కూర్చోలేదు,వారిని చంపి,తన ప్రాణాలు తీసుకుంది.

మరి ఇప్పుడున్న ఈ కాలం లో,అడుగడుగునా మృగాళ్లు న్న కాలం లో ప్రతి ఆడపిల్ల ఒక మల్లమ్మ లా మారాలి.కామాంధులను నరికి,చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి.ఆడపిల్లలు అబల లు కాదు.వారు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారు.మగవారికి అణిగి మణిగి ఉంటారు.ఎందుకంటే గౌరవం ఇచ్చి,చాలావరకు వారి తప్పులను మన్నిస్తారు. ఒక్కసారి వారి ఓపిక,సహనం నశించిన నాడు జరిగే పరిణామాలు ఎవరు ఉహించలేరు. ప్రతి ఆడపిల్ల మల్లమ్మ లా ప్రాణం తియ్యక పోయినా,కనీసం తన మానాన్ని కాపాడుకోవడానికి,ఆత్మ రక్షణ విద్యలు ఖచ్చితంగా నేర్చుకోవాలి. దైర్యంగా ఉండాలని పోరాడాలని కొరుకుందాం… ఈ మల్లమ్మ కథ ఒక స్ఫూర్తి అవ్వాలని కాంక్షిద్దాం……

Related Posts