ప్రతి విద్యార్థి బాధ్యత

మూడు దీపాలు

అక్షర కొరకు చిత్ర కథ

అంశం: ఉపాధ్యాయ దినోత్సవం చిత్రకథ

శీర్షిక : మూడు దీపాలు

ఒకప్పుడు సోమపురంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. వాడి కొడుకు చిన్నా.

చిన్నాకి చదువు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. “అమ్మా నాన్నా కష్టపడి పని చేస్తున్నారు కదా, నేను ఎందుకు చదవాలి?” అనేవాడు.

వాడి తల్లి రోజూ పొలం పనికి వెళ్తూ, వాడి కోసం పుస్తకాలు కొనేది. తండ్రి చెప్పులు అరిగేలా తిరిగి ఫీజు కట్టేవాడు.

ఒక రోజు వాళ్ళ బడిలో కొత్త గురువుగారు వచ్చారు. పేరు రాఘవయ్య మాస్టారు. ఆయన ఎప్పుడూ కోప్పడేవారు కాదు.

చిన్నా బడికి రాకపోతే, మాస్టారు స్వయంగా వాళ్ళ ఇంటికి వచ్చారు.

ఇంట్లో దీపం లేదు. తల్లి చీకట్లోనే అన్నం వండుతోంది. తండ్రి నడుం నొప్పితో మూలుగుతున్నాడు.

మాస్టారు చిన్నాని అడిగారు ఈ చీకట్లో నీకు ఏం కనిపిస్తోంది?
ఏం కనిపించడం లేదు మాస్టారూ అన్నాడు చిన్నా.
అప్పుడు మాస్టారు మూడు దీపాలు వెలిగించారు.

చూడు చిన్నా.. మొదటి దీపం నీ తల్లి. నిన్ను కనిపెట్టి కాపాడుతుంది. రెండో దీపం నీ తండ్రి. నీ బతుకుకు దారి చూపిస్తాడు. కానీ ఈ రెండు దీపాలు ఒక రోజు కొండెక్కుతాయి.

మూడో దీపం ఏంటి మాస్టారూ?

మూడో దీపం చదువు.నేను ఇచ్చే చదువు. ఈ దీపం నీతోనే ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగునిస్తుంది. ఈ దీపం వెలిగితే, నువ్వు నీ తల్లిదండ్రుల జీవితంలో కూడా వెలుగు నింపుతావు.

ఆ మాటలు చిన్నా గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆ రాత్రి తల్లి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు, తండ్రి చేతులు పట్టుకుని క్షమాపణ అడిగాడు, మరుసటి రోజు నుంచి గురువుగారి పాదాల దగ్గర కూర్చుని అక్షరం నేర్చుకున్నాడు.

ఏళ్ళు గడిచాయి. చిన్నా పెద్ద కలెక్టర్ అయ్యాడు. మొదటి జీతంతో తల్లికి చీర, తండ్రికి మందులు, గురువుగారికి ఒక దీపం కొన్నాడు.
ఆ దీపం మీద రాసి ఉంది…

అమ్మ ప్రేమ, నాన్న త్యాగం,గురువు జ్ఞానం ఈ మూడూ లేకపోతే మనిషి బతుకు చీకటే

ఉపాధ్యాయ దినోత్సవం నాడు చిన్నా ఆ దీపాన్ని బడిలో వెలిగించి, తన గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ఆ ఫోటోలో ఉన్నట్టే.

ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను.

పేరు : గరిగిపాటి శ్రీ లక్ష్మీ నారాయణమ్మ.
ఊరు… ఏలూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *