మూఢాచారం

మేము చాలా రోజుల తర్వాత రామవరానికి వెళ్ళాము మా అత్తగారి అత్తగారిని అంటే మామ్మగారిని చూడడానికి నిజానికి వెళ్ళాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము. కానీ, మాకు కుదరడం లేదు పనుల వల్లఎప్పుడు వెళ్దాం అని అనుకున్నా ఎదో ఒక పని వచ్చేది కాబట్టి మా పెళ్లి అయ్యి ఇన్నేళ్ళు అయినా వెళ్ళి నలుగు రోజులు ఉండలేదు.ఈ సారి వెళ్ళాలని అనుకుని ఖచ్చితంగా బయలుదేరదిసాడు మా ఆయన. నాకు చాలా సంతోషంగా అనిపించింది  ఎందుకంటే ఎప్పుడూ మా అమ్మ వాళ్ళింటికో లేదా అత్తరింటికో వెళ్ళేవాళ్ళం ఈసారి మామ్మగారి ఇంటికి వెళ్తాము అని అనగానే ఆ పల్లెటూరు, పచ్చని పొలాలు, స్వచ్చమైన గాలి, అరిటి ఆకులో భోజనం అన్ని గుర్తొచ్చి నాకు ఆనందం వేసింది. చిన్న పిల్లల్లాగ నేను మా వారు వెళ్దాం అని అనగానే గంతులు వేసి మరీ నా సంతోషాన్ని చూసి మా వారు ఆశ్చర్య పోయారు.

నిజం చెప్పాలి అంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నానో తెల్సా, నాకు వంట బాధ తప్పుతుంది అని, ఒక నాలుగు రోజులు హయిగా రెస్ట్ తీసుకోవచ్చు మామ్మగారి దగ్గర కావలసినవి అన్ని చేయించుకుని తినవచ్చు అని అనుకున్నా పాపం మామ్మగారు నిజంగా చాలా బాగా వండి పెడతారు నేను అనడమే ఆలస్యం నాకేమి తినాలని ఉందో అవన్నీ చేసి పెడతారు. అంతకు ముందు ఒకసారి ఒక్క రోజు కోసం వెళ్ళినప్పుడు నీకేం కావాలో అడిగి చేయించుకో అమ్మడు అని అంది ఆప్యాయంగా నిజంగా మమ్మగారికి ఎంత ఇష్టమో నేనంటే… ఎందుకంటే మామ్మగారి మనవడి భార్యను కదా మరి నేను అందుకే అంత ఇష్టం, ప్రేమ కూడా…

సరే అంతా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాము మేము. మేము రావడం చుసిన మామ్మగారు చాలా ఆనందపడ్డారు. మేము రావడం తనకి చాలా సంతోషం కలిగింది అనుకుంటా మరి అంత పెద్ద ఇంట్లో ఒక్కరే ఉంటారు. పైగా తన కోసం ఎవర్ని బెంగ పడొద్దు అని అంటుంటారు కూడా తనకి ఆ ఇల్లు అన్నా అక్కడి  పరిసరాలన్నా చాలా ఇష్టం కావచ్చు. నిజమే అదొక పర్ణశాలలా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు మల్లెలు మరువం అరటి అన్ని రకాల పువ్వుల పండ్ల చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది. మమ్మగారికి కాలక్షేపం ఆ చెట్లే మరి. ఆవిడ అభిరుచి చాలా గొప్పది ప్రకృతిలో ఎన్నెన్ని అందాలూ ఉన్నాయో అన్ని అందాలను చూడాలనే తపన, తృష్ణ ఆవిడకు ఉంది.

దానికే నేను కూడా ఆకర్షించ బడ్డనేమో అని అనుకుంటూ ఆ చెట్ల చుట్టూ తిరుగుతూ మామ్మ వేసిచ్చిన దోశల పని పడుతూ ఉన్నాను. ఇంతలో మామ్మ గారు సుషుమ అంటూ పిలుపు, ఏంటి మమ్మ అని వెళ్ళగానే ఇదిగో ఇది రుచి చూడు అంటూ కొబ్బరి పచ్చడి వేసారు నాకు దోశల్లో… కొబ్బరి పచ్చడి ఇష్టం అని ఎలా తెలుసుకున్నారో మరి ఇదిగో ఇలాగె మా అమ్మకు కూడా తెలియని ఇష్టాలు తెలుసుకుని మరి చెయ్యడం మామ్మ గారికే చెల్లు. అలా ఒక వారం రోజులు చాలా చాలా సంతోషంగా గడిపాము.

మా దంపతులకు ఏకాంతం కూడా కల్పించడం వెన్నెల్లో మంచం వెయ్యడం కూడా మామ్మ అభిరుచుల్లో ఒకటి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సరదాలు తీర్చుకుంటారు అంటూ కోప్పడి మరి వేస్తుంది. నిజానికి మామ్మకూ  మంచి రసిక హృదయం ఉంది. రసికత గురించి శృంగారo మిద కూడా మంచి జోక్స్ వేసి మమల్ని నవ్విస్తుంది కూడా. అది ఎవరూ లేనప్పుడే లెండి.

వారం అయ్యాక ఒక రోజు ప్రొద్దున్నే నాకు నెల వచ్చింది అదేనండి పిరియడ్ మా ఇంట్లో ఉంటె నేనే వెళ్ళి స్నానం అది చేసి ఎప్పట్లా వంట చేస్తాను. మా అమ్మ దగ్గరో, లేదా అత్తమ్మ వాళ్ళ దగ్గర్లో ఉంటె వాళ్ళు వచ్చి నాకు నీళ్ళు పోసి ఇంట్లో కలుపుకుంటారు మరి మామ్మగారు ఏమి చేస్తారో చూడాలి అని అనిపించింది. నాకు అదే నా తప్పో, పాపమో, ఖర్మనో, ఇప్పటికి అర్ధం కాదు. సరే ఏమి చేస్తుందో చూద్దామని నేను వంట గదిలోకి వెళ్ళి మామ్మ గారు నాకు నెల వచ్చిందండి అని అన్నాను మెల్లిగా ఈయన ఎక్కడ వింటాడో అని అది మరి మగాళ్ళకు తెలియకుండా ఉండాలని కోరుకుంటాము కదా మనం.

ఏమిటి నెల వచ్చిందా అది నువ్వు అంత మెల్లిగా చెప్తూ ఇంకా ఇంట్లోనే ఉంటావా పద పద వెళ్ళి అక్కడ ఒక బండ ఉంటుంది అక్కడ కూర్చో పో అంటూ గబగబా వంట గదిలోంచి బయటకు వచ్చింది. నాకు ఆమె అరుపులకు మాటలకూ నాకు వింతగా అనిపించి అందులో అంత అరిచేది ఏముందా అని అనుకున్న వెళ్ళి మామ్మగారు వెళ్ళిన వైపుగా వెళ్లాను అక్కడ గన్నేరు చెట్టు కింద ఒక నల్లటి బండ ఉంది. మామ్మ నన్ను చూసి ఇదిగో ఈ బండ ఉంది కదా దీనికి ఎదురుగ నువ్వు ఈ సంచులు వేసుకొని కూర్చోవాలి. ఇక్కడే ఉండాలి నువ్వు ఇంట్లోకి రాకూడదు.

నీకేమి కావాలన్నా నన్ను పిలువు నువ్వు మాత్రం లోనికి రావద్దు. ఏమి ముట్టుకోవద్దు కనీసం చెట్లని కూడా తాకవద్దు అని అంటూ లోపలి వెళ్ళి ఒక సత్తు గ్లాస్ ఒక చెంబు రెండు పాత బట్టలు అదేనండి కాటన్ చీరలు తెచ్చి నాకు పైనుండి వేసింది.

మామ్మగారి అరుపులకు నేను కనిపించక పోవడం వల్ల మా శ్రీవారు నన్ను వెతుకుతూ వచ్చారు. అ వైపు అది చూసి మామ్మగారు ఏంట్రా వెధవ అప్పుడే పెళ్ళాన్ని చూడకుండా ఉండలేవా కాసేపు వచ్చేశావు అయినా నువ్వు ఇటు రాకూడదు ముట్టుకోకూడదు వెళ్ళు వెళ్ళు అంటూ అయన వెళ్ళేంత వరకు తరిమింది నాకు చాలా చిరాకు వేసింది ఆ మాటలకూ అయినా పెద్దవారు అనే గౌరవంతో ఇంకేమి చేస్తుందో చూద్దామనే కోరికతో నేను ఏమి అనలేదు. నన్ను అక్కడ కూర్చో బెట్టేసి లోనికి వెళ్ళి ఒక విస్తారు నిండా వేడి వేడి అన్నం ఒక వైపున ఇంత కారం అంత నూనే వేసుకుని తీసుకొచ్చి ఆ బండ మీద వేసింది.

నేను అలా చూస్తున్నా అదేంటే అలా చూస్తావు తిను అంది ఉరిమి చూస్తూ నేను ఆమె అ బండ మిద వేసిన అన్నాన్ని తినాలా ఎలా అని చూస్తుండగా ఏంటి ఆలోచన ఎప్పుడూ తినలేదుగా ఎం పర్లేదు అలవాటు పడితే సరిపోతుందిలే రా రమ్మా వచ్చి తినేసేయ్యి అని అంది.

ఆమె చెప్పిన తీరో ఆకలో లేక వేడి అన్నమో కానీ  మొత్తానికి  అలాగే ఆ బండ మిద ఉన్న వేడి అన్నం కొంచం కొంచం గా కలుపుకుంటూ అలాగే తిన్నాను. నాకు కారం అలవాటే కానీ, మొత్తం దానితోనే తినాలి అంటే తినలేను కొంచం తిన్న తర్వాత మామ్మగారి ని చూస్తూ కూర మామ్మ అన్నాను కురానా అదేమీ లేదు నువ్వు దాంతోనే తినాలి అని అంది ఇంత అన్నం అది కూడా కారంతోనా నా వల్లకాదు అన్నా, నీ ఇష్టం ఇక అదే నీ తిండి ఈ పూటకు అని లోనికి వెళ్లిపోయింది.

ఎలాగో అ అన్నం మొత్తాన్ని తినేసా నేను మామ్మగారు మళ్ళి నా వైపు రానే లేదు. నేను ఎలాగో కూర్చున్న అక్కడే రాత్రికి కూడా అంతే వేడి అన్నం, కారం, అవే పెట్టింది కారానికి వేడి అన్నం తినడం వల్ల నా గొంతు కడుపులో మంట మొదలయ్యింది దానికి తోడూ ఈయన వచ్చి మామ్మగారు ముద్దపప్పు గుత్తి వంకాయ చేసారు అనగానే కోపం వచ్చింది. అయినా తిన్నాను ఎలాగో రాత్రికి కూడా ఇక్కడే పడుకో అంటుందా అని అనుకున్నా అనుకున్నట్టే అలాగే అంది కూడా అమ్మడు నువ్వు ఇక్కడే పడుకో అని అమ్మో ఈ చెట్లలో పడుకుంతో పామో తేలో వస్తే నా పరిస్థితిని తల్చుకుని నేను పడుకొను అని అన్నా లేదు నీకు తోడుగా నేను ఇక్కడే పడుకుంటా అనే సరికి కాస్త భయం తగ్గింది.

అయినా రాత్రంతా నిద్రలేకుండానే గడిపాను ఇక పాడ్స్ తీసుకుని వెళ్ళక పోవడం వల్ల వస్త్రాన్ని ఉపయోగించవలసి వచ్చింది. దాన్ని బాగా ఉతకమని పారవేయోద్దు అని అంది నేను అలాగే చేశాను. అయిదు రోజులు అంతే నరకం ఎక్కడో లేదు అని అనిపించింది. నాకు పైగా ఆవిడ వచ్చిన వారికీ చుట్టుపక్కల వారికీ కూడా విషయాన్ని చేరవేయడం వాళ్ళు నన్ను నా స్థితిని చూసి నవ్వుకున్నారు అని అనిపించింది.

ఎంతో మంచిది మంచి భావాలు, అభిరుచి, తృష్ణ, ప్రకృతి అంటే ప్రేమున్న మామ్మగారు అన్ని విషయాల్లో అంత బాగా మాట్లాడే ఆవిడ ఈ విషయంలో ప్రపంచం ఇంత ముందుకు వెళ్తున్నా ఆడవాళ్లు అంతరిక్షంలోకి వెళ్ళి వస్తున్నాఇంకా ఈ మూఢాచారాన్ని పెంచి పోషిస్తుంది అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.

ప్రపంచం మొత్తం ఆడవాళ్లకు సమాన హక్కులు సమాన అర్హత అని అంటున్నా ఇదొక మాములు విషయంలా అనుకుంటున్న సమయంలో ఒక ఆడదై ఉండి ఇంకో ఆడదాన్ని ఇలా చూస్తుంది అంటే ఆమె పెద్దవాళ్ళు ఆమె మనసులో ఎంత లోతుగా నాటి ఉంటారు. ఈ విషయన్ని ఆమె ఈ మూఢాచారాన్ని నరనరానా  జిర్ణించుకుంది ఇప్పుడు మనం మంచిగా చెప్పినా ఆమె దాన్ని ఒక పాపం పని లాగే అనుకుంటుంది. మామ్మగారు ఈ ఒక్క విషయం లోనే ఇలా అని మిగతా అన్ని విషయాల్లోనూ ఆధునిక మహిళలా ఆలోచిస్తారు అని నాకు తెలిసింది ఇప్పుడే…..

ఆ అయిదు రోజుల తర్వాత నాకు నీళ్ళు పోసి ఇంట్లోకి వచ్చాక మామ్మగారు నేను బలంగా ఉండాలి అని సున్నుండలు ఇంకేవేవో కాషాయాలు బలమైన ఆహారాన్ని నా చేత రెండు రోజులు తినిపించి ఇక మేము వెళ్తాము అంటే అవన్నీ కూడా మాకు కట్టి ఇచ్చి ఏవేవి ఎలా వాడలో అన్ని వివరంగా చెప్పారు నేను వస్తుంటే కన్నీరు కూడా పెట్టుకున్నారు మాకు చాలా బాధగానే ఉన్నా తప్పదు కాబట్టి మళ్ళి వస్తాము అని చెప్పి ఆవిడని ఓదార్చాము… ఇక ముందు నేను నాకు నెల ఉన్నప్పుడు మామ్మ గారి దగ్గరకి రాకూడదు అనే నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిమిషం లోనే……

Related Posts