పసి హృదయానికి ఓదార్పేది…!!!

మొదటి బాధ్యత

మొదటి బాధ్యత

                                    చిన్నారి ఆరాధ్య వయసు కేవలం ఆరు సంవత్సరాలు. బొమ్మలతో ఆడుకోవాల్సిన ఆ చేతులు, తన చిన్న గుండెను ఒడిలో దాచుకున్నట్లుగా ఎర్రటి హృదయాకారపు దిండును హత్తుకుని రోజంతా మౌనంగా కూర్చునేవి.

ఒకప్పుడు వారి ఇల్లు నవ్వులతో… కళకళలాడేది. నాన్న కథలు చెప్పేవాడు. అమ్మ లాలిపాటలు పాడేది. కానీ చిన్న చిన్న మాటల తగాదాలు పెద్ద పెద్ద గోడలుగా మారాయి. చివరకు అమ్మా నాన్న విడిపోయారు. ఆ రోజు నుంచి ఆరాధ్య జీవితంలో రంగులు మసకబారిపోయాయి. అమ్మ దగ్గర ఉన్నా నాన్న కోసం ఏడ్చేది. నాన్న దగ్గర ఉన్నా అమ్మ కోసం వెతికేది. ఇద్దరికీ తమ బాధలే కనిపించాయి.
కానీ ఆ పసి మనసు ముక్కలైన సంగతి ఎవ్వరూ గమనించలేదు? ఒకరోజు పాఠశాలలో టీచర్ ,
“నీకు అత్యంత ఇష్టమైనది ఏది?” అని అడిగింది. పిల్లలంతా బొమ్మలు, చాక్లెట్లు, పక్షులు, పూలు అని చెప్పారు. ఆరాధ్య మాత్రం తన హృదయాన్ని హత్తుకుని,
“నాకు మళ్లీ మా అమ్మా నాన్న ఇద్దరూ కలిసి నవ్వడం చూడాలి” అని చెప్పింది.
ఆ మాట విన్న టీచర్ కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంటనే తల్లిదండ్రులను పిలిపించింది. తమ నిర్ణయాల వల్ల కాలిపోతున్నది ఒకరి మనసు కాదు, తమ బిడ్డ పసి హృదయమని వారికి అర్థమైంది.
మళ్లీ వారు ఒకటయ్యారో లేదో కాలమే చెప్పాలి. కానీ , ఆ రోజు నుంచి ఆరాధ్యను ఇద్దరూ కలిసి ప్రేమతో… చూసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆరాధ్య ముఖంపై చిన్న చిరునవ్వు మెరిసింది. పగుళ్లు పడిన హృదయం ఒక్కసారిగా అతుక్కుపోదు. కానీ ప్రేమ అనే మందు దానికి మళ్లీ జీవం పోస్తుంది.
పెద్దల అహంకారం గెలిస్తే ఓడిపోయేది పసి హృదయమే. పిల్లల మనసు దగ్ధం కాకుండా కాపాడటం ప్రతి తల్లిదండ్రుల మొదటి బాధ్యత.

మాధవి కాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *