మౌనంలో ప్రేమ
నా ప్రాణానికి ప్రాణమైన నీకు…
నువ్వు నిప్పువైతే… నేను మంచును. మనమిద్దరం కలిస్తే ఒకరు కరిగిపోవాలని లేదా ఒకరు ఆరిపోవాలని లోకం అంటుంది. కానీ, ఆ నిప్పులోనూ ఒక వెచ్చని తోడుని, ఈ మంచులోనూ ఒక స్వచ్ఛమైన ప్రేమని మనం వెతుక్కున్నాం.
కానీ కాలం మన వేళ్లను విడదీస్తోంది. నీ చేయి నా చేయిని వీడుతున్న ఆ క్షణం. నా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తోంది.
నీ స్పర్శ తాలూకు వెచ్చదనం ఇంకా నా వేలిపై మెరుస్తున్న ఆ ఉంగరంలాగే నా మనసులో నిలిచిపోయింది.
విడివడి వెళ్తున్నావు కానీ, నీ జ్ఞాపకాల లిపి నా గుండె గోడల మీద పచ్చబొట్టులా ఉంది.
నీ వాలు చూపులు నాపై పడినప్పుడు వికసించిన విరులు , నేడు కన్నీటి ధారలతో తడిసిపోతున్నాయి.
కాలంతో వడిగా పరుగెత్తుతూ నిన్ను నా నుండి దూరం చేస్తున్నా, నీపై నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ వాడిపోని పరువంలా నిలిచి ఉంటుంది.
నువ్వు దూరమవుతున్నా కొద్దీ… మన మధ్య ఉన్న ఈ మౌనంలో ప్రేమ అనే నిశ్శబ్దాన్ని నింపేస్తోంది. నా మనసును ఏదో తెలియని బాధ నలిపి వేస్తోంది. విధి మనల్ని విడదీసినా, నా ప్రతి శ్వాసలో నీ నామమే వినిపిస్తుంది.
మళ్ళీ మనం కలిసే రోజు కోసం
మన ప్రేమ గెలిచే క్షణం కోసం
ఈ మంచు హృదయం
నీ వెచ్చని రాక కోసం
నిరంతరం ఎదురుచూస్తూనే ఉంటుంది.
నిరంతరం నీ ధ్యాసలో….
నీ ప్రాణం.
మాధవి కాళ్ల