మౌనిక

అపార్ట్మెంట్ లోకి మేము కొత్తగా వచ్చాము మొన్ననే, నాకు అంతా కొత్త కొత్తగా ఉంది అపార్ట్మెంట్ జీవితం ఎందుకంటే మేము ఇంతకు ముందు ఉన్నది ఇండిపెండెంట్ ఇల్లు కాబట్టి కింద చుట్టుపక్కల వారితో మాట్లాడుతూ కలివిడిగా ఉండే వాళ్ళం టైం పాస్ కూడా బాగా అయ్యేది. కానీ ఇక్కడికి వచ్చాక పక్కన ఉన్న ప్లాట్ వాళ్ళు ఎవరు ఉండరు.

అందరికి ఉద్యోగాలు పొద్దున వెళ్తే  సాయంత్రం రావడం, పాపం వాళ్ళకి నాతో మాట్లాడాలని ఉన్నా వల్ల పనుల వల్ల మాట్లాడలేరు. వాళ్ళ పనులను చేసుకోవడంతో వారికి నాతో మాట్లాడే సమయం ఉండదు. కానీ పాపం పక్కింట్లో ఉండే అమ్మాయి మాత్రం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పని అయ్యిందా ఆంటీ అంటూ చిరునవ్వుతో  పలకరిస్తుంది. అమ్మాయి అంటే నాక్కూడా ఎందుకో ఇష్టం పెరిగిపోయింది. చక్కని ఒడ్డు, పొడవుతో బారెడు జాడతో ఉంటుందా అమ్మాయి. ఆమెకు పెళ్లి అయినట్ల కానట్ల అనే అనుమానం నాకు లేకపోలేదు. కానీ ఆమె ప్లాటులోకి ఆమెతో పాటుగా ఎప్పుడూ ఎవరో ఒక కొత్త వ్యక్తి వస్తు ఉంటారు. ఒకసారి వచ్చిన వ్యక్తి ఇంకో సారి కనిపించరు మరి ఏమిటో అడగాలని ఉన్నా నేను అంత చొరవ తీసుకోలేక పోయాను.

ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజు మా కాలింగ్ బెల్లు సౌండ్ వినిపించి ఎవరా అని చూస్తే   అమ్మాయే నవ్వుతూ నన్ను లోపలికి పిలవరా అంది. అయ్యో రామ్మా అంటూ పక్కకి తొలగాను. ఆమె లోనికి వచ్చి ఇల్లంతా చూస్తూ బాగానే సర్దుకున్నారు అని అంది మెచ్చుకోలుగా చూస్తూ కొంచం ఉబ్బిపోయిన నేను టీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళాను. టీ తెచ్చిచ్చి నీ పేరెంటమ్మా అని అడిగాను. నా పేరు మౌనిక ఆంటీ నేను ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను అమ్మా వాళ్ళు ఊర్లో ఉంటారు నాకు హాస్టల్ లో ఉండడం ఇష్టం లేక ఇలా ప్లాటు అద్దెకు తీసుకుని వండుకుని తింటూ ఉంటున్న మీరేమి అనుకోకపోతే ఒక మాట ఆంటీ అంది మౌనిక. అయ్యో ఏంటో చెప్పమ్మా అని అడిగాను. నాకు వండుకుని తిని ఒక్కోసారి ఓపిక లేక ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తుంది ఆంటీ మీరు పక్కనే  ఉన్నారు కాబట్టి కాస్త నాకు రెండు మెతుకులు ఉడకేసి పెడతారా చాలా రోజులు అయ్యింది ఆంటీ మంచి భోజనం కడుపు నిండా తిని అంది అమాయకంగా మొఖం పెట్టి. 

ఆమె అంటున్న మాటలకు కడుపు తరుక్కు పోయింది. కన్న పేగు ఎక్కడో కదిలినట్టు అనిపించింది అయ్యో తల్లి అలా అడుగుతావేంటి ఇది నీ ఇల్లే అనుకో నీకు ఎప్పుడు ఏమి కావాలన్నా అడిగి చేయించుకుని తిను అంటూ హామీ ఇచ్చాను. మౌనిక హ్యాపీగా థాంక్యూ ఆంటీ అంటూ లేచి నన్ను కౌగిలించుకుంది.

ఇక అప్పటి నుండి మౌనిక మా ఇంట్లో ఒక మనిషిలా అయిపోయింది. నేను చేసిన వంటలకు మా వారు, నా కొడుకు వంకలు పెట్టి తింటుంటే మౌనిక మాత్రం వంకలు పెట్టకుండా లొట్టలు వేసుకుంటూ కంచాన్ని, గిన్నెలను ఖాళీ చేసేది. అదేంటో కానీ ఎప్పుడూ మా వాళ్లకు పరిచయం చేద్దామన్నా కూడా మౌనిక దొరికేది కాదు. వాళ్ళు ఉన్నప్పుడు మౌనిక ఉండదు మౌనిక ఉన్నప్పుడు వాళ్ళు ఉండరు ఇలా రెండు నెలలు గడిచాయి.

ఒక ఆదివారం పూట మా వారు సామాను తేవడానికి ఏమేమి ఉన్నాయో చూస్తూ లిస్ట్ రాస్తున్నారు. నేను వారికి చెప్తున్నా సామాను లిస్ట్ చూసి ఇదేంటి ఉండేది మన ముగ్గురమే కదా, ఇంత సామాను అప్పుడే అయిపోయిందా నేను ఎప్పుడు తెచ్చిన రెండు నెలలు వచ్చే సామాను అంటే కొన్ని తప్ప శక్కరి, టీ పొడి తప్పా ఇవన్నీ అయిపోయేవి కాదు కదా అన్నాడు అనుమానంగా చూస్తూ అదేంటి అలా అంటారు నేనేమైనా తప్పు చెప్తున్నానా నలుగురం తింటున్నాం కాబట్టి సారి కొంచం తొందరగా అయిపోయాయి అన్నాను. నలుగురా నలుగురం ఎవరు అన్నాడు మా ఆయన ఆదా అది మీకు చెప్పలేదు కదా అంటూ మౌనిక గురించి ఆమె మంచితనం గురించి ఆమె వండి పెట్టమనడం గురించి చెప్పాను. అన్ని విన్న తర్వాత మా ఆయన సరేలే అంటూ మా అబ్బాయితో కలిసి సామాను లిస్ట్ తీసుకుని డిమార్ట్ కు వెళ్లారు.

వాళ్ళు వచ్చే సరికి వంట చేసి రెడిగా పెట్టాను ఇంతలో మౌనిక వచ్చింది ఆకలి అంటూ సరే వాళ్ళు రావడానికి ఎలాగూ లేట్ అవుతుంది అని మౌనికకు పెట్టేసా ఆదివారం కాబట్టి బిర్యానీ, మటన్ గ్రేవీ, పెరుగు పచ్చడి, సలాడ్, డబుల్ కా మీఠా చేసాను. వాటిని చూస్తూనే ఆంటీ చాలా బాగా చేశారు అన్నీ నాకు ఇష్టమైనవే అంటూ వాటన్నిటినీ ఒక పట్టు పట్టింది. నిజం చెప్పొద్దూ మౌనిక తినడం చూసి అసలు ఏమయినా మిగులుతుందా అనుకున్నా మొత్తం తినేసి, ఆంటీ ఇన్ని రోజులకు మనస్ఫూర్తిగా తిన్నాను ఇక నా కడుపు నిండింది. నా కోరిక తీరింది వెళ్తున్నా ఆంటీ అంటూ వెళ్లిపోయింది మౌనిక.

ఆమె వెళ్లిన గంటకు మా వారు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్, వాచమేన్ ఇంకా కొందరితో కలిసి వచ్చారు. వారందరినీ చూసి నాకు ఏమైందో అనే భయం వేసింది. అందరూ కూర్చున్న తర్వాత అందరికి టీ పేట్టి ఇచ్చాక, నన్ను కూడా కూర్చోమని అన్నారు మా వారు. నేను మొహమాట పడుతుంటే పరవాలేదమ్మ కూర్చోండి అని ప్రెసిడెంట్ గారు అనడంతో కూర్చున్నాను.

వాళ్ళు మాములు విషయాలు మాట్లాడుతున్నారు ఇంతలో ప్రెసిడెంటు గారు మా వారితో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి పక్కన ప్లాటు చాలా రోజుల నుండి ఖాళీగా ఉంది అన్నారు. నేను ఆశ్చర్యంతో అదేంటి మౌనిక ఖాళీ చేసిందా అంటూ అడిగి తను నాకు చెప్పనే లేదు అన్నాను మాటకు అందరూ నన్ను విచిత్రంగా చూసారు. అదేంటమ్మా మౌనిక నీతో మాట్లాడ్డం ఏమిటీ?  అని అడిగారు నేను వాళ్ళతో అదేంటి మీరు చెప్పే ప్లాటులోని అమ్మాయి మౌనిక కదా తను రోజు నాతో మాట్లాడుతుంది ఇక్కడే మా ఇంట్లోనే తింటుంది నేను నా చేతులతో ఆమెకి ఎన్నో సార్లు అన్నం పెట్టాను అన్నాను.

అమ్మా మీరు ఎవర్నీ చూసి ఎవరు అనుకున్నారో కానీ ప్లాటులో గత సంవత్సరం నుండి ఎవరు ఉండడం లేదు. అందులో ఉన్న మౌనిక అనే అమ్మాయిని భర్త తిండి పెట్టకుండా, అదే రూమ్ లో ఉంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు వాసన రావడంతో మేమంతా తలుపులు పగులగొట్టి చూడడంతో  విషయం తెల్సింది. పోలీసు కేస్ కూడా అయ్యింది అప్పటి నుండి అందులోకి ఎవరు రావడం లేదు. అందుకే ఇప్పుడు మీ వారికి ఎవరన్నా తెలిస్తే చెప్పమని చెప్పడానికి వచ్చాము అంటూ ఉన్న విషయం వివరించారు ప్రెసిడెంటు గారు.

మాట వినగానే నాకు వెన్నులో నుండి వణుకు వచ్చింది అంటే నేను ఇన్ని రోజులు మాట్లాడింది ఒక ఆత్మతోనా? నేను ఒక ఆత్మకు ఇన్ని రోజులు భోజనం పెట్టానా అని భయం వేసింది. అది విన్న అందరూ కూడా నేను మౌనికతో మాట్లాడాను అంటే నన్ను వింతగా చూడడం ప్రారంభించారు తర్వాత నాకు ఎప్పుడూ మౌనిక మళ్ళీ కనిపించలేదు. 

వారం రోజుల తర్వాత మావారి ఆఫీస్ వేరే ప్లేస్ కూ షిఫ్ట్ అవడంతో బాగా దూరం అవుతుందని మేము  ప్లాటుని ఖాళీ చేసి వెళ్తున్నప్పుడు నేను కార్ ఎక్కుతూ ఎందుకో తలతిప్పి ప్లాటు వైపు చూసాను అక్కడ ఎప్పుడూ వేసుకునే డ్రెస్ వేసుకుని బారెడు జడతో నన్ను నవ్వుతూ చూస్తున్న మౌనిక కనిపించింది. ఆమె తన రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ గాల్లో కలిసి పోయింది.

                                                                          ……………….. విధీర్

Related Posts