జగమెరిగిన సత్యానికి ప్రాకారం
జగతికి ప్రాణాలూదిన మమకారం..!!
అన్నిరంగాల అభివృద్ధికి నువు సారథ్యం
పేగు బాధైనా భరించి పుట్టెడానందంతో
పురుడోసుకొన్న తల్లివి అమృతవల్లివి…
అర్థం మారని అనంత లోకాలకు అమ్మవు
సంసార బంధాల నెలిగించుకొనే ప్రమిదవు…
అడుగును నడిపిన చేతనవు
అక్షరాలను దిద్దించిన జ్ఞాన జ్యోతివి…
దోసిటి దీపమై ఒడినే ఊయలగా కట్టి
జరిగిన కథల లాలింపుతో జోలపాడావు..!!
కండ్ల ఒత్తులతో కారు చీకటిని కాల్చుతూ…
దడికట్టని జీవితాలలో దివిటీని కట్టావు…
ఆగని కాలానికి నిలువని ప్రయాణమైనావు
తలచిన మదితో ధ్యానమయ్యావు
మనస్సుతో బంధాలను ప్రేమించావు..!!
పరిస్థితుల ప్రభావాలు బరువెంతటివైనా
లెక్కచేయక తిరగబడి దినసరిని తోచావు…
అనుబంధాలు ఆప్యాయతలనే నీ ప్రేమతో
తడిసిన ప్రతి క్షణాన్ని శిల్పంగా మొలిచావు…
తరిగే దేహంతో చింతించని మార్మికమైనావు
ఎందుకో నీతో నడిచిన రోజులు
నిన్ను గుర్తించక వెనకకు తోస్తున్నాయి..!!
కరుడుగట్టిన విషయాలతో ముంచేస్తున్నవి
బరువయ్యావనో బరువు దించుకోవాలనో
ఈ సృష్టిలో అమ్మను మించిన దైవం లేదు…
ఈ అవనిపై ఆత్మను మించిన అర్థం లేదని…
అమ్మ స్థానానికి విలువనిచ్చి తరించండి
ఆ సన్నిధిలో నిరంతరాన్ని ప్రారంభించండి
( మాతృ దినోత్సవం శుభాకాంక్షలతో…)
దేరంగుల భైరవ (కర్నూలు)
9100688396