వెర్రి పిల్లలు

అమ్మా, అయ్యో కాళ్ళు పిక్కుపోతున్నాయి కాసేపు కూర్చుందాం అనుకుంటే అక్కడ ఇంట్లో పిల్లలు నా కోసం ఎదురుచూస్తూ ఉంటారు, రేషన్ బియ్యం తెచ్చుకోవడం ఏమో కానీ ప్రతినెలా నా తల ప్రాణం తోకకి వస్తుంది. పోనీ ఆటోలో  పోదాం అని అనుకుంటే దానికి పెట్టె డబ్బులతో ఇంకో అయిదు కిలోల బియ్యం అయిన వస్తాయి

కదా అందుకే ఆటోలో పోను, అని అనుకుంటూ ఒక షాప్ దగ్గరున్న అరుగు మీదా కూర్చుని తనతో పాటుగా ఉన్న ఇంకొక వృద్ధురాలితో తన బాధను చెప్పుకుంటున్న ఆమెని ఒకసారి అలా చూసి, ఇది మాములే అన్నట్టుగా మొహం తిప్పుకున్నాను.

పేదవారు, వలస వచ్చిన వారు ఇలా మాట్లాడుకోవడం పరిపాటి అని నేను అంతగా పట్టించుకోకుండా పేపర్లో తల దూర్చాను. పక్కనున్న వృద్ధురాలు అబ్బ తల్లి నీ ఓపికకు మెచ్చుకోవాలి, అంత పెద్ద పిల్లలకు వండి వార్చడమే పెద్ద పని అనుకుంటే వారిని oటి పిల్లలగా ఇప్పటికి సాదుతున్నావు

వాళ్ళని ఎదో అనాధ ఆశ్రమంలో వేసి నువ్వు నీ కూతురి దగ్గరకు వెళ్లొచ్చు కదా అని అంది ఆవిడ.ఎమ్మా నా పిల్లలు ఏమన్నారు అమ్మ నిన్ను వాళ్ళను కళ్ళలో పెట్టుకుంటివి, నీతో నా బాధ చెప్పుకోవడం నా తప్పే, పో పో ఇగ నీ ఇంటికి నువ్వు, నాకు కోపం గనక వస్తే చెప్పుతో కొడతాను అని,

బియ్యం సంచి నెత్తిమీదకు ఎక్కించుకుని, గబగబా ముందుకు నడిచింది ఆవిడ. యబ్బో ప్రేమ పొంగి పోతుంది వెర్రి పిల్లలు, పెళ్లీడుకు వచ్చిన వాళ్ళకు  ఇంకా వాళ్ళ ముడ్డి, మూతి కడుక్కో నాకేమి అని అంటున్న ఆవిడను చూసి నాకు కుతూహలం కలిగి వెంటనే ఆమె దగ్గర కింద అరుగు మీదకు వెళ్లి కూర్చున్న,

పక్కనే ఉన్న నన్ను చూసి ఉలిక్కిపడిన వృద్ధురాలు, ఏంది బాబు బియ్యం కావాలన్నా ఏంటి కిలో పది రూపాయలు జోక్కో అని అంది. అది కాదమ్మ, ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన ఆమె గురించి నాకు చెప్పవా, ఎవరామే ఎక్కడ ఉంటది అని అడిగే సరికి అబ్బో ఆమె  గురించా,

ఏముంది దాని పిల్లలు ఉత్త వెర్రి బాగుల పిల్లలు, వాళ్ళను ఏదైనా ఆశ్రమం లో వేయమని అంటే వేయకుండా ఇదిగో ఇప్పటికి ఇంకా వాళ్లకు సర్వ శాకిరి చేస్తూ, అందరికి దూరమై, వాళ్ళతోను ఒంటరిగా బతుకుతున్నది అని ఆపింది 

నాకు ఆమె వ్యక్తిత్వం డిఫరెంట్ గా అనిపించి, అవ్వ ఇంకా చెప్పవా అని అడిగాను వృద్ధురాలిని   దాని గురించి చెప్పుకుంటా కూసుంటే నా కోడలు నన్ను ఇంట్లోకి రానియ్యదు తిండి కూడా పెట్టదు ఇప్పటికే యాల అయ్యింది,

అయినా బిడ్డా నాకు ఇంతే తెలుసు ఆమె ఎవరితోనూ తన కష్టం చెప్పుకోదు, అంటూ గిది ఎత్తు బిడ్డా అని అంది. ఆమెకు బియ్యం మూట ఎత్తి, అవ్వా ఆమె ఇల్లు ఎక్కడో అదైనా చెప్పు, నాకు ఆమె కథని వినాలని ఉంది అని అడిగాను. ఆమె కథ నువ్వేo చేసుకుంటావు అని సరే నాతోని  రా  సుపిస్తా అని ముందుకు కదిలింది అవ్వ,

ఆమెతో వెళ్తున్న కానీ ఆమెకి సహాయం చేయాలి అనే ఆలోచన కూడా నాకు రాకపోవడం నిజంగా ఆమె కథ ఏంటో తెలుసుకోవాలనే తపన నాకు ఆలోచన రాకుండా చేసిందేమో అని తర్వాత బాధ పడ్డాను. ఆమె ఇంటి వరకు అవ్వ నాతో ఆమె కోడలు పెట్టె బాధల గురించి ఏకరువు పెడుతూనే ఉంది.

అయినా నేను వాటిని వినలేదు వింటున్నట్టు కొడుతూ నడిచాను, ఒక రేకుల షెడ్డు దగ్గర ఆగిపోయింది అవ్వ, నేను టక్కున ఆగాను ఏంటి అన్నట్టుగా ఇది మా ఇల్లు బిడ్డా, అగొ అక్కడ కనపడుతుంది సుడు అదే ఆమె ఇల్లు పో, ఇగో ఇట్లా సక్కగా పోయి ఎడమచేతి దిక్కు పోయి,

మళ్ళా కుడి దిక్కు మలుగు అని వివరంగా చెప్పి, లోపలికి వెళ్లిపోవడం, లోపలి నుండి కోడలు తిట్లు నాకు లీలగా వినపడ్డాయి. నేను అక్కడి వరకు వెళ్లి ఆమె ఇంటిని దగ్గరగా చూసి వెనుదిరిగాను. లోపలికి వెళ్లక పోవడానికి కారణం అంటూ ఏం లేదు ఆమె దినచర్య, ఆమె పిల్లల గురించి వివరంగా తెలుసుకోవాలి అనే కుతూహలంతో ఇంటికి వెళ్లి, అదే ఆలోచిస్తూ తిని పడుకున్నా

***

తెల్లారి అయిదు గంటలకే లేచి,నా మిత్రునికి ఫోన్ చేసి సరంజామాతో రమ్మని చెప్పి నేను రెడి అయ్యి, వాడి కోసం ఎదురుచూస్తూ మా ఇంటి ముందు నిలబడ్డాను. ఇంతలో వాడు రావడం నేను దారి చెప్తుంటే ఇద్దరం కలిసి అవ్వ ఇంటి ముందు బైక్ ఆపి దిగాము.

మా వాడిని అన్ని సరిచూసుకో అని చెప్పి నేను డోర్ కొట్టడానికి వెళ్ళాను అప్పటికి సమయం ఐదున్నర చలికాలం కావడంతో నేను వేసుకున్న స్వేటర్లో వెచ్చగా అనిపించినా లోపలినుండి చలి వణికిస్తోంది. తలుపు తట్టబోయిన నేను తట్టకుండానే తెరుచుకున్నాయి.

అవ్వ మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయి ఎవరూ బిడ్డ మీరు అని అడిగింది, అవ్వ మేము నీ గురించి తెలుసుకోవాలని వచ్చాము అని అనగానే అది మాములే అన్నట్టుగా తెలుసుకుని ఏం చేస్తారు బిడ్డా, అందరు తెలుసుకుని పోతారు గంతే కదా సరే మీకేం కావాలో అడగండి అని అంది.

మా వాడు తన పనిమొదలు పెట్టాడు ఆమె మేము మంచులో ఉండడం చూసి, లోపలికి రండి బిడ్డ సలి సంపుతుంది అని గుడిసె లోపలి భాగంలో రెండు కుర్చీలు వేసింది, మేము వెళ్లి అందులో కూర్చున్నాం, ఆమె పొరక తీసుకుని వాకిలి ఊడ్చి చిక్కని పేడ తో అంతా సానుపు చల్లింది. అది చూసిన నేను ఆశ్చర్యపోయి కళ్ళు తేలేసాను.

కాలంలో కూడా అది ఇంత చలిలో ఆమె ఎనభై ఏళ్ల వయసున్న ఒక మామ్మగారు అలా సంప్రదాయం మరవకుండా సానుపు చల్లడం అనేది వింతేగా మరి, కాలం ఆడవాళ్లకు ఈవిడను చూపించాలి అని అనుకున్నా,

ఆమె అంతా చల్లి మళ్ళీ చీపురుతో ఊడ్చేసి, లోనికి వస్తూ ఏం బిడ్డా ఇదేందీ అని అనుకుంటున్నావా పురుగు పుట్రా రాకుండా, క్రిములు లోనికి రాకుండా ఇలా చేయడం పల్లెలో చేస్తారు అది నాకు అలవాటు అయ్యింది.

ఇలా చేస్తే పిల్లలకు దోమ కూడా కుట్టదు అని నాతో చెప్తూ పొయ్యిలోంచి బూడిద ఎత్తి అందులోంచి ఒక బొగ్గును తీసుకుని పంటి కింద వేసుకుని నములుతూ ఇగో బొగ్గు పళ్ళకు వాడితే మంచిది బిడ్డా అందుకే నా పండ్లు ఇప్పటికి ఆర్గలే గదేదో పేస్టు అంటారు కానీ మంచిగా ఉండది 

అని పొయ్యి ముట్టించి పెద్ద కొప్పెర లో నీళ్లు పెట్టి పిల్లలకు సళ్ళనీళ్లు పడయి బిడ్డా అందుకే ఉడుకు నీళ్లు అని, కుసొండి బిడ్డా చాయ్ తగుదాం అని  మొహం కడుక్కుని, అలాగే స్నానం కూడా చేసి  బట్టలు కట్టుకుని వచ్చిన అవ్వ, పొయ్యి పక్కనే ఉన్న వెంకరేశ్వరుని బొమ్మ ముందు రెండు ఆగరుబత్తిలు వెలిగించి నమస్కరించి,

పొయ్యి మించి కొప్పెరను దించేసి ఒక గిన్నెను పెట్టి, బిడ్డా నాకు రాత్రే పాలు పోసి పోతారు రాతమొళ్ళు పొద్దున పిల్లల పనితో నాకు కుదరది గదా అని గబగబా చిక్కని పాలు పోసి అందులో చాపత్త వేసి, బెల్లాన్ని వేసి, అల్లాన్ని వేసి టీ చేసింది. ఆరోగ్యకరమైన టీ ను తాగుతూ అవ్వ నీ పేరేంటి అని నా మొదటి ప్రశ్న వేసాను మొదలు పెట్టినవా బిడ్డా ఇగో  పిల్లలు లెసే టైం అయ్యింది ఒక్క పది నిమిషాల్లో నా కథ సెప్త అని….

నా పేరు ఇరమ్మ బిడ్డ మా అవ్వోళ్ళు మ్యానరికం అని మా బావకు పదేళ్లకే ఇచ్చి పెళ్లి చేసిండ్రు, ఆళ్ళు మా మంచికే కదా సెప్పేది అని ఏం అనకుండా సేసుకున్న, పెళ్లి అయ్యినక పదేళ్ల దాకా పిల్లలు కాలే అందరూ గొడ్డు ముండా అని తిట్టేటోళ్ళు అవన్నీ ఇనలేక నేను మా బావను పట్నం పోదాం అని సతాయిoచి ఈడకు తొలుకొచ్చిన.

ఈడ అయితే డాక్టరమ్మలు ఉంటారు సూపించుకోవచ్చు అని సిన్న ఆస, అన్నట్టుగానే ఇదే బస్తిలో అప్పుడు ఇదంతా ఏడున్నది అంతా సెట్లు పుట్టలే కానీ మా లెక్క బతకనీకి వచ్చినోళ్లు గుడిసెలు ఏసుకుని ఉండేటోళ్ళు

అందులో  ఆల్ల కోసం కట్టిన గోర్నమెంటు ధావఖానాల ఒక అమ్మ ఉండేది ఆమెకు నా బాధ సెప్పితే ఏవేవో గోళీలు ఇచ్చేది అవి నేను ఏసుకున్న మూడు నెలలకె నాకు కడుపయ్యింది.

ఇగ మా బావ నన్ను మా బాగా సూసుకున్నాడు డాక్టరమ్మ నా కుడుపుని సుశీ ఇద్దరున్నారు పెద్ద ఆసుపత్రికి పోవాలే అని చెప్పే, పోతిమి అడా అపరేషను ఎదో సేసి పిల్లలను తీసిన్రు

మల్ల పిల్లలు అయితే పననికే ప్రమాదం అని సేప్పి గర్భసంచి కూడా తీసేసిండ్రు అయితే ఏంది ఇద్దరు అయితే రామ లచుమణులు పుట్టిండ్రు అనుకుంటి కానీ దినాలు గడిషిన కొద్దీ మాట పలుకు సుపు లేకపోయాయే నడుసుడు కూడా లేకపోయే

నాకు భయం అయ్యి అమ్మ దగ్గరికి తీసుక పోతే ఆమె పెద్ద డాక్టర్ ని పిలుసుకొచ్చి సూపించే నా పిల్లలను సుశీన డాక్టర్ ఈళ్ళు మేనరికం వల్ల ఇలా పుట్టిండ్రు అని ఇగ ఈళ్ల జీవితం ఇంతే అని సెప్పిరి, మంచిగా చేసిద్దాం అన బాగా పైసలు కావాలె అని సెప్పి,

అది కూడా  ఇప్పుడు కాదు కొంచం పెద్దయ్యినంక అని అంటే లేక లేక పుట్టినోళ్లు ఇగో గిట్ల అవకారం ఉండే అని కంటికి మింటికి ఎడిస్థి నను ఎవరు ఓదార్చలే, ధైర్నం సెప్పలే ధైర్నం సెప్పే మా బావ ఇంకోదాన్ని పెళ్లి సేసుకుండు వంశం కోసం అని,

ఇగ నేను ఎడికి పోతూ ఏం సెయ్యలో తెల్వక ఆయమ్మను అడిగి, కాళ్ళు పట్టుకుంటే యమ్మ పిల్లలకు మంచి తిండి పెడుతూ దైన్యం కోల్పోక మంచిగా ఉండు అని ఒకటి సెప్పి.. 

ఇంకో మాట ఏమున్నది అంటే పిల్లలను అనాధ ఆశ్రమం లో ఏసీ నువ్వు మారు మనువు సేసుకో అంది. కానీ  పిల్లలు పుట్టాక నేనె ఎంత గోస పడ్డనో, ఎన్ని మాటలు పడ్డానో నాకెఱుక పదినెలలు మోసి కన్నా పిల్లలను నా చేతులరా అడా ఎడనో ఎయ్యాలంటే మనసు ఒప్పలే,

ఏదైతే అది అయ్యింది అని వాల్లో, నేనో సచ్చే దాకా ఆల్లని సాధాలని అనుకుంటి, గుండెని రాయి సేసుకుని, పిల్లలను విపుకు కట్టుకుని ఉప్పరి పనికి పనికి కావాలంటే పనికి పోతి, నన్ను నా వయసును సుశి కొందరు నా ఎంట పడ్డారు కానీ ఆళ్ళకు నా పిల్లలను సూపించి

నా మీద చెయ్యి వేయాలి అంటే ఆళ్ళను సాకాలి అని సెప్పేదాన్ని దాంతో నోరుముసుకుని నా వంక కన్నెత్తి కూడా సుడక పొయ్యేటళ్లు అని బాధని కూడా నవ్వుతూ చెప్తున్న ఆమెని చూసి ఇద్దరం నోరు తెరుచుకుని చూస్తూ కూర్చున్నాం,

ఇగో ఇప్పటి దాకా వయసులో ఉన్నప్పుడు పని చేసిన పైసలు కాపాయం చేసుకుంట ఆళ్ళను నన్ను బతికించిన, వాడ పెద్దగయినంక మీ లెక్కనే పిల్లలు అచ్చి నా గోస ఇన్ని సాయం చేస్తాం అన్నారు,

అంతా సెప్పినా కానీ ఎవరు రాలె ఇప్పటి దాకా, అయినా పాడు పని సెయ్యకుండా నా రెక్కల కట్టంతో నా పానం ఉన్నంత దాకా నా పిల్లలను కాపాడుకుంటా అని ఏనాడో అనుకున్న అని ఆపింది అవ్వ.

మంచి సస్పెన్స్ సినిమా మధ్యలో ఆపేసినట్టు ఉలిక్కిపడిన మేము ఏమైందా అని చూసాము. ఇగో బిడ్డా నా పిల్లలు లేశిన్రు ఆళ్ళను తయారు చెయ్యాలే మీరు జర అవతల ఎండకు కూసోని  ఇగో ఉడుకుడుకు

ఉప్పిడి బిండి తినుండి అని పేపర్ ప్లేటులో పెట్టి చెరొటి ఇచ్చింది. మాతో మాట్లాడుతూనే ఆమె టిఫిన్ చేయడం మాకు అసలు తెలియనే లేదనుకుంటూ కుర్చీలు రెండు తీసుకుని బయటకు నడిచాము. మా వాడు గబగబా తినేసి తన కర్తవ్యాన్ని నిర్వర్తించసాగాడు.

ఆమె లోపలికి వెళ్లి పిల్లల కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత దాన్ని శుభ్రం చేసి, వారికి వేడి వేడి నీళ్లతో స్నానాలు చేయించి, శుభ్రంగా తుడిచి, వేరే కుర్చీలో వారిని జాగ్రత్తగా కూర్చో బెట్టి రాత్రుళ్ళు వాళ్ళు మూత్రం, మలం పోయిన వారి విడిచిన బట్టలను ఉతికేసి, వేడి నీళ్లతో శుభ్రం చేసి ఎండకు ఆరేసి,

తర్వాత శుభ్రంగా చేతులు సబ్బుతో కడుక్కుని వచ్చి వారికి వేడిగా చేసిన ఉప్పుడు పిండి లో సాంబారు వేసి పెడుతున్న దృశ్యం నాకు కన్నుల పండుగ లా అనిపించింది.

ఆమె వారి మాలమూత్రాలను కడుగుతున్నా ఆమె మొహం లో చిరాకు కోపం లాంటివి ఏవి లేవు అదే కాలంలో పదేళ్లు రాగానే నీ ముడ్డి నువ్వే కడుక్కో అంటున్న తల్లులకు, ఇరవై మూడేళ్ల కొడుకులకు, ఇప్పటికి కడుగుతూ, చంటి పిల్లల్లా చూసుకుంటూ వారికి అన్ని విధాల సేవలు చేస్తున్న తల్లికి శతకోటి వందనాలు సమర్పించిన తక్కువే

అందుకే అంటారేమో దేవుడు అన్ని చోట్లా ఉండలేక తల్లిని సృష్టించాడు అని, వారికి తినిపించిన తర్వాత ఆమె వేడి పాలను వాటితో పాటు గోళీలు వారికి వేసింది. ఒకరికి చూపు లేదు, ఇంకొకరికి చెవులు వినపడవు, కాళ్ళు చేతులు కూడా వంకరగా ఉన్నాయి, చూపులు ఎక్కడెక్కడో ఉన్నాయి. తల్లి వారిని మందలిస్తూ,

వద్దు అంటుంటే బుజ్జగిస్తూ  పాలు తాగించడం, మూతికి అంటిన పాలను కొంగుతో తుడిచే దృశ్యం నాకు అమ్మతనంలోని గొప్పతనం తెలిసేలా చేశాయి. ఇక ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది అదేంటి అంటే ఆమె భర్త గురించి,

ఆమె తీరని కోర్కెల గురించి అడగాలని కానీ అలా అన్ని చూస్తూ కూడా రెండో ప్రశ్నని అడగాలని నాకు అనిపించలేదు, కానీ ఇలా భార్య మీద పిల్లలను వదిలేసి భాద్యత మర్చిపోయిన భర్త గురించి అడగాలని అది కూడా అడిగాను..

దానికి అవ్వ నవ్వుతూ బాగున్నా పిల్లలనే చూడని కాలం బిడ్డా, ఇగ ఇలాంటోళ్లను ఎవరు పట్టించుకుంటారు, వస్తే ఏడ పైసలు అడుగుతానో అని రెండోది రనియాదు, అడు పెళ్లి చేసుకున్న నాడే నా దృష్టిలో సచ్చిన కిందకి లెక్క, ఇట్లా మొగోన్ని అనుడు తప్పే కానీ నేను ఈళ్లతో బాధ పడలే గొడ్రాలును కాదు అనిపించుకున్న

కానీ దీనికి కారణం మేనరికమే కదా దానికే మా అమ్మోళ్ల మీద కోపం అచ్చిన మాట నిజం కానీ అల్లు మాత్రం ఏం సేస్తారు మా బావ నన్ను ఇలా ఇడిషి ఇంకోదాన్ని చేసుకునుడే నాకు నా పిల్లలను అల్లకన్నా మంచిగా పెంచాలి,

సూసుకోవాలి అనే కోరిక  పుట్టి, నా సుఖం సూసుకుంటే ఇగ అమ్మతననికి ఇలువ ఏముంది బిడ్డ అని అంటున్న నాకు నేను అడగకుండానే, ఆమె చెప్పిన సమాధానం విని గర్వoగా ఫీల్ అయ్యాను.

ఇంతలో ఇగో బిడ్డా నా కథ ఇదే  ఇగ మరి నాకు పనికి టైమ్ అయ్యింది పోవాలే, ఇగ మీరు  పైలంగా పొండి అని అంటున్న అవ్వ మాటలకు నేను నా చేతికి ఉన్న గడియారం వైపు చూసాను అప్పుడే తొమ్మిది అయ్యింది,

పనికి పోతావు అవ్వ అని అడిగిన నేను మళ్ళీ ఆమె గుడిసెకు  ఉన్న రేకు తలుపుకు తాళం వేస్తూ ఇప్పుడు చేతనైతలేదు బిడ్డ అందుకే ఆడోళ్ల ఆస్టల్ కూరగాయలు, బట్టలు ఉతికే పనికి ఒప్పుకున్నా ఆడ ఇంత తిండి దొరకుతది,

పైస కూడా వస్తది అని అంటూ తన ఇద్దరు పిల్లలను చెరో  రెక్క పట్టుకుని నడిపించుకుని తీసుకెళ్తుంది. దృశ్యాన్ని చూస్తున్న నాకు తన పిల్లాడిని విపుకు కట్టుకుని యుద్ధం చేసిన వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయి లా కనిపించడం కేవలం యాదృచ్చికం……

తెల్లారి వీడియో దేశాన్ని మొత్తం కుదిపేసింది.ఆమె కష్టం చూసిన కొన్ని ఆపన్న హస్తాలు ఆమెకు ఆర్ధిక సాయం చెయ్యడానికి ముందుకు వచ్చాయి,దాంతో ఇన్నేళ్ల నా కర్తవ్య నిర్వహణలో నేను చేసిన మంచి పని ఏదైనా ఉందంటే అది ఇదే అని అనిపించింది. 

నాకు ఒక తల్లి రుణం కాస్తాయినా తీర్చుకున్న అనే సంతృప్తి కలిగింది.ఇంతకు నేనెవరో మీకు చెప్పలేదు కదూ,నా పేరు విహారి ఒక పత్రికా విలేఖరిని…….

Related Posts