“వెళ్లిపోయావా నేస్తం!” — మహాప్రస్థానం వెనుక ఉన్న విషాద గాథ “కొంపెల్ల జనార్దనరావు” గురించి..
తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని పేర్లు తమ రచనల వల్ల చిరస్థాయిగా నిలుస్తాయి. మరికొన్ని పేర్లు, తాము రాసిన దానికంటే ఇతరులలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, ఒక కొత్త యుగానికి పునాది వేసినందుకు చిరస్మరణీయమవుతాయి. అలాంటి అరుదైన వ్యక్తుల్లో “కొంపెల్ల జనార్దనరావు” ఒకరు.
1906 ఏప్రిల్ 15న ఒక జమీందారీ కుటుంబంలో జన్మించిన కొంపెల్ల, చిన్న వయసులోనే జీవితపు కఠిన వాస్తవాలను ఎదుర్కొన్నారు. కుటుంబ ఆస్తులు కరిగిపోవడంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. కానీ సాహిత్యంపై ప్రేమ మాత్రం ఆగలేదు.
మద్రాసు చేరి భారతి పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేస్తూ తెలుగు సాహిత్యంలో కొత్త ఆలోచనలకు వేదిక కల్పించారు. భావకవిత్వం రాశారు. నాటికలు రచించారు. కానీ ఆయన గొప్పతనం అక్కడితో ఆగిపోలేదు.
ఆయనకు కొత్త కవులంటే అపారమైన ప్రేమ. కొత్త ఆలోచనలంటే అమితమైన గౌరవం. అందుకే ఉదయిని అనే సాహిత్య పత్రికను ప్రారంభించారు. ఆ పత్రిక కోసం ఊరూరా తిరిగారు. చందాలు సేకరించారు. తన ఆరోగ్యాన్ని, తన సౌకర్యాలను, తన భవిష్యత్తును సైతం లెక్కచేయకుండా శ్రమించారు.
ఆ రోజుల్లో యువకవిగా ఉన్న శ్రీశ్రీ రాసిన ప్రభవ కావ్యాన్ని చదివి, “ఇది నీ గొంతుక కాదు. నీ స్వరాన్ని నువ్వే వెతుక్కోవాలి” అని చెప్పిన విమర్శకుడు కొంపెల్లే. ఆశ్చర్యకరంగా, ఆ విమర్శను శ్రీశ్రీ అవమానంగా కాక ఆశీర్వాదంగా స్వీకరించాడు. ఆ విమర్శే ఇద్దరి మధ్య జీవితాంతం నిలిచే స్నేహానికి నాంది అయింది.
తరువాత “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను…” అనే విప్లవ గేయాన్ని ప్రముఖ పత్రికలు తిరస్కరించినప్పుడు, దానిలో దాగి ఉన్న అగ్నిని గుర్తించిన వ్యక్తి కొంపెల్ల. తన ఉదయిని పత్రికలో దానిని ప్రచురించి, భవిష్యత్తులో తెలుగు కవిత్వాన్ని మార్చబోయే స్వరాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు.
కానీ సాహిత్యానికి అంకితమైన ఆ జీవితం చివరకు విషాదాంతమైంది.
పత్రిక కోసం పడిన కష్టం, నిరంతర ఆర్థిక ఒత్తిళ్లు, ఆకలి, అనారోగ్యం—ఇవన్నీ కలిసి ఆయనను క్షయవ్యాధి బారిన పడేలా చేశాయి. సరైన వైద్యం అందలేదు. ఆదుకునే వ్యవస్థ లేదు. గొప్ప కలలు కన్న ఆ సాహిత్యవేత్త, కటిక దారిద్ర్యంలోనే 1937 జూన్ 23న కేవలం 31 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపోయాడు.
ఆ మరణం శ్రీశ్రీని లోలోపల కుదిపేసింది.
“జనార్దనరావును చంపింది క్షయవ్యాధి కాదు; దారిద్ర్యమే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక శ్రీశ్రీ రాసిన స్మృతి గీతమే “వెళ్లిపోయావా నేస్తం!”
ఆ కవితలో ఒక చోట ఆయన ఇలా అడుగుతాడు:
“ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే, ఏదో నేనూ ఆరుగురు స్నేహితులూ తప్ప…”
ఆ పంక్తులు చదివినప్పుడు, అది ఒక కవి రాసిన కవితగా అనిపించదు. తనకు అండగా నిలిచిన స్నేహితుడిని కోల్పోయిన మనిషి గుండె పగిలి ఏడుస్తున్నట్టుగా అనిపిస్తుంది.
కొంపెల్ల జనార్దనరావు ఎక్కువ గ్రంథాలు రాయకపోయి ఉండవచ్చు. గొప్ప పదవులు పొందకపోయి ఉండవచ్చు. కానీ ఒక మహాకవిలోని మహత్తును ముందుగానే గుర్తించి, అతడికి దారి చూపిన వ్యక్తిగా తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన స్థానం ప్రత్యేకమైనది.
బహుశా అందుకేనేమో…
శ్రీశ్రీ తన మహాప్రస్థానంను కొంపెల్లకు అంకితం చేశాడు.
ఎందుకంటే కొంతమంది మనుషులు పుస్తకాల్లో కాదు, ఇతరుల జీవితాల్లో తమ ముద్ర వేస్తారు.
కొంపెల్ల జనార్దనరావు అలాంటి అరుదైన మనిషి.
అంకితం (కొంపెల్ల జనార్థనరావు కోసం)
–శ్రీ శ్రీ
తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి…
తలపోసిన వేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక-
మురికితనం కరకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే-
అటుపోతే, ఇటుపోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి
ఒక్కణ్ణీ చేసి వేధించారని, బాధించారని,
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్లిపోయావా, నేస్తం!
తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!
దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్లిపోయావా, నేస్తం!
చిరునవ్వులనే పరిచేషన చేస్తూ…
అడుగడుగునా పొడచూపే
అనేకానేక శతృవులతో,
పొంచి చీకట్లో కరవజూసే
వంచకాల ఈ లోకంతో పొసగక
అంచితానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీచుట్టూ పోగు చేసుకుని…
అన్నీ తన్నివేశావా, నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!
బరంపురంలో మనం ఇంకా
నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్యసాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
‘ఉదయిని’ సంచికలు పట్టుకుని తిరగడం
జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచికగూళ్లేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకుని
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతామో తెలియని
ఆవేశంతో,
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించిందో, శఠించిందో మనల్ని:
తుదకు నిన్ను విషనాగురలలోనికి లాగి,
వూపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి,
మా కళ్లల్లో గంధక జ్వాలలు,
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి,
మాదారిలో ప్రశ్నార్థ చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా,
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను:
ఎంత మోసగించిందయ్యా మమ్ము:
ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప!
ఆకాశం పడిపోకుండానే ఉంది!
ఆఫీసులకు సెలవు లేదు!
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది!
సానుభూతి సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం!
ఎవరి పనులలో వాళ్లు!
ఎవరి తొందరలో వాళ్లు!
ఎవరికి కావాలి, నేస్తం!
ఎమయిపోతేనేం నువ్వు!
ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే!
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒకమాటకు బలి అయితే,
కనబడని వూహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే! నియంత్రిస్తే!
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయి పోతేనేం నువు?
మా బురద రోజూ హాజరు!
మా బురఖా మేం తగిలించుకున్నాం!
మా కాళ్లకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ముల లాగే!
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు!
లేదు నేస్తం, లేదు!
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము!
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు
భయం లేదులే అయినప్పటికీ
నీ సాహసం ఒక ఉదాహరణ!
నీ జీవితమే ఒరవడి!
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!
కావున ఈ నిరాశామయలోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను!
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహాప్రస్థానం!
కే. రాఘవ్